Heinrich Klaasen : వికెట్ కీపింగ్, బ్యాటింగ్లో క్లాసెన్ విధ్వంసానికి పరాకాష్ట లాగా ఉంటాడు. అందువల్లే హైదరాబాద్ జట్టు గత సీజన్లో అద్భుతమైన విజయాలు సాధించింది. అయితే ప్రస్తుతం సొంత ఫ్రాంచైజీ లీగ్ South Africa-20 లో క్లాసెన్ దారుణమైన ఆటతీరు ప్రదర్శిస్తున్నాడు. డర్బన్ సూపర్ జెయింట్స్ జట్టుకు క్లాసెన్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే నాలుగు మ్యాచ్లలో కేవలం 0, 29, 1, 8 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒకటి గోల్డెన్ డక్ అవుట్ కూడా ఉంది. క్లాసెన్ దారుణమైన ఆట తీరు ప్రదర్శించడంతో.. ఆడిన ఐదు మ్యాచ్లలో ఒకే ఒక విజయాన్ని డర్బన్ జట్టు సాధించింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. క్లాసెన్ సరిగ్గా ఆడ లేకపోవడంతో డర్బన్ జట్టు విజయాలు సాధించలేకపోతోంది..
హైదరాబాద్ అభిమానుల్లో ఆందోళన
క్లాసెన్ సరిగ్గా ఆడ లేకపోవడంతో హైదరాబాద్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.. ఎందుకంటే ఇటీవల మెగా వేలంలో క్లాసెన్ ను హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య మారన్ దాదాపు 23 కోట్లు ఖర్చు చేసి రిటైన్ చేసుకుంది. అభిషేక్ శర్మ, హెడ్, కమిన్స్ కంటే ఇతర మీదే ఆశలు ఎక్కువ పెట్టుకుంది. కానీ ఇతడేమో ఆమె ఆశలను అడియాసలు చేసే విధంగా కనిపిస్తున్నాడు. క్లాసెన్ గత రెండు సీజన్లో విధ్వంసకరమైన ఆట తీరును ప్రదర్శించాడు. జట్టులో ఇతర ఆటగాళ్లు చేతులెత్తేసినప్పటికీ.. ఇతడు ఒంటి చేత్తో గెలుపులు అందించాడు.. అందువల్లే క్లాసెన్ ను 23 కోట్ల చెల్లించి కావ్య కొనుగోలు చేసింది.. ఇక అంతర్జాతీయ క్రికెట్లోనూ క్లాసెన్ అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించాడు. ఎన్నో మ్యాచులలో తన బీభత్సమైన బ్యాటింగ్ ను అభ్యర్థి ఆటగాళ్లకు పరిచయం చేశాడు. గత ఏడాది జరిగిన టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టును దాదాపు ఓటమి దాకా తీసుకెళ్లాడు. కానీ దురదృష్టవశాత్తు క్యాచ్ అవుట్ అయ్యాడు. ఒకవేళ క్లాసెన్ కనుక అలానే ఉంటే మాత్రం మ్యాచ్ పరిస్థితి మరో విధంగా ఉండేది. అటువంటి క్లాసెన్ నేడు ఫామ్ కోల్పోయి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. సౌత్ ఆఫ్రికా- 20 లీగ్ లో ఒక మ్యాచ్ లోనూ తన స్థాయికి తగ్గట్టు ఇన్నింగ్స్ ఆడలేక పోతున్నాడు.. సొంత దేశంలో జరుగుతున్న లీగ్ లో విఫలమవుతున్న అతడు.. మరో 60 రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ -2025 లో ఎలా ఆడతాడో అంతుపట్టకుండా ఉంది. ఆ సమయంలోగా అతడు ఫామ్ లోకి వస్తాడా? ఒకప్పటిలాగా ఆడతాడా? క్లాసెన్ బాబాయ్ ఒకవేళ విఫలమైతే కావ్య పాపకు కన్నీళ్లే మిగులుతాయని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు..
మార్చి 21 నుంచి మొదలు
మార్చి 21 నుంచి ఐపీఎల్ 2025 సీజన్ మొదలుకానుంది. ఇటీవల మెగా వేలంలో హైదరాబాద్ జట్టు కమిన్స్ కు 18 కోట్లు, అభిషేక్ శర్మకు 14 కోట్లు, హెడ్ కు 14 కోట్లు, నితీష్ కుమార్ రెడ్డికి ఆరు కోట్లు.. మొత్తంగా 75 కోట్లు వీళ్ళకోసమే ఖర్చు చేసింది. మరి ఈ ఐదుగురు ఆటగాళ్లల్లో ఏ ఒక్కరూ అంచనాలకు మించి రాణించకపోతే హైదరాబాద్ జట్టుకు భారీ నష్టం తప్పదు.