Homeక్రీడలుRavindra Jadeja Fielding: ప్రపంచంలోనే బెస్ట్ ఫీల్డర్ గా రవీంద్ర జడేజా ఎలా ఎదిగాడు?

Ravindra Jadeja Fielding: ప్రపంచంలోనే బెస్ట్ ఫీల్డర్ గా రవీంద్ర జడేజా ఎలా ఎదిగాడు?

Ravindra Jadeja Fielding: ప్రపంచం క్రికెట్ లో అత్యుత్తమ ఫీల్డర్ గా గుర్తింపు సాధించాడు రవీంద్ర జడేజా. మైదానంలో చురుగ్గా ఉంటూ ప్రత్యర్థులను ఇబ్బందులకు గురి చేయడంలో జడేజా తర్వాతే ఇంకెవరైనా. జడేజా కెరియర్ మొత్తం పరిశీలిస్తే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఎప్పుడైనా ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి తప్ప.. ఫీల్డింగ్ లో మాత్రం మెరుపు వేగంతో మైదానంలో కదులుతూ ప్రత్యర్ధులకు చెక్ పెడుతున్నాడు. జడేజా ఉన్నాడంటే కనీసం 10 నుంచి 15 పరుగుల వరకు ప్రత్యర్ధుల స్కోరు తగ్గుతుంది అనే అంతలా పేరు సంపాదించుకున్నాడు. ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఫీల్డర్ గా పేరుగాంచాడు రవీంద్ర జడేజా. అయితే, ఈ గమ్యం వెనక కఠోర శ్రమ కూడా దాగి ఉంది.

రవీంద్ర జడేజా.. ఈ పేరు వింటే చాలు ఎంతో మంది క్రికెట్ అభిమానులకు మెరుపు వేగంతో కదిలే అద్భుతమైన ఫీల్డర్ కనిపిస్తాడు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లోను సత్తా చాటే ఈ ఆల్ రౌండర్.. ఫీల్డింగ్ లో మాత్రం అంచనాలకు మించి రాణిస్తూ ప్రతి మ్యాచ్ లోనూ అదరగొడుతుంటాడు. ఇప్పటి వరకు తన క్రికెట్ కెరియర్ లో అసాధ్యం అనుకున్న ఎన్నో క్యాచ్ లు అందుకుని, రన్ ఔట్ లు చేసి ఔరా అనిపించాడు జడేజా. ఇలా కూడా స్టంప్ అవుట్ చేయొచ్చా అని అనుకునే ఎన్నో రన్ అవుట్లను జడేజా చేశాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ లో మేటి ఫీల్డర్లుగా పేరుగాంచిన వారిలో జడేజా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. తాజాగా జడేజా ఫీలింగ్ కు సంబంధించిన కొన్ని అద్భుతమైన విజువల్స్ తో ఐసీసీ ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోను చూసిన కోట్లాది మంది క్రికెట్ అభిమానులు.. జడ్డు భాయ్.. ఫీల్డింగ్ లో నీకు తిరుగులేదోయ్ అంటూ.. కామెంట్లు చేస్తున్నారు.

శారీరకంగా ఫిట్ గా ఉన్నప్పుడే సాధ్యం..

క్రికెట్ లో ఫిట్నెస్ కు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఫిట్ గా ఉంటేనే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించేందుకు అవకాశం ఉంది. అయితే, ఫీల్డింగ్లో రాణించేందుకు ఫిట్నెస్ తోపాటు మరింత శ్రమ కూడా అవసరం. ఫీల్డింగ్ లో ప్రత్యేకంగా తీసుకునే శిక్షణ ద్వారా మెరుగైన ఫలితాలను సాధించేందుకు అవకాశం ఉంది. ఫీల్డింగ్ లో అదరగొట్టడం అందరికీ సాధ్యం కాదు. ముఖ్యంగా ఎక్కడ ఫీల్డింగ్ చేసినా అద్భుతాలు చేయడం సాధారణ విషయం ఏమీ కాదు. ఎందుకంటే ఒక్కో ఫీల్డింగ్ ఏరియాలో ఒక్కొక్కరికి ప్రత్యేకత ఉంటుంది. రాహుల్ ద్రావిడ్ వంటి క్రికెటర్ స్లిప్పులో అద్భుతమైన ఫీల్డింగ్ చేస్తాడు. కవర్ పాయింట్ లో కొందరు మెరుగైన ఫీల్డింగ్ చేస్తే, లాంగ్ ఆన్లో మరికొందరు మెరుపు క్యాచ్లను అందుకుంటూ అదరగొడుతుంటారు. కానీ, రవీంద్ర జడేజా ఎక్కడ ఫీల్డింగ్ లో ఉన్న మెరుపు వేగంతో కదులుతూ జట్టుకు ఉపయోగపడుతుంటాడు. ఎంత దూరంలో బంతి ఉన్న అత్యంత వేగంగా వెళ్లి బంతిని అందుకుని వికెట్లను గిరాటేస్తుంటాడు. జడేజా ఈ స్థాయిలో అద్భుతమైన ప్రతిభ చాటడానికి కొన్ని అంశాలు దోహదం చేశాయని పలువురు నిపుణులు చెబుతున్నారు. బంతిని వేసినప్పుడు బ్యాలెన్స్డ్ గా ఉండడం, క్యాచ్ లు అందుకునేందుకు అనుగుణంగా చేతులను సిద్ధం చేసుకోవడం, బంతిపై ఫోకస్ పెట్టడం, బ్యాటర్ గమనాన్ని నిశితంగా పరిశీలించి సరైన దిశగా బంతిని త్రో చేయడం వంటి ప్రాథమిక సూత్రాలను ఒడిసి పట్టుకోవడం ద్వారా రవీంద్ర జడేజా ప్రపంచంలోనే మేటి ఫీల్డర్ గా ఎదిగాడు.. రాణిస్తున్నాడు.

Exit mobile version