IND VS BAN Test Match : సాధారణంగా టెస్ట్ అంటే జిడ్డు ఆట అనే అభిప్రాయం అందరిలోనే ఉంటుంది. కానీ దానిని టీమిండియా ఆటగాళ్లు t20 లాగా మార్చారు. కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ మైదానం వేదికగా జరుగుతున్న 2వ టెస్టులో అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వర్షం వల్ల దాదాపు రెండున్నర రోజుల ఆట తుడిచిపెట్టుకుపోయినప్పటికీ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ను దృష్టిలో పెట్టుకొని బంగ్లా జట్టును ఓడించాలని ఉద్దేశంతోనే టీమిండియా బ్యాటర్లు రెచ్చిపోయి బ్యాటింగ్ చేశారు. బజ్ బాల్ క్రికెట్ భయపడేలా.. 147 ఏళ్ల టెస్ట్ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించారు. ముఖ్యంగా రోహిత్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శుభ్ మన్ గిల్, కేఎల్ రాహుల్ బ్యాట్ తో పరాక్రమాన్ని ప్రదర్శించారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (72: 51 బంతుల్లో 12 ఫోర్లు, రెండు సిక్సర్లు), రోహిత్ శర్మ (23: 11 బంతుల్లో ఒక ఫోర్, మూడు సిక్సర్లు), గిల్(39: 36 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్), విరాట్ కోహ్లీ (47: 35 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్), ఆకాశ్ దీప్(12: ఐదు బంతుల్లో రెండు సిక్సర్లు) ఇలా టీమ్ ఇండియా ఆటగాళ్లు సునామీ లాంటి ఆట తీరు ప్రదర్శించడంతో.. తొలి ఇన్నింగ్స్ ను టీమిండియా 285/9 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అయితే ఈ పరుగులను కేవలం 34.4 ఓవర్లలోనే సాధించడం విశేషం. ఒక రకంగా టీమ్ ఇండియా ఆటగాళ్లు టెస్టులలో టి20 తరహా బ్యాటింగ్ చేశారు.
టీమిండియా ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్ (9), రవీంద్ర జడేజా (8), రవిచంద్రన్ అశ్విన్ (1) విఫలమయ్యారు. బంగ్లాదేశ్లో మెహిది హుస్సేన్ మిరాజ్ 4 వికెట్లు పడగొట్టాడు. షకీబ్ కూడా నాలుగు వికెట్లు దక్కించుకున్నాడు. హసన్ మహమూద్ ఒక వికెట్ సొంతం చేసుకున్నాడు.. అయితే బంగ్లా బౌలర్లలో ఈ ఒక్కరు కూడా ఆరు కంటే తక్కువ ఎకానమీ నమోదు చేయకపోవడం విశేషం.. అంటే దీనినిబట్టి టీమిండి ఆటగాళ్లు ఏ స్థాయిలో బ్యాటింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు.. ఇక రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది. జఖీర్ హసన్(10), హాసన్ మహమూద్(4) వెంట వెంటనే అవుట్ అయ్యారు. అశ్విన్ రెండు వికెట్లు సాధించాడు. అయితే ఐదో రోజు కూడా త్వరగా బంగ్లాదేశ్ ను ఆల్ అవుట్ చేసి.. ఆ లక్ష్యాన్ని అత్యంత వేగంగా చేదించి.. రెండో టెస్టులోనూ రికార్డు స్థాయిలో విజయం సాధించాలని టీమిండియా భావిస్తోంది. ఈ విజయం ద్వారా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ కు మార్గాన్ని మరింత సుగమం చేసుకోవాలని యోచిస్తోంది.