https://oktelugu.com/

AP Schools: పాఠశాలల్లో కొత్త టైం టేబుల్.. ఏపీలో మారనున్న స్కూలు పని వేళలు

పాఠశాల విద్య విషయంలో కూటమి ప్రభుత్వం సమూల ప్రక్షాళనకు దిగుతోంది. ఉపాధ్యాయుల సర్దుబాటు, విలీన పాఠశాలలను వెనక్కి తీసుకురావడం వంటి వాటిపై దృష్టి పెట్టింది. తాజాగా పాఠశాలల పనివేళ మార్పునకు నిర్ణయించింది.

Written By: Dharma, Updated On : November 18, 2024 9:29 am
AP Schools

AP Schools

Follow us on

AP Schools: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నత పాఠశాలల పని వేళలు పెంచేలా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. పాఠశాల పనివేళల్లో మార్పులు చేస్తూ కొత్త టైం టేబుల్ సిద్ధం చేశారు. ముందుగా నెల్లూరు జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసి.. రాష్ట్రవ్యాప్తంగా మిగతా ప్రాంతాల్లో అమలుకు నిర్ణయించారు. ప్రస్తుతం పని చేస్తున్న సమయానికి అదనంగా మరో గంట పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వ తాజా నిర్ణయం పై ఉపాధ్యాయ సంఘాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్నత పాఠశాలలు ఉదయం తొమ్మిది నుంచి నాలుగు గంటల వరకు నడుస్తున్నాయి. ఇకనుంచి 9 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా నెల్లూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని భావిస్తోంది. అటు తరువాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేలా నిర్ణయం తీసుకుంది. నెల్లూరు జిల్లాలోని ఒక మండలంలోని ఉన్నత పాఠశాల లేదా హై స్కూల్ ప్లస్లో అమలు చేయాలని తాజాగా ఆదేశాలు జారీచేసింది.

* నెల్లూరులో ప్రయోగాత్మకంగా
నెల్లూరు జిల్లాలో ఈ నెల 25 నుంచి 30 వరకు ఈ టైం టేబుల్ ను అమలు చేయాలని ఆదేశించింది ప్రభుత్వం. అక్కడ ఫీడ్ బ్యాక్ నివేదిక రూపంలో తీసుకొని రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో విస్తరించాలని చూస్తోంది. కొత్త టైం టేబుల్ అమల్లో భాగంగా సాయంత్రం ఐదు గంటల వరకు పాఠశాలల వేళలను పొడిగించనున్నారు. అదేవిధంగా ఉదయం, మధ్యాహ్నం బ్రేక్ సమయాన్ని ఐదు నిమిషాలు, భోజన విరామ సమయాన్ని 15 నిమిషాలు పెంచుతూ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఉదయం మొదటి పీరియడ్ ఐదు నిమిషాలు పెంచి 50 నిమిషాలు చేస్తూ నిర్ణయించారు. ఆ తరువాత మూడు పీరియడ్లను 45 నిమిషాలకు పెంచుతూ కూడా నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం మొదటి పీరియడ్ మార్చకుండా.. అనంతరం మూడు పీరియడ్లను 45 నిమిషాలకు పెంచుతూ మార్పులు చేశారు.

* ఉపాధ్యాయుల్లో మిశ్రమ స్పందన
అయితే ప్రభుత్వ తాజా నిర్ణయం పై ఉపాధ్యాయుల్లో మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. కొంతమంది స్వాగతిస్తున్నారు. మరి కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇది ప్రయోగాత్మకం మాత్రమే. అక్కడ నుంచి వచ్చే నివేదికలు, ఉపాధ్యాయుల నుంచి అభిప్రాయాలను సేకరించి తుది నిర్ణయం తీసుకున్నారు. అయితే పాఠశాలల పని వేళలో మార్పు ఇప్పుడు చర్చకు దారితీస్తోంది.