India Cricket Team : ఆస్ట్రేలియా చేతిలో ఫైనల్ మ్యాచ్లో భారత్ ఓటమిపాలైంది.. గుజరాత్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో టీమిండియా టైటిల్ దక్కించుకునే అవకాశాన్ని వెంట్రుక వాసిలో కోల్పోయింది.. సిరీస్ మొత్తం ఓటమి అనేది లేకుండా భారత వరుస విజయాలు సాధించింది. ఏకంగా ఫైనల్ దాకా వెళ్ళింది. చివరి అంచెలో అనూహ్యంగా బోల్తా పడింది.. ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి రన్నరప్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఈ టోర్నీ వల్ల భారత క్రికెట్ జట్టుకు కప్ రాకపోయినప్పటికీ.. వచ్చిన లాభాలను ఐసీసీ వెల్లడించింది. దీనికి సంబంధించిన ఆర్థిక నివేదికను విడుదల చేసింది. గత ఏడాది చివర్లో మన దేశం వేదికగా 10 ప్రధాన నగరాలలో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ నిర్వహించింది. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ధర్మశాల, ఢిల్లీ, లక్నో, కోల్ కతా, హైదరాబాద్, పూణే, ముంబై వంటి నగరాలు ఈ మ్యాచ్ లకు ఆతిథ్యం ఇచ్చాయి. ఇలా ఆతిథ్యం ఇవ్వడం ద్వారా విదేశీ పర్యాటకులు ఎక్కువగా వచ్చారని, వారి వసతి, ఇక్కడి దాకా చేసిన ప్రయాణం, రవాణా ఖర్చులు, ఆహారం కోసం చేసిన చెల్లింపులు, పానీయాల కోసం చేసిన ఖర్చు మొత్తం భారత కరెన్సీలో 7,211.50 కోట్ల దాకా వచ్చిందని ఐసీసీ ప్రకటించింది. ఇది అమెరికన్ కరెన్సీ ప్రకారం చూసుకుంటే 861.4 మిలియన్ డాలర్లు ఉంటుందని ఐసిసి వెల్లడించింది. మ్యాచ్ లు చూసేందుకు 1.25 మిలియన్ కంటే ఎక్కువ మంది ప్రేక్షకులు హాజరయ్యారు. అయితే ఇందులో 75% మంది తొలిసారి వన్డే ప్రపంచ కప్ కు హాజరయ్యారు. ఈ మ్యాచ్ ల నిర్వహణ వల్ల ఆతిధ్యరంగంలో 48 వేల మంది కంటే ఎక్కువ మంది తాత్కాలిక, శాశ్వత ఉద్యోగాలు పొందారు.. దీని ద్వారా ఆతిథ్యరంగంలోని ఆర్థిక వ్యవస్థకు 18 మిలియన్ డాలర్ల ఆదాయం చేకూరింది.
పది ప్రధాన నగరాలలో పోటీలు
దేశంలో పది ప్రధాన నగరాలలో పోటీలు నిర్వహించడంతో.. ఆ ప్రాంతాలలోని మైదానాలను బీసీసీఐ ఆధునికీకరించింది. ఆ సమయంలో దేశంలో పలు ప్రాంతాలలో ఎన్నికల వాతావరణం నెలకొన్నప్పటికీ ఆ ప్రభావం పోటీల మీద పడలేదు. పైగా విదేశాల నుంచి ఎక్కువగా అభిమానులు వచ్చారు. వారికి తగ్గట్టుగా స్థానిక అధికారులు సౌకర్యాలు కల్పించారు.. హోటల్ గదులలో బస, నచ్చిన ఆహారం అందుబాటులో ఉంచడం, ఇతర విహారయాత్రలను ప్రమోట్ చేయడం వంటి కార్యక్రమాలను చేపట్టారు.. చివరికి ఫైనల్ పోటీలకు ముందు ఆస్ట్రేలియా, భారత కెప్టెన్లు కమిన్స్, రోహిత్ శర్మ ఫోటోషూట్ లు నిర్వహించారు. అయితే ఇది గుజరాత్ రాష్ట్రంలోనే పలు దర్శనీయ ప్రాంతాలలో జరిగింది. దీంతో ఆ రాష్ట్ర టూరిజాన్ని బిసిసిఐ ప్రమోట్ చేసింది. ఆ తర్వాత విదేశాల నుంచి సందర్శకుల తాకిడి పెరిగింది..” చాలామంది క్రికెట్ అంటే ఏదో రకంగా మాట్లాడుతుంటారు. ఈ గణాంకాలు మేము అడ్డగోలుగా చెప్పడం లేదు. ఇవన్నీ పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాతే వెల్లడిస్తున్నాం. క్రీడల ద్వారా శారీరక ఉల్లాసం, మానసిక దృఢత్వం కలుగుతుంది. అందులో క్రికెట్ ముందు వరుసలో ఉంటుంది. ప్రత్యేకంగా మైదానాలు నిర్మించకపోయినప్పటికీ.. ప్రేక్షకులు భారీగా వచ్చారు. క్రికెట్ పై వారికి ఉన్న ప్రేమను వ్యక్తం చేశారు. అందువల్లే ఈ స్థాయిలో ఆదాయం వచ్చిందని” ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. ఐసీసీ నివేదిక నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు స్పందిస్తున్నారు.. భారత జట్టుకు ట్రోఫీ లభించకపోయినప్పటికీ.. ఆదాయం మాత్రం భారీగా వచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు.