Yuvraj Singh Six Sixes: అది 2007.. ఐసీసీ టీ 20 ఫార్మాట్ లో వరల్డ్ కప్ ను తెరపైకి తీసుకొచ్చింది. ఆస్ట్రేలియా నుంచి మొదలు పెడితే భారత్ వరకు భయంకరమైన జట్లు పోటీపడ్డాయి. ఈ సిరీస్ లో టీమిండియా ప్రారంభం నుంచి చివరి వరకు అద్భుతమైన విజయాలు అందుకుంది. ధోని ఆధ్వర్యంలో టీమిండియా ఉత్సాహంతో ఉరకలెత్తింది. ముఖ్యంగా ఈ టోర్నీలో యువరాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తన భీకరమైన ఫామ్ ద్వారా తిరుగులేని స్థాయిలో పరుగులు సాధించాడు. ప్రత్యర్థి బౌలర్లకు నరకం చూపించాడు. ఈ సిరీస్ లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
సిరీస్ మొత్తంలో టీమిండియా ఆడిన మ్యాచులు ఒక ఎత్తయితే.. ఇంగ్లాండ్ జట్టుతో ఆడిన మ్యాచ్ మరొక ఎత్తు. ఈ మ్యాచ్లో యువరాజ్ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తుఫాను స్థాయి ఇన్నింగ్స్ ఆడాడు. పరుగుల వరద పారించాడు. మైదానంలో శివతాండవం చేశాడు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ప్రతి బంతిని కసి కొద్దీ కొట్టాడు.. దీంతో టీమిండియా స్కోర్ బోర్డ్ రాకెట్ వేగంతో దూసుకుపోయింది.
యువరాజ్ సింగ్ బీభత్సంగా పరుగులు చేస్తున్న సమయంలో ఇంగ్లాండ్ ఆటగాడు ప్లింటాఫ్ అనవసరంగా గెలుక్కున్నాడు. యువరాజ్ సింగ్ ను రెచ్చగొట్టాడు. దీంతో అతడు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యాడు. అప్పటికే ప్లింటాఫ్ కు సరైన స్థాయిలో బదులిచ్చిన యువరాజ్.. ఆ తర్వాత బ్రాడ్ బౌలింగ్ ను ఊచ కోత కోశాడు. ఏమాత్రం భయపడకుండా పరుగులు తీశాడు. ప్లింటాఫ్ మీద కోపాన్ని బ్రాడ్ మీద తీర్చుకున్నాడు. బ్రాడ్ బౌలింగ్లో ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టాడు. దీంతో చూస్తుండగానే 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ప్రతి బంతిని బలంగా, టెక్నిక్ ఉపయోగించి కొట్టడంతో బౌండరీ అవతల పడింది. దీంతో ఇంగ్లాండ్ బౌలర్ బ్రాడ్ కన్నీటి పర్యంతమయ్యాడు. అయితే ఈ విషయం వెనుక ఉన్న అసలు విషయాన్ని ప్లింటాఫ్ ఇన్నాళ్ళకు బయటపెట్టాడు. అంత కాదు పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేశాడు. ” యువి తో ఆ కారణంగా గొడవపడ్డాను. ఆ సమయంలో నోటి దురుసు వల్ల అడ్డగోలుగా మాట్లాడాను. అతడు నాకంటే కోపిష్టి కావడంతో నాకు తగ్గట్టుగా బదులిచ్చాడు. అంతేకాదు రెచ్చిపోయి ఆరు సిక్సర్లు కొట్టాడు. వాస్తవానికి బ్రాడ్ స్థానంలో నేను ఉండాల్సిందే. బౌండరీ లైన్ వద్ద నేను ఉండగా.. నన్ను చూస్తూ యువరాజ్ సిక్సర్లు కొట్టాడు. యువరాజ్ ఐదు సిక్సర్లు కొట్టగానే.. ఆరో సిక్సర్ కొట్టాలని నేను కోరుకున్నానని” ప్లింటాఫ్ నవ్వుతూ చెప్పాడు.