ICC women’s World Cup 2025: స్వదేశం వేదికగా జరుగుతున్న మహిళల వరల్డ్ కప్ లో భారత జట్టు పరిస్థితి పడుతూ లేస్తూ సాగుతోంది. శ్రీలంక జట్టుతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 59 పరుగుల తేడాతో గెలిచింది. పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 88 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానానికి ఎదిగింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఈసారి కచ్చితంగా వరల్డ్ కప్ సాధిస్తుందని.. అద్భుతాన్ని ఆవిష్కరిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత టీమిండియా పతనం మొదలైంది. దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన మ్యాచ్లో 250+ పరుగుల టార్గెట్ కాపాడుకోవడంలో టీమిండియా విఫలమైంది. ఈ మ్యాచ్లో మేటి బ్యాటర్లు విఫలమైనప్పటికీ.. దిగువ స్థాయి ఆటగాళ్లు అదరగొట్టారు. అయితే ఆ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో టీమిండియా అంతగా శ్రద్ధ చూపించలేదు. దీంతో ఓటమి తప్పలేదు. వాస్తవానికి ఈ ఓటమి టీమిండియా కు ఒకరకంగా షాక్ అని చెప్పవచ్చు.
ఇక ఆస్ట్రేలియాతో ఆదివారం విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేసి ఏకంగా 330 పరుగులు చేసింది. వన్డే ఫార్మాట్లో ఇది అత్యంత భారీ స్కోరు. అయితే ఈ స్కోరును కూడా కాపాడుకోవడంలో టీమ్ ఇండియా దారుణంగా విఫలమైంది. శ్రీచరణి మినహా మిగతా బౌలర్లు మొత్తం విఫలమయ్యారు. పరుగులు ఇవ్వడంలో పోటీపడ్డారు. ఫీల్డింగ్ కూడా అంతటి మాత్రం గానే ఉండడంతో ఆస్ట్రేలియా వచ్చిన అవకాశాలను వినియోగించుకుంది. ఫలితంగా టీం ఇండియా పై మరో ఓవర్ మిగిలి ఉండగానే విజయం సాధించింది. వాస్తవానికి టీమిండియా ఈ మ్యాచ్లో చేతులారా ఓడిపోయింది. బౌలింగ్లో గొప్ప వైవిధ్యాన్ని చూపించలేకపోయింది. ఫీల్డింగ్లో నేర్పరితనాన్ని ప్రదర్శించలేకపోయింది. చివరికి బ్యాటింగ్ విషయంలో కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. దిగువ శ్రేణి ప్లేయర్లు నాసిరకమైన ఆట తీరు కొనసాగించారు. పూర్తిస్థాయిలో 50 ఓవర్లు ఆడకుండానే ఆల్ అవుట్ అయ్యారు.
అటు దక్షిణాఫ్రికా చేతిలో మూడు వికెట్ల తేడాతో, ఇటు ఆస్ట్రేలియా చేతిలో మూడు వికెట్ల తేడాతో ఓడిపోవడంతో టీమ్ ఇండియా పరిస్థితి ప్రస్తుతం సంకటంలో పడింది. ఇప్పటికే నాలుగు మ్యాచ్లు ఆడిన టీమిండియా.. రెండు విజయాలు, రెండు ఓటములతో పాయింట్లు పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. ఇంగ్లాండ్ రెండో స్థానంలో ఉంది. వరల్డ్ కప్ లో తదుపరి స్థానానికి చేరుకోవాలంటే టీమిండియా మిగతా మూడు మ్యాచ్లలో విజయాలు సాధించాల్సి ఉంది. అక్టోబర్ 19 ఇంగ్లాండ్, అక్టోబర్ 23న న్యూజిలాండ్, అక్టోబర్ 26న బంగ్లాదేశ్ తో పోటీ పడాల్సి ఉంటుంది. ఈ మూడు జట్లలో ఇంగ్లాండ్ నుంచి టీమ్ ఇండియాకు గట్టి పోటీ ఎదురు కావడం ఖాయం. న్యూజిలాండ్ నుంచి కూడా అదే స్థాయిలో ప్రతిఘటన ఎదురవుతుంది. ఇప్పటికే బౌలింగ్లో చేతులెత్తేస్తున్న టీమ్ ఇండియా.. తదుపరి మూడు మ్యాచ్లలో అంచనాలకు మించి రాణించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఈసారి కూడా రిక్త హస్తంతోనే టీమిండియా వెను తిరగాల్సి ఉంటుంది.