Sandeep Lamichhane: అత్యాచారం కేసు నుంచి స్టార్ క్రికెటర్ కు విముక్తి లభించింది. టి20 వరల్డ్ కప్ లో ఆడేందుకు అవకాశం దక్కింది. ఇందుకు అక్కడి కోర్టు అనుమతి ఇవ్వడంతో అతడికి ఊరట లభించింది. బుధవారం ఈ మేరకు కోర్టు తన తీర్పును వెల్లడించింది.
నేపాల్ దేశంలో సందీప్ లామిచ్చాన్ అనే ఒక క్రికెటర్ ఉన్నాడు. ఇతడు 2022లో ఖాట్మండు లోని హోటల్లో ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణ వినిపించాయి. 17 సంవత్సరాల మైనర్ సందీప్ కు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించింది. దీనిపై అక్కడి నేపాల్ జిల్లా కోర్టు విచారణ చేపట్టింది.ఈ ఏడాది జనవరిలో దోషిగా తేల్చింది. 8 సంవత్సరాల జైలు శిక్ష కూడా విధించింది.. జరిమానా కూడా చెల్లించాలని పేర్కొంది. తనను దోషిగా నిర్ధారించడం పట్ల సందీప్ విచారం వ్యక్తం చేస్తూ.. జిల్లా కోర్టు విధించిన తీర్పును సవాల్ చేసి హైకోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో హైకోర్టులోని జస్టిస్ సూర్య దర్శన్, దేవ్ భట్టా ఆధ్వర్యంలోని ధర్మాసనం నేపాల్ జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును తప్పు పట్టింది. అంతేకాదు సందీప్ నిర్దోషి అని తేల్చింది.
2022 ఆగస్టు 21న ఖాట్మండు లోని భక్తాపూర్ ప్రాంతంలో తనను పలుచోట్లకు తిప్పాడని.. సినిమాంగల్ ప్రాంతంలోని హోటల్ కు తీసుకువచ్చి అత్యాచారం చేశాడని 17 సంవత్సరాల మైనర్ ఆరోపించింది. దీనిపై అక్కడి పోలీస్ స్టేషన్లో సందీప్ పై కేసు నమోదయింది. నేపాల్ జిల్లా కోర్టు కూడా అతనిపై అరెస్టు వారంట్ జారీ చేసింది. ఈ క్రమంలో నేపాల్ క్రికెట్ బోర్డు సందీప్ పై వేటు వేసింది. కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఆడేందుకు వెళ్లి తిరిగి వచ్చిన సందీప్ ను విమానాశ్రయంలోనే పోలీసులు అరెస్టు చేశారు. 2022 నవంబర్లో అతడిని జైలుకు తరలించాలని నేపాల్ జిల్లా కోర్టు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సందీప్ హైకోర్టును ఆశ్రయించి.. బెయిల్ తెచ్చుకున్నాడు.
జిల్లా కోర్టు అతడిని దోషిగా నిర్ధారించడంతో.. సందీప్ హైకోర్టును ఆశ్రయించాడు. అక్కడ కేసును విచారించిన ధర్మాసనం.. పూర్వాపరాలు పరిశీలించి సందీప్ ను నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో సరైన ఆధారాలు లేకపోవడం వల్ల సందీప్ ను దోషిగా నిర్ధారించలేమని ప్రకటించింది. అంతేకాదు ఏకపక్షంగా తీర్పు చెప్పిన జిల్లా కోర్టు మందలించింది. అత్యాచారం కేసులో నిర్దోషిగా బయటపడటంతో సందీప్ కు టి20 వరల్డ్ కప్ లో నేపాల్ జట్టు తరఫున ఆడేందుకు అవకాశం లభించింది.