* ఇంటర్నేషనల్ మ్యాచు ఆడేందుకు ఐసీసీ కొత్త నిబంధనల అడ్డుగోడ
* ఫిట్నెస్ లేకుంటే అండర్ 19 కు ఎందుకు సెలెక్ట్ చేశారు
Vaibhav Surya Vamsi: ఇంగ్లాండ్ లో జరుగుతున్న అండర్ 19 వండే లలో చిచ్చర పిడుగులా రెచ్చిపోతున్న వైభవ్ సూర్య వంశీ ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడేందుకు ఐసీసీ కొత్త నిబంధనలు అడ్డుపడుతున్నాయా అనేది ప్రస్తుతం వాడీ వేడిగా చర్చ జరుగుతోంది. ఐసీసీ నిబంధనల ప్రకారం 15 ఏళ్ల లోపు వారిని సీనియర్ క్రికెట్ జట్టులో ఆడేందుకు అవకాశం లేదు అనేది ఒక కారణమైతే,అంతకన్న తక్కువ వయసు ఉన్న పాకిస్తాన్ క్రికెటర్ హసన్ రాజా 14 ఏళ్ల 227 రోజుల వయసులో 1996 లో జింబాబ్వే తో ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడేందుకు అవకాశం ఇచ్చారు. అయితే అప్పుడు ఈ నిబంధన లేదు. అప్పుడు లేని నిబంధనలు ఇప్పుడు ఎందుకు చేర్చారు. అలాగే వైభవ్ కుడి కాలుకు కండ నొప్పి ఉండడంతో బీసీసీఐ ఫిట్నెస్ ప్యానెల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వలేదనేది మరో కారణం. అంటే ఆగస్టు 2026 వరకు ఫిట్ కావచ్చని అప్పటివరకు అవకాశం లేదని చెబుతున్నారు. కానీ వైభవ్ కోచ్ మనీష్ హోజా మాత్రం వైభవ్ ఆడేందుకు ఇబ్బందులేమీ లేవని అవకాశం వస్తే ఆడవచ్చని అంటున్నారు.
Also Read: అటు ఆర్చర్.. ఇటు బుమ్రా.. లార్డ్స్ లో రాణించే జట్టు ఏదో?
ప్రస్తుతం వైభవ్ వయస్సు 14 ఏళ్ల మూడు నెలలు. అంటే ఇంకా తొమ్మిది నెలలు వైభవ్ నిరీక్షించాలి. ఈ లోపు ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో ఆడి ఇంకా రాటు తేలాలి. అలాగే ఫిట్నెస్ మీద కూడా దృష్టి పెట్టాలి.
సచిన్ అరంగేట్రం చేసినప్పుడు..
1989 లో కరాచీలో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో 16 ఏళ్ల వయసులో సచిన్ కు అవకాశం వచ్చింది. అప్పుడు సచిన్ సెలెక్షన్ పై క్రికెట్ విశ్లేషకులు విమర్శలు చేశారు. కానీ వాటన్నిటిని తిప్పికొట్టి అద్భుతంగా తన కెరీర్ ను తీర్చి దిద్దుకొని, ఎదురులేని క్రికెటర్ గా ఎదిగి గాడ్ ఆఫ్ క్రికెట్ గా ఇండియన్ క్రికెట్ లో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు.
ఒక్క చాన్స్ ఇస్తే ఎలా ఉంటుంది
వైభవ్ కు కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఒక్క చాన్స్ ఇస్తే ఎలా ఉంటుందనే విషయమై కూడా ఒక చర్చ ఊపందుకుంది. ప్రముఖ క్రికెటర్, కామెంటేటర్ రవిశాస్త్రి సైతం ఈ చర్చకు కొంత ఉప్పందించినట్లు ఆయన వైభవ్ గురించి మాట్లాడిన మాటలలో తెలిసిపోతోంది.
ఇది మంచి సమయం
ప్రస్తుతం ఇండియన్ టెస్ట్ స్క్వాడ్ లో మిడిల్ ఆర్డర్ లో సమస్య ఉంది. కేవలం కెప్టెన్ శుభమన్ గిల్, రిషబ్ పంత్, జైస్వాల్, రాహుల్ మాత్రమే చక్కగా ఇంగ్లీష్ బౌలర్లను ఎదుర్కొంటున్నారు. సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి లకు అవకాశం ఇచ్చినా చెప్పుకోదగ్గ ఆట ప్రదర్శించలేక పోయారు. ఆల్ రౌండర్స్ లో జడేజా రాణించినా, వాషింగ్టన్ సుందర్ ఆల్ రౌండర్ గా తన ప్రతిభ చూపలేకపోయాడు. స్క్వాడ్ లో ఉండి ఇంకా అవకాశం కోసం చూస్తున్న అభిమన్యు ఈశ్వరన్, శార్దూల ఠాగూర్, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ దృవ్ జురేల్ కు కూడా అవకాశం వచ్చే ఆస్కారం ఉంది. ఇంకా మూడు టెస్టు మ్యాచ్స్ ఆడాల్సి ఉండగా వీరికి ఒక్కో అవకాశం ఇస్తూ బలమైన టీంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం జరిగిన ఆశ్చర్యపోనవసరం లేదు. మిడిల్ ఆర్డర్ ను చక్కదిద్దే క్రమంలో పావులు కదుపుతున్న ఈ తరుణంలో అన్ని నిబంధనలు పక్కన బెట్టి అవకాశం కల్పించే అవకాశం ఉంటుందా.? ఉంటే అతి పిన్న వయసులో ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన వారిలో వైభవ్ చరిత్ర కెక్కుతాడు.
టెస్ట్ మ్యాచులు ఎలా ఆడుతాడో..?
ఇది ఎలా ఉంటే ప్రస్తుతం అండర్ 19 జట్టు ఇంగ్లండ్ టూర్లో రెండు టెస్ట్ మ్యాచ్ లు ఆడుతారు. వన్డే సిరీస్ లో వీర ప్రతాపం చూపిన వైభవ్ టెస్ట్ మ్యాచ్ లలో ఎలా ఆడుతారో చూడాలి.
మొదటి మ్యాచ్ జూలై 12 న ప్రారంభం అవుతుంది. వన్డే లకు టెస్ట్ లకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒక్కో బాల్ ను జాగ్రత్తగా నింపాదిగా ఆడాల్సి ఉంటుంది. క్రీజ్ లో ఎక్కువ సేపు ఉండగలిగే శైలి అలవర్చుకోవాలి. ఎంతసేపు ఉండగలిగితే అంత భారీ స్కోర్ అందించే వీలుంటుంది. అవసరమైతే రోజుల తరబడి క్రీజులో పాటుకుపోవాల్సి ఉంటుంది. అందుకు తగినట్లుగా ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి. ఒకటి, రెండు రన్స్ కోసం వికెట్ల మధ్య చురుగ్గా కదలగలగాలి. తక్కువ బాల్స్ లో ఎక్కువ స్కోర్ చేయడం టెస్ట్ లో అవసరం లేదు. ఆ విషయం వైభవ్ ఆట తీరు ఎలా ఉంటుందో ఈ టెస్ట్ మ్యాచ్ లతో తెలిసిపోతోంది. అందుకు అనుగుణంగా టెస్ట్ భవిష్యత్ అంచనా వేస్తారు.
-దహెగాం శ్రీనివాస్