Ind Vs Aus 4th Test: మెల్ బోర్న్ లో గెలిస్తేనే టీమ్ ఇండియాకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లడానికి అవకాశాలుంటాయి. ఇప్పటికే దక్షిణాఫ్రికా జట్టు అధికారికంగా వచ్చే ఏడాది లార్డ్స్ వేదికగా జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది. తన టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి దక్షిణాఫ్రికా జట్టు ఈ ఘనత అందుకుంది. మెల్ బోర్న్ లో గెలిచి టీమిండియా కూడా వారిలో టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లడానికి బాటలు పరుచుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ అభిమానుల ఆశలను తలకిందులు చేస్తూ టీమ్ ఇండియా మెల్ బోర్న్ లో ఓడిపోయింది. దాదాపు 184 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రెండవ ఇన్నింగ్స్ లో టీమిండియా 155 పరుగులకే కుప్పకూలడం మన బ్యాటింగ్ ఆర్డర్ లోని బేలతనాన్ని సూచిస్తోంది. రోహిత్, విరాట్, రాహుల్, రవీంద్ర జడేజా, నితీష్ లాంటి ఆటగాళ్లు తేలిపోవడం సగటు టీమిండియా అభిమానిని కలవరపాటుకి గురిచేస్తోంది. న్యూజిలాండ్ సిరీస్ కు ముందు నెంబర్ వన్ స్థానంలో ఉన్న టీమిండియా.. ఇలా వరుసగా ఓటములు ఎదుర్కోవడం అభిమానులకు జీర్ణించుకోవడం కష్టంగా మారింది.
అదే వైఫల్యం
మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 474 పరుగులు చేసింది. కానీ అదే సెకండ్ ఇన్నింగ్స్ కు వచ్చేసరికి 234 పరుగులకే కుప్పకూలింది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా ఒకానొక దశలో 91 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో లబూ షేన్(70), కమిన్స్(41) నిలబడ్డారు. ముఖ్యంగా కెప్టెన్ కమిన్స్ అసలు సిసలైన టెస్ట్ క్రికెట్ ఆడాడు. వీరిద్దరూ అవుట్ అయినప్పటికీ బోలాండ్(15), లయన్ (41) జోడి భారత బౌలర్లను తీవ్రంగా ప్రతిఘటించింది. చివరి వికెట్ అయినప్పటికీ వీరిద్దరూ 61 పరుగులు జోడించారు. వీరిద్దరూ ఈ భాగస్వామ్యం నెలకొల్పడంతో ఆస్ట్రేలియా ఏకంగా 234 రన్స్ వరకు చేరుకుంది. వీరిద్దరిని విడదీయడంలో టీమిండియా బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. వీరిద్దరూ దాదాపు 129 బంతులు ఎదుర్కొన్నారు. దాదాపు 22 ఓవర్ల పాటు వీరిద్దరే ఆడారు. ఇదే టీమ్ ఇండియా విషయానికి వస్తే పట్టుమని పది బంతులు కూడా ఆడలేకపోయారు. బుమ్రా 8, సిరాజ్ రెండు బంతులు మాత్రమే ఆడారు. చివరి వికెట్ గా సిరాజ్ వేణు తిరగడంతో టీమిండియా కథ ముగిసింది. ఒకవేళ టీమ్ ఇండియా బౌలర్లు ఆస్ట్రేలియా చివరి వికెట్ వెంటనే తీసినా.. టాప్ ఆర్డర్ ఆటగాళ్లు మెరుగ్గా బ్యాటింగ్ చేసినా.. పరిస్థితి మరో విధంగా ఉండేది. గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయి.. నిలబడాల్సిన చోట పడిపోయి.. టీమిండి ఆటగాళ్లు పరువు తీసుకొని.. అనామకంగా మిగిలిపోవడం సగటు అభిమానిని ఆవేదనకు గురి చేస్తోంది.