Icc T20 World Cup 2024 : టి20 ప్రపంచ కప్ లో భారత జట్టు సమష్టి ప్రదర్శన చేస్తోంది. హ్యాట్రిక్ విజయాలతో గ్రూప్ – ఏ లో టాపర్ గా నిలిచింది. కెనడాతో జరగాల్సిన మ్యాచ్ రద్దయినప్పటికీ.. భారత జట్టు మొదటి స్థానానికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. సూపర్ -8 కు దూసుకెళ్లిన నేపథ్యంలో టీమిండియా గురువారం ఆఫ్గనిస్తాన్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ ను భారత్ వెస్టిండీస్ వేదికగా ఆడుతుంది. వెస్టిండీస్ మైదానాల పై టీమిండియా ఎలాంటి కసరత్తు చేస్తుంది? ఎలాంటి ఆటగాళ్లతో రంగంలోకి దిగుతుందనేది ఆసక్తికరంగా మారింది..
ఇదే క్రమంలో ఓ స్పోర్ట్స్ టీవీ ఛానల్ కు టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఇచ్చిన ఇంటర్వ్యూలో సరికొత్త వ్యాఖ్యలు చేశాడు. అవి సోషల్ మీడియాలో చర్చకు దారితీసాయి.. ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగే మ్యాచ్లో టీమిండియా నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుందట. కులదీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, యజువేంద్ర చాహల్ వంటి వారితో స్పిన్ విభాగం అత్యంత బలంగా కనిపిస్తోంది. వెస్టిండీస్ లాంటి మైదానాలపై నలుగురు స్పిన్నర్లతో దిగడం అనేది అంత ఆషామాషీ కాదు. ఒకవేళ నలుగురు స్పిన్నర్లు రంగంలోకి దిగితే, పేస్ దళం పటిష్టాన్ని కోల్పోతుంది. అయితే రవీంద్ర జడేజా వ్యాఖ్యలు మాత్రం “నలుగురి స్పిన్నర్లను బరిలోకి దించుతారనే” వాదనలకు బలం చేకూర్చుతున్నాయి. “వెస్టిండీస్ మైదానాలు చాలా స్లోగా ఉంటాయి. మేము ఈ. పిచ్ ల పై చాలాసార్లు ఆడాం. ఇక్కడి వాతావరణం ఎందుకనో తెలియదు కాని పొడిగా ఉంటుంది. మ్యాచ్ జరిగేది ఉదయమే కాబట్టి.. మైదానాలు స్పిన్ బౌలింగ్ కు అనుకూలంగా కనిపిస్తున్నాయి. చివరికి డెత్ ఓవర్లు కూడా స్పిన్నర్లతో వేయిస్తారు. అది మీరు తప్పకుండా చూస్తారని” జడేజా వ్యాఖ్యానించాడు.
జడేజా చెప్పినట్టు నలుగురు స్పిన్నర్లతో గనుక రంగంలోకి దిగితే.. సిరాజ్, అర్ష్ దీప్ సింగ్ రిజర్వ్ బెంచ్ కు పరిమితం కావాల్సి ఉంటుంది. టీమిండియా సూపర్ -8 లో తన తొలి మ్యాచ్ బార్బడోస్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్ తో తలపడుతుంది. పైగా ఈ మైదానం స్లో గా ఉంటుంది. ఇది కులదీప్ యాదవ్ బౌలింగ్ కు సరిపోతుందని సీనియర్ క్రికెటర్లు భావిస్తున్నారు. అతడు ఈ మైదానంపై వైవిధ్య భరితమైన బంతులు వేస్తాడని భావిస్తున్నారు.
ఆఫ్ఘనిస్తాన్ తో పోటీపడే భారత జట్టు ఇదే (అంచనా మాత్రమే)
కులదీప్ యాదవ్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, మహమ్మద్ సిరాజ్/ అర్ష్ దీప్ సింగ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, శివం దుబే, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, జస్ ప్రీత్ బుమ్రా.