https://oktelugu.com/

Ind Vs Aus 4th Test: ఆస్ట్రేలియాపై హాఫ్ సెంచరీ కొట్టి ‘తగ్గేదేలే’.. పుష్ప మేనరిజం ప్రదర్శించిన తెలుగోడు నితీష్ కుమార్ రెడ్డి.. వైరల్ వీడియో

జట్టు బలంగా ఉన్నప్పుడు ఎవడైనా కొడతాడు.. అదే కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడితే హీరో అవుతాడు.. శనివారం నాటి బాక్సింగ్ డే టెస్ట్ మూడోరోజు తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా గడ్డపై చూపించింది అదే. చేసింది కూడా అదే. రోహిత్ విఫలమైన చోట.. రిషబ్ పంత్ విఫలమైన చోట.. అతడు నిలబడ్డాడు.. దృఢమైన ఇన్నింగ్స్ ఆడి సరికొత్త రికార్డు సృష్టించాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 28, 2024 / 08:42 AM IST

    ind vs aus 4th test(4)

    Follow us on

    Ind Vs Aus 4th Test:  ఆస్ట్రేలియా టూర్ కు ఎంపికైన తర్వాత నితీష్ కుమార్ రెడ్డి తన ఆట తీరు పూర్తిగా మార్చుకున్నాడు. ఐపీఎల్ అనుభవాన్ని.. డొమెస్టిక్ క్రికెట్ ఆడిన ఎక్స్పీరియన్స్ ను అనుకూలంగా మలచుకున్నాడు. కమిన్స్, స్టార్క్, బోలాండ్, లయన్, హేజిల్ వుడ్.. ఇలా హేమాహేమీల బౌలింగ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. భారీగా పరుగులు చేయనప్పటికీ.. జట్టుకు అవసరమైన ఇన్నింగ్స్ ఆడాడు. మెల్బోర్న్ మైదానంపై మాత్రం హాఫ్ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. ఈ 50 పరుగులు జట్టుకు చాలా అవసరం. నితీష్ కుమార్ రెడ్డికి అత్యంత అవసరం. ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతున్న వేళ.. రిషబ్ పంత్, రవీంద్ర జడేజా పెవిలియన్ చేరుకున్న వేళ.. ఆస్ట్రేలియా బౌలర్లు అదరగొడుతున్న వేళ.. నితీష్ కుమార్ రెడ్డి చేసిన సాహసోపేతమైన హాఫ్ సెంచరీ టీమ్ ఇండియాకు 1000 ఏనుగుల బలం అనడంలో ఎటువంటి సందేహం లేదు.

    నిలబడ్డాడు

    శనివారం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా కొద్ది సమయానికే రిషబ్ పంత్ రూపంలో వికెట్ కోల్పోయింది. దీంతో టీమ్ ఇండియా కష్టాల్లో పడింది. ఈ క్రమంలో మైదానంలోకి వచ్చాడు నితీష్ కుమార్ రెడ్డి. ముందుగా డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా బౌలర్ల బౌలింగ్ అర్థం చేసుకొని దూకుడు మొదలుపెట్టాడు. రవీంద్ర జడేజాతో కలిపి ఏడో వికెట్ కు 30 పరుగులు జోడించాడు. జడేజా అవుట్ అయిన తర్వాత వాషింగ్టన్ సుందర్ తో కలిసి ఇప్పటివరకు ఎనిమిదో వికెట్ కు 62 పరుగుల జోడించాడు. భారత ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ మూడో వికెట్ కు నెలకొల్పిన 102 పరుగుల భాగస్వామ్యం తర్వాత.. నితీష్ కుమార్ రెడ్డి – వాషింగ్టన్ సుందర్ నెలకొల్పిన 62 పరుగుల భాగస్వామ్యమే అత్యుత్తమమైనది.

    పుష్ప రేంజ్ లో..

    మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో 82 ఓవర్లో మూడో బంతిని ఫోర్ కొట్టి.. హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు నితీష్ కుమార్ రెడ్డి. 50 రన్స్ పూర్తి చేసుకున్న తర్వాత పుష్ప మేనరిజం ప్రదర్శించాడు. కుడి చేతిలో ఉన్న తన బ్యాట్ ను తన దవడ కింది భాగానికి ఎడమవైపు లాగవంగా పంపించి.. తగ్గేదేలే అన్నట్టుగా తన హావ భావాలను ప్రదర్శించాడు. నెట్టింట ఈ వీడియో ప్రస్తుతం సంచలనంగా మారింది. హాఫ్ సెంచరీ చేయడంతో నితీష్ కుమార్ రెడ్డి ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చాడు. నితీష్ దూకుడు వల్ల ప్రస్తుతం టీమిండియా 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది.