IND VS BAN T 20 Match : సూర్య.. సంజూ చేతులెత్తేసినచోట.. బంగ్లా పై తెలుగోడి ప్రతాపం.. ఫోర్లు, సిక్సర్లతో విరవిహారం

కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ హ్యాండ్ ఇచ్చాడు. సంజు శాంసన్ చేతులెత్తేశాడు. అంచనాలు పెట్టుకున్న అభిషేక్ శర్మ తలకిందులు చేశాడు. చూస్తుండగానే మూడు వికెట్లు పడిపోయాయి. ఈ దశలో మైదానంలోకి ఆపద్బాంధవుడులా ఎంట్రీ ఇచ్చాడు తెలుగోడు నితీష్ కుమార్ రెడ్డి. ఇక ఆ తర్వాత అసలు కథ మొదలుపెట్టాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : October 9, 2024 9:08 pm

Nithish Kumar Reddy half century

Follow us on

IND VS BAN T 20 Match : బంతితో దీర్ఘకాలం శత్రుత్వం ఉన్నట్టు.. బంగ్లా బౌలర్ల పై విరోధం ఉన్నట్టు.. చెలరేగిపోయాడు నితీష్ కుమార్ రెడ్డి. ఫోర్ కొట్టడం నామోషి అయినట్టు.. సిక్స్ కొడితేనే మజా వచ్చినట్టు.. రెచ్చిపోయాడు. బౌలర్ ఎవరనేది చూడలేదు. బంతి ఎలా వేస్తున్నారని అంచనా వేయలేదు. కొట్టడమే పనిగా పెట్టుకున్నాడు. అది కూడా బంతిని చితక్కొట్టాడు. ఫలితంగా మూడు వికెట్లు టపటపా కోల్పోయిన టీమ్ ఇండియా.. ఆ తర్వాత నిలదొక్కుకుంది. బంగ్లా బౌలర్ల భరతం పట్టింది. ఫలితంగా స్కోర్ రాకెట్ వేగంతో దూసుకుపోయింది. 3 t20 ల సిరీస్ లో భాగంగా గ్వాలియర్ లో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ గెలిచింది. బుధవారం ఢిల్లీ వేదికగా రెండో మ్యాచ్ కొనసాగుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ నిర్ణయం సబబే అని నిరూపిస్తూ బంగ్లా బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేశారు. ఫలితంగా రెండవ ఓవర్ చివరి బంతికి ఓపెనర్ సంజు శాంసన్(10) టస్కిన్ అహ్మద్ బౌలింగ్లో శాంటో కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత అదే దూకుడు బంగ్లాదేశ్ కొనసాగించింది.. భారత్ స్కోరు 25 పరుగుల వద్దకు చేరుకున్నప్పుడు మరో ఆటగాడు అభిషేక్ శర్మ (15) టాన్ జిమ్ హసన్ షకీబ్ బౌలింగ్లో క్లీన్ బౌల్ద్ అయ్యాడు. ఈ దశలో సూర్య కుమార్ యాదవ్ ధాటిగా ఆడతాడని అందరూ భావించారు. అయితే అతడు కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేసి ముస్తాఫిజుర్ బౌలింగ్లో శాంటో కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. చూస్తుండగానే భారత్ 41 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఈ దశలో నితీష్ కుమార్ రెడ్డి, రింకూ సింగ్ మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మార్చేశారు. బంగ్లాదేశ్ జట్టు నుంచి భారత్ వైపు మళ్ళించారు.

ముఖ్యంగా తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి ఢిల్లీ మైదానంలో వీరవిహారం చేశాడు. టి20 లలో తొలి హాఫ్ సెంచరీ సాధించాడు. 34 బంతులు ఎదుర్కొన్న అతడు నాలుగు ఫోర్లు, 7 సిక్సర్ల సహాయంతో 74 పరుగులు చేశాడు. సెంచరీ వైపుగా వెళుతున్న అతడు ముస్తాఫిర్ బౌలింగ్లో మెహది హసన్ మిరాజ్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. నితీష్ కుమార్ రెడ్డి, రింకు సింగ్ నాలుగో వికెట్ కు ఏకంగా 108 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు తరఫున అద్భుతమైన ఆట తీరు దర్శించిన నితీష్ కుమార్ రెడ్డి.. జింబాబ్వే పర్యటనకు ఎంపిక అయ్యాడు. అనుకోకుండా గాయం బారిన పడటంతో.. నేషనల్ క్రికెట్ అకాడమీకే పరిమితమయ్యాడు. శ్రీలంక టూర్ నాటికి కోలుకోలేకపోయాడు. బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత.. టి20 సిరీస్ కు అతడిని ఎంపిక చేశారు. తొలి మ్యాచ్లో 15 పరుగులు చేసి అజేయంగా నిలిచిన అతడు.. రెండో మ్యాచ్లో.. అది కూడా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు 74 పరుగులు చేయడం విశేషం.

&