WTC Finalలో ఇదేం ఎంపైరింగ్ అయ్యా.. ఎప్పుడూ చూడలా

గిల్ అవుట్ అయిన విధానం పట్ల విమర్శలు వ్యక్తమవుతుండగానే ఫీల్డ్ ఎంపైర్ చేసిన మరో పని మరింత విమర్శలకు, అభిమానుల ఆగ్రహానికి కారణం అవుతోంది.

Written By: BS, Updated On : June 11, 2023 1:32 pm
Follow us on

WTC Final : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో ఎంపైర్లు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది. సుబ్ మన్ గిల్ ఔట్ అంటూ థర్డ్ ఎంపైర్ ఇచ్చిన నిర్ణయాన్ని ఇప్పటికే పెద్ద ఎత్తున అభిమానులు విమర్శిస్తుండగా.. మరో ఫీల్డ్ ఎంపైర్ చేసిన పని మరిన్ని విమర్శలకు కారణమవుతోంది. ఎంపైర్లు ఆస్ట్రేలియా జట్టు విజయానికి పని చేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాలు వేదికగా విమర్శలను అభిమానులు గుప్పిస్తున్నారు.

అంతర్జాతీయ క్రికెట్ లో ఎంపైర్లు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుంది. నిబంధనలను తప్పితే మాత్రం కఠిన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగానే ఎంపైర్లు జాగ్రత్తగా తమ విధులను నిర్వర్తిస్తుంటారు. అయితే, ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో ఎంపైర్లు తీసుకుంటున్న పలు నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా జట్టుకు అనుకూలంగా, వారికి విజయాన్ని చేకూర్చేలా ఎంపైర్ల నిర్ణయాలు ఉంటున్నాయంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వివాదాస్పద నిర్ణయంతో వెనుదిరిగిన గిల్..
డబ్ల్యూటిసి ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు భారత్ కు భారీ లక్ష్యాన్ని విధించింది. 444 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు విజయం దశగా చేజింగ్ జోరుగానే ప్రారంభించింది. రోహిత్ శర్మ, గిల్ జోరుగా బ్యాటింగ్ చేయడంతో ఓవర్ కు ఆరు పరుగులు చొప్పున స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అయితే, ఈ క్రమంలోనే 41 పరుగులు వద్ద బోలాండ్ బౌలింగ్ లో గిల్ ఇచ్చిన క్యాచ్ ను గ్రీన్ అందుకున్నాడు. అయితే, ఈ బంతి భూమికి తాకుతున్నట్లు కనిపించడంతో థర్డ్ ఎంపైర్ కు ఫీల్డ్ ఎంపైర్ రిఫర్ చేశాడు. ఫీల్డ్ ఎంపైర్ ఈ క్యాచ్ ను పలు విధాలుగా పరీక్షించిన సమయంలో బంతి నేలకు తాకినట్లు కనిపించింది. అయినప్పటికీ, థర్డ్ ఎంపైర్ మాత్రం ఔట్ అని ప్రకటించారు. బంతి నేలకు తాకకుండా వేలు కిందన ఉన్నట్లు భావించి నాటౌట్ గా ప్రకటించాడు. అయితే, ఇది అవుట్ గా ప్రకటించడంతో గిల్ నిరుత్సాహంతో వెనుదిరిగాడు. అదే సమయంలో అభిమానుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ అవుట్ పై విమర్శలు వ్యక్తం అయ్యాయి.
ఎంపైర్ సిగ్నల్ తో.. ఆస్ట్రేలియా కు మిగిలిన రివ్యూ..
గిల్ అవుట్ అయిన విధానం పట్ల విమర్శలు వ్యక్తమవుతుండగానే ఫీల్డ్ ఎంపైర్ చేసిన మరో పని మరింత విమర్శలకు, అభిమానుల ఆగ్రహానికి కారణం అవుతోంది. మూడు వికెట్లు పడిన తరువాత భారత జట్టు బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రహానే.. ఆస్ట్రేలియా బౌలర్లను పరీక్షకు గురి చేశారు. ఈ క్రమంలోనే 38వ ఓవర్ బౌలింగ్ చేసిన లియాన్ వేసిన బంతి రహనే ప్యాడ్ కు తాకింది. దీంతో లియాన్ గట్టిగా అప్పీల్ చేశాడు, అయితే, టర్న్ వల్ల బాల్ ఎడమ వైపు వెళుతోందని ఎంపైర్ ఇల్లింగ్ వర్త్ చేతి వేళ్ల ద్వారా లియాన్ కు సూచించినట్లు తెలుస్తోంది. డీఆర్ఎస్ టైమ్ ముగియకముందే ఎంపైర్ సిగ్నల్ ఇవ్వడం ఏంటని, దీంతో ఆస్ట్రేలియా రివ్యూ సేవ్ అయిందని ఇండియా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంపైర్లు ఆస్ట్రేలియా జట్టును గెలిపించేందుకే ఈ విధంగా చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాలు వేదికగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.