ICC Team Rankings : ఐసీసీ ర్యాంకింగ్స్.. భారత్ “తీన్” మార్ కు ఆస్ట్రేలియా బ్రేక్

టి20 ల విషయానికి వస్తే.. భారత్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. రెండవ ర్యాంకులో ఆస్ట్రేలియా, మూడవ స్థానంలో ఇంగ్లాండ్, నాలుగో స్థానంలో సౌత్ ఆఫ్రికా, ఐదవ స్థానంలో న్యూజిలాండ్ ఉన్నాయి.

Written By: NARESH, Updated On : May 3, 2024 6:24 pm

ICC Team Rankings

Follow us on

ICC Team Rankings : గత ఏడాది భారత్ జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో టీమ్ ఇండియాను ఆస్ట్రేలియా ఓడించింది. వరల్డ్ కప్ ను సగర్వంగా స్వదేశానికి తీసుకెళ్ళింది. అంతకుముందు 2003లో జరిగిన వన్డే క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా టీమ్ ఇండియాను ఓడించి కప్ అందుకుంది. ఆ తర్వాత టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరిగితే.. అందులోనూ టీం ఇండియాను ఓడించి టెస్ట్ క్రికెట్ గదను దక్కించుకుంది. ఇలా ప్రతిసారి ఐసీసీ మెగా టోర్నీలో భారత జట్టు కప్ దక్కించుకోకుండా ఆస్ట్రేలియా అడ్డుపడుతూనే ఉంది. మొన్నటిదాకా మన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ అనుకునేవాళ్లం, ఈ పరిణామాలతో ఆ స్థానాన్ని ఆస్ట్రేలియా దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక టి20 వరల్డ్ కప్ ప్రారంభమయ్యే ముందు ఐసిసి వార్షిక ర్యాంకింగ్స్ ప్రకటించింది. ఈ ప్రకారం భారత జట్టు వన్డే, టీ 20 మ్యాచ్లలో మొదటి స్థానంలో కొనసాగుతోంది.. టెస్టులలో మాత్రం టీమిండియాను ఆస్ట్రేలియా వెనక్కి నెట్టి, మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. వాస్తవానికి ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ ను 4-1 తేడాతో భారత్ దక్కించుకుంది. ఈ ఘనవిజయం ద్వారా టెస్ట్ ర్యాంకింగ్స్ లోనూ మొదటి స్థానానికి చేరుకుంది. అంతకుముందు ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉండేది. నిన్నటి దాకా కూడా టీమిండియా టెస్ట్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగేది. అయితే శుక్రవారం ప్రకటించిన వార్షిక ర్యాంకింగ్స్ లో భారత్ తన ప్రథమ స్థానాన్ని కోల్పోయింది. ఆస్థానాన్ని ఆస్ట్రేలియా దక్కించుకుంది. టెస్టుల విభాగంలో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉండగా, భారత్ రెండవ స్థానంలో, ఇంగ్లాండ్ మూడవ స్థానంలో, సౌత్ ఆఫ్రికా నాలుగవ స్థానంలో, న్యూజిలాండ్ ఐదో స్థానంలో కొనసాగుతున్నాయి. దాయాది పాకిస్తాన్ జట్టు టెస్ట్ ర్యాంకింగ్స్ విభాగంలో టాప్ – 5 లో కూడా లేకపోవడం విశేషం.

ఇక వన్డేల విషయానికొస్తే భారత్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ మ్యాచ్లో విఫలమైనప్పటికీ.. అన్ని మ్యాచ్లలో విజయం సాధించడంతో, మెరుగైన పాయింట్లు సాధించి మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత స్థానంలో ఆస్ట్రేలియా, మూడో స్థానంలో సౌత్ ఆఫ్రికా, నాలుగో స్థానంలో పాకిస్తాన్, ఐదో స్థానంలో న్యూజిలాండ్ ఉన్నాయి. టి20 ల విషయానికి వస్తే.. భారత్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. రెండవ ర్యాంకులో ఆస్ట్రేలియా, మూడవ స్థానంలో ఇంగ్లాండ్, నాలుగో స్థానంలో సౌత్ ఆఫ్రికా, ఐదవ స్థానంలో న్యూజిలాండ్ ఉన్నాయి.