MS Dhoni: ధోని సిక్స్ తోనే బెంగళూరు గెలిచింది.. ఇదిగో ప్రూప్స్

చెన్నై ఆటగాళ్లలో రచిన్ రవీంద్ర 61, రవీంద్ర జడేజా 42, అజింక్య రహనే 33, ధోని 25 పరుగులు చేశారు.. ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే చివరి ఆరు బంతుల్లో చెన్నై జట్టుకు 17 పరుగులు అవసరమయ్యాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : May 19, 2024 1:12 pm

MS Dhoni

Follow us on

MS Dhoni: పడి లేచిన కెరటం లాగా బెంగుళూరు జట్టు విజృంభించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో.. గెలిచి చూపించింది. శనివారం చిన్నస్వామి స్టేడియంలో విజయమో వీర స్వర్గమో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో.. విజయం వైపే కదిలింది. బలమైన చెన్నై జట్టుపై 27 పరుగుల తేడాతో గెలుపును సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 218 రన్స్ చేసింది. బెంగళూరు ఆటగాళ్లలో కెప్టెన్ డూ ప్లెసిస్ 54 టాప్ స్కోరర్ గా నిలిచాడు. విరాట్ కోహ్లీ 47, రజత్ 41, గ్రీన్ 38* పరుగులు చేశారు.. చెన్నై బౌలర్లలో మిచెల్ శాంట్నర్ 1/23 తో చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. బెంగళూరు 218 పరుగులు చేసినప్పటికీ.. ప్లే ఆఫ్ వెళ్లాలంటే చెన్నైని 200 రన్స్ కే పరిమితం చేయాలి. అనంతరం బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 191 పరుగులు మాత్రమే చేసి, 27 రన్స్ తేడాతో ఓడిపోయింది. చివరి వరకు ఉత్కంఠ గా సాగిన ఈ మ్యాచ్లో.. 200 మార్క్ చేరుకునేందుకు చెన్నై జట్టు శతవిధాలా ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఉపయోగం లేకుండా పోయింది.

చెన్నై ఆటగాళ్లలో రచిన్ రవీంద్ర 61, రవీంద్ర జడేజా 42, అజింక్య రహనే 33, ధోని 25 పరుగులు చేశారు.. ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే చివరి ఆరు బంతుల్లో చెన్నై జట్టుకు 17 పరుగులు అవసరమయ్యాయి. అయితే చివరి ఓవర్ యష్ దయాళ్ వేశాడు. ఆ బంతిని ధోని భారీ సిక్సర్ కొట్టాడు. దెబ్బకు అది మైదానం అవతల పడింది. దీంతో ఎంపైర్లు మరో బంతిని బెంగళూరు బౌలర్ కు అందించారు. ఆ కొత్తబంతితో యష్ దయాళ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. చివరి 5 బంతుల్లో ఒక్కటంటే ఒక్కటే పరుగు ఇచ్చాడు.

మైదానం అవతల పడిన బంతి కొంతమేర గ్రిప్ కోల్పోయింది. పైగా అది తడిచింది కూడా. ఆ స్థానంలో కొత్త బంతి ఇవ్వడంతో యష్ దయాళ్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. నియంత్రిత వేగంతో.. సరికొత్తగా బంతులు సంధించాడు. చివరికి బెంగళూరు జట్టను గెలిపించాడు.. ఈ విజయంతో బెంగళూరు ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు.. అనంతరం బెంగళూరు కీలక ఆటగాడు దినేష్ కార్తీక్ డ్రెస్సింగ్ రూమ్ లో మ్యాచ్ సాగిన విధానంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ” ధోని బలంగా ఆ బంతిని కొట్టాడు. అది స్టేడియం అవతల పడింది. అది మాకు కలిసి వచ్చింది. కొత్త బంతి రావడం వల్ల మ్యాచ్ బెంగళూరు వైపు మొగ్గింది” అని దినేష్ కార్తీక్ పేర్కొన్నాడు. తొలి ఎనిమిది మ్యాచ్లలో ఒకే ఒక విజయం సాధించినప్పటికీ.. ఆ తర్వాత వరుస విజయాలతో తమ జట్టు ప్లే ఆఫ్ చేరుకుందని దినేష్ కార్తీక్ వ్యాఖ్యానించాడు.