Team India Jersey: జూన్ రెండు నుంచి అమెరికా, వెస్టిండీస్ సంయుక్త వేదికలుగా t20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. జూన్ 5న భారత జట్టు ఐర్లాండ్ తో జరిగే మ్యాచ్ ద్వారా తన టి20 ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించి బీసీసీఐ భారత జట్టు జెర్సీని ఆవిష్కరించింది. ప్రముఖ స్పోర్ట్స్ దుస్తులు, షూస్, ఇతర ఉపకరణాల తయారీ సంస్థ అడిడాస్ దానిని రూపొందించింది. మనదేశంలో క్రికెట్ అభిమానులు ఎక్కువ కాబట్టి.. బీసీసీఐ టీమ్ ఇండియా జెర్సీలను అమ్మకానికి పెట్టింది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ స్టోర్లలో వీటిని అందుబాటులో ఉంచింది. ప్లేయర్స్ ఎడిషన్ ధర రూ. 5,999, ఫ్యాన్స్ ఎడిషన్ ధర రూ. 999 గా నిర్ణయించింది. అయితే వీటి ధరలు ఎక్కువగా ఉన్నాయని అభిమానులు గగ్గోలు పెడుతున్నారు.
ఇటీవల బిసిసిఐ టి20 వరల్డ్ కప్ కు సంబంధించి టీమిండియా జెర్సీని ఆవిష్కరించింది. అయితే ఇది భారతీయ జనతా పార్టీ అధికారిక రంగైన కాషాయాన్ని పోలి ఉందని సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. బీసీసీఐ కార్యదర్శిగా జై షా ఉన్నందున.. జెర్సీని మొత్తం కాషాయ రంగులోకి మార్చాడని ఆరోపణలు వినిపించాయి. గతంలో జెర్సీ చూసేందుకు బాగుండేదని.. ఇప్పుడు మొత్తం బిజెపి రంగు అద్దుకుందనే కామెంట్స్ వెల్లువెత్తాయి. దీనిపై అటు బీసీసీఐ, ఇటు అడిడాస్ నోరు మెదపలేదు. అయితే త్వరలో టోర్నీ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. టీమిండియా జెర్సీని ఆన్లైన్ లో అమ్మకానికి పెట్టారు. ఆఫ్లైన్లో కూడా అందుబాటులో ఉంచారు. కాకపోతే ధరలే తారాస్థాయిలో ఉన్నాయని అభిమానులు చెబుతున్నారు. ఈ రేంజ్ ధరలతో తాము జెర్సీలను కొనుగోలు చేయలేమని వారు అంటున్నారు.
ఐపీఎల్ లో గత కొన్ని సంవత్సరాలుగా జెర్సీలను నిర్వాహక కమిటీ విక్రయానికి పెడుతోంది. దీనివల్ల టీమ్ లతో పాటు, ఐపీఎల్ నిర్వాహక కమిటీ కూడా భారీగా ఆదాయం వస్తోంది. ఈ నేపథ్యంలో టి20 వరల్డ్ కప్ కు కూడా అదే ధోరణి అవలంబించాలని బిసిసిఐ నిర్ణయించింది. గత వరల్డ్ కప్ లోనూ టీమిండియా జెర్సీని విక్రయానికి అందుబాటులో ఉంచింది. అది సత్ఫలితాన్ని ఇవ్వడంతో.. ఇప్పుడు టి20 వరల్డ్ కప్ జెర్సీని కూడా విక్రయానికి అందుబాటులో ఉంచింది..