Ind Vs Aus BGT 2024: తొలి మ్యాచ్ ప్రారంభం కాకముందే టీమ్ ఇండియాకు కోలుకోలేని షాక్ లు తగిలాయి. కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలతో తొలి టెస్ట్ కు దూరమయ్యాడు. అతని భార్య రెండవసారి ప్రసవించింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో రోహిత్ తన భార్య వెంట ఉన్నాడు. ఇక ఇటీవల ప్రాక్టీసులో భారత – ఏ జట్టు తో జరిగిన మ్యాచ్లో గిల్, రాహుల్ గాయపడ్డారు. రాహుల్ ఫిట్ గానే ఉన్నాడని బీసీసీఐ ఫిజియో బృందం చెప్పింది.. దీంతో అతడు టాప్ ఆర్డర్లో ఆడడం విషయంలో నెలకొన్న సందిగ్ధం తొలగిపోయింది. ఇక గిల్ బొటనవేలుకు గాయం కావడంతో.. అతడు తొలి టెస్ట్ కు దాదాపు దూరమైనట్టే. గిల్, రోహిత్ స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పిస్తున్నట్టు బీసీసీఐ సెలక్షన్ కమిటీ తెలిపింది. ఈ జాబితాలో తెలుగు కుర్రాడు ఉండడం విశేషం.
40 టెస్టుల అనుభవం
టీం ఇండియా టెస్ట్ జట్టుకు వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న బుమ్రా.. రోహిత్ గైర్హాజరీతో పెర్త్ టెస్ట్ కు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. బుమ్రా కు 40 టెస్ట్ లలో ప్రాతినిధ్యం వహించిన అనుభవం ఉంది.. బుమ్రా గతంలోనూ ఒక టెస్ట్ మ్యాచ్ కు కెప్టెన్ గా వ్యవహరించాడు. 2022 బర్మింగ్ హమ్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో బుమ్రా నాయకత్వంలో టీమిండియా తలపడింది. ఆ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక సోమవారం టీమిండియా ప్రాక్టీస్ కు విరామం ఇచ్చింది. మంగళవారం నుంచి తొలి టెస్ట్ జరిగే ఆప్టస్ మైదానంలో ప్రాక్టీస్ చేయనుంది. కాగా, రోహిత్ శర్మ నవంబర్ 28న ఆస్ట్రేలియా వెళ్తాడని తెలుస్తోంది. నవంబర్ 30న ఆస్ట్రేలియా పీఎం ఎలెవన్ జట్టుతో జరిగే పింక్ బాల్ వార్మప్ మ్యాచ్ లో పాల్గొనున్నాడు. డిసెంబర్ 6 నుంచి ఆడిలైడ్ వేదికగా జరిగే డే అండ్ నైట్ టెస్ట్ లో రోహిత్ అందుబాటులోకి రానున్నాడు.
కొత్త ఓపెనర్ అతడే
గిల్ కు గాయమైన నేపథ్యంలో కొత్త ఓపెనర్ గా అభిమన్యు ఈశ్వరన్ ఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అభిమన్యు ఈశ్వరన్, యశస్వి జైస్వాల్ టీమ్ ఇండియా ఇన్నింగ్స్ మొదలు పెడతారు.. ఇక తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి, ప్రసిద్ద్ కృష్ణ, ధృవ్ జూరెల్ కు తొలి టెస్ట్ లో అవకాశం దక్కిందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. భారత – ఏ జట్టులో ఇటీవల వీరంతా ఆడారు. అయితే వీరిని ఆస్ట్రేలియాలోనే ఉండాలని టీమిండియా మేనేజ్మెంట్ ఆదేశాలు ఇచ్చింది. దీంతో వారికి పెర్త్ టెస్టులో అవకాశం లభించినట్టేనని.. ప్లే -11 లో వీరికి చోటు ఉంటుందని తెలుస్తోంది.. ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్ జట్టుతో టీమ్ ఇండియా టెస్ట్ సిరీస్ ఆడింది. అప్పుడు కూడా జట్టుకూర్పు ఇలానే ఉంది. ఆ సమయంలో ఐదు టెస్టుల సిరీస్ ను భారత్ 4-1 తేడాతో గెలుచుకుంది. ఇప్పుడు కూడా టీం ఇండియా ఆస్ట్రేలియా పై అదే మ్యాజిక్ కొనసాగిస్తుందని గౌతమ్ గంభీర్ భావిస్తున్నాడు.