Kyrgyzstan: కిర్గిజిస్తాన్ హింస: భారత్, పాక్ పౌరులే లక్ష్యంగా హింస.. అసలేం జరిగింది?

హింస నేపథ్యలో భారతీయ విద్యార్థులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు భారత మిషన్ ధృవీకరించింది. వారిని ఇంట్లోనే ఉండమని సూచనలు చేసింది. ఎంబసీతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉండాలని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ విద్యార్థులకు సూచించారు.

Written By: Neelambaram, Updated On : May 20, 2024 2:27 pm

Kyrgyzstan

Follow us on

Kyrgyzstan: కిర్గిజిస్తాన్ లోని బిష్‌కెక్‌లో భారత్, పాక్ విద్యార్థులు స్థానికుల నుంచి బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతోంది. అక్కడి పౌరులు దక్షిణాసియా దేశాల విద్యార్థుల పట్ల ఎందుకు వ్యతిరేకంగా మారారు? కిర్గిజిస్తాన్ వాసులు రెండు దేశాలతో పాటు బంగ్లాదేశ్ పౌరులను లక్ష్యంగా చేసుకొని ఎందుకు దాడులకు పాల్పడుతున్నారు?

మే 18న అంతర్జాతీయ విద్యార్థులపై, ముఖ్యంగా దక్షిణాసియాకు చెందిన వారిని లక్ష్యంగా చేసుకొని మాబ్ హింసకు పాల్పడుతున్నట్లు నివేదికలు వచ్చాయి. ఈ నివేదికల నేపథ్యంలో బిష్‌కెక్‌లోని తమ విద్యార్థులకు ఇంటి లోపలే ఉండాలని ప్రవాస భారతీయులకు అక్కడి రాయబార కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది.

హింస నేపథ్యలో భారతీయ విద్యార్థులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు భారత మిషన్ ధృవీకరించింది. వారిని ఇంట్లోనే ఉండమని సూచనలు చేసింది. ఎంబసీతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉండాలని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ విద్యార్థులకు సూచించారు.

హింసకు కారణం ఇదేనా..?
మే 13వ తేదీ కిర్గిజిస్తాన్ విద్యార్థులు, విదేశీ విద్యార్థులు, ప్రధానంగా పాకిస్తానీ, ఈజిప్షియన్ల మధ్య జరిగిన అల్లర్లకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలే ఉద్రిక్తతలకు కారణం అయ్యాయని స్థానిక మీడియాను ఉటంకిస్తూ NDTV నివేదించింది. విదేశీ ఆతిథ్య విద్యార్థులు ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని స్థానికులు ఘర్షణకు దిగారు.

ఆ విధంగా, అనేక మంది కిర్గిజిస్తాన్ పౌరులు మే 17వ తేదీ రాత్రి వీధుల్లోకి వచ్చారు. మే 13వ తేదీ జరిగిన ఘటనపై తమకు సమాచారం అందిన వెంటనే ముగ్గురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి అంతర్జాతీయ విద్యార్థులు ఉంటున్న వైద్య విశ్వవిద్యాలయ హాస్టళ్లనే హింసాత్మక గుంపులు లక్ష్యంగా చేసుకున్నాయి.

భారత్ ప్రతిస్పందన
సోషల్ మీడియా సైట్ ఎక్స్ (ట్విటర్)లో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఇలా రాశాడు. ‘బిష్కెక్‌లో భారతీయ విద్యార్థుల సంక్షేమాన్ని పర్యవేక్షిస్తున్నాం. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉంది. విద్యార్థులకు నిరంతరం టచ్‌లో ఉండాలని రాయబార కార్యాలయానికి ఆదేశాలు జారీ చేశాం’ అని రాశారు.

భారత రాయబార కార్యాలయం కూడా పరిస్థితి గురించి ఎక్స్ లో వివరించింది. ‘మేము మా విద్యార్థులతో సన్నిహితంగా ఉన్నాము. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉంది. అయితే విద్యార్థులు ప్రస్తుతానికి ఇంటి లోపలే ఉండాలని, ఏదైనా సమస్య ఎదురైతే ఎంబసీని సంప్రదించాలని సూచించారు. ఏదైనా అవసరం కోసం 24×7 సంప్రదింపు నెంబర్ 0555710041.’ అని సూచించింది.