Ind Vs aus 3rd Odi: ఇప్పటికే మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా కోల్పోయింది. పెర్త్, అడి లైడ్ వేదికగా జరిగిన వన్డేలలో టీమిండియా ఓడిపోయింది. దారుణమైన ఆట తీరుతో ఆతిధ్య జట్టును అడ్డుకోవడంలో విఫలమైంది. ఈ సంవత్సరంలో ఇంతవరకు ఒక్క వన్డే సిరీస్ కూడా టీమిండియా ఓడిపోలేదు. కానీ ఆస్ట్రేలియా గడ్డం మీద వరుసగా రెండు వన్డేలు ఓడిపోవడమే కాదు.. సిరీస్ కూడా కోల్పోయింది. గిల్ నాయకత్వం వహించిన తొలి వన్డే సిరీస్ లో టీమిండియా ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. రోహిత్ నుంచి మొదలుపెడితే విరాట్ వరకు జట్టులో ఉన్నప్పటికీ వన్డే సిరీస్ కోల్పోవడం అభిమానులకు అంతుపట్టడం లేదు.
ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత విరాట్ కోహ్లీ టీమిండియాలోకి వచ్చాడు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ లెవెల్లో విరాట్ కోహ్లీ ఆడ లేకపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన రెండు వన్డేలలో అతడు ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. వేగంగా పరుగులు తీసే అతడు.. ప్రత్యర్థి బౌలర్ల మీద పరాక్రమాన్ని ప్రదర్శించే అతడు.. ఇలా విఫలమవడం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. దీనికి తోడు ఇటీవల విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత ప్రేక్షకులకు అభివాదం చేసుకుంటూ వెళ్లిపోయాడు. వాస్తవానికి విరాట్ కోహ్లీ ఈ స్థాయిలో ఎన్నడూ ప్రేక్షకులకు అభివాదం చేయలేదు. దీంతో అతడు సిడ్నీ వేదికగా తన రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అందరూ అనుకుంటున్నారు.
సరిగ్గా 10 నెలల క్రితం ఇదే స్టేడియంలో విరాట్ కోహ్లీ తన చివరి టెస్ట్ ఆడాడు. తర్వాత తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు కూడా అదే సన్నివేశం పునరావృతమవుతుందా అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రెండు మ్యాచ్ల్లో కోహ్లీ డక్ అవుట్ అయ్యాడు. దీంతోపాటు విరాట్ కోహ్లీ ప్రస్తుతం లండన్లో స్థిరపడ్డాడు. పైగా అతడు ఇప్పటికే టీ20, సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ సిడ్నీ వేదికగా జరిగే మూడో వన్డేలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని జాతీయ మీడియా లో ప్రచారం జరుగుతోంది. దీనిపై విరాట్ అభిమానులు మాత్రం మరో విధంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకా కొద్దిరోజులపాటు విరాట్ జట్టులో ఉంటాడని.. 2027 వన్డే వరల్డ్ కప్ లో కూడా ఆడతాడని ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విరాట్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకున్న తర్వాత కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నానని విరాట్ కోహ్లీ చెప్పాడు. ఈ ప్రకారం వన్డే ఫార్మాట్ నుంచి కూడా అతడు తప్పుకునే అవకాశాలు ఉన్నాయని ప్రచార జరుగుతోంది.