Hong Kong Sixes 2025: చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ మీద భారత్ గెలిచింది.. అయితే ఇది నిర్వహిస్తున్న టోర్నీ కాదు.. ఇతర క్రీడల్లో పోటీ అసలు కానే కాదు. హాంగ్కాంగ్ సిక్సెస్ 2025 టోర్నీలో భాగంగా టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టును ఓడించింది. తద్వారా పాకిస్తాన్ మీద భారత్ తన ఆధిపత్యాన్ని మరింత పటిష్టం చేసుకుంది.. ఫార్మాట్ ఏదైనా సరే.. పోటీ ఏదైనా సరే టీమ్ ఇండియాదే విజయమని నిరూపించింది.. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు.. చూస్తుండగానే ఆ ఉత్సాహం నీరుగారిపోయింది.
Also Read: బలగం వేణు ఏడ్చేశాడు.. నేను ఒకటే మాట చెప్పాను.. తేజ బయటపెట్టిన నిజం…
మాంగ్ కాక్ వేదికగా హాంకాంగ్ సూపర్ సిక్సెస్ 2025 టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీలో టీమిండియా శుభారంభం చేసింది. ఆ జోరును కొనసాగించలేకపోయింది.. తొలి మ్యాచ్లో దినేష్ కార్తీక్ ఆధ్వర్యంలో టీమిండియా పాకిస్తాన్ జట్టుపై రెండు పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.. ఈ మ్యాచ్లో రాబిన్ ఊతప్ప 11 బంతుల్లో 28 పరుగులు చేశాడు.. భరత్ 13 బంతుల్లో 24 పరుగులు చేశాడు.. దీంతో పాకిస్తాన్ ఓడిపోక తప్పలేదు.. డక్ వర్త్ లూయిస్ విధానంలో చివరికి భారత జట్టును నిర్వాహకులు విజేతగా ప్రకటించారు. పాకిస్తాన్ జాట్టుతో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ ఆరు ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. పాకిస్తాన్ 3 ఓవర్లలో వికెట్ నష్టానికి 41 రన్స్ చేసింది. ఖాజా 18 పరుగులు చేశాడు. సమద్ 16 పరుగులతో అదరగొట్టాడు.
అయితే శనివారం కువైట్ జట్టుతో టీమిండియా తదుపరి మ్యాచ్ ఆడింది.. డీకే సేన టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.. ముందుగా బ్యాటింగ్ చేసిన కువైట్ ఆరు ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది.. ఓపెనర్లు అద్నాన్ 6, మీట్ బావ్సర్ 0 పరుగులకు అవుట్ అయ్యారు. వికెట్ కీపర్ రవిజ 7 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు. ఈ దశలో యాసిన్ పటేల్ 14 బంతుల్లో 58 పరుగులు చేశాడు. ఇక చివర్లో మహమ్మద్ షఫీ 4 బంతుల్లో 9 రన్స్ రాబట్టాడు. భారత బౌలర్లలో అభిమన్యు రెండు వికెట్లు సాధించాడు. షాబాజ్, స్టువర్ట్ బిన్నీ, దినేష్ కార్తీక్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం భారత జట్టు 5.4 ఓవర్లలో కేవలం 79 పరుగులు మాత్రమే చేసి ఆల్ అవుట్ అయింది. రాబిన్ ఊతప్ప 0 పరుగులకు అవుట్ అయ్యాడు.. ప్రియాంక్ 17, దినేష్ కార్తీక్ ఎనిమిది, బిన్నీ రెండు పరుగులు మాత్రమే చేశారు. చివర్లో అభిమన్యు తొమ్మిది బంతుల్లో 26.. షాబాజ్ 19 పరుగులు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.. దీంతో భారత జట్టు 27 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో తలపడింది.. ముందుగా దినేష్ కార్తీక్ సేన బ్యాటింగ్ చేసింది.. ఓపెనర్లు భరత్ 4, ప్రియాంక్ 0, బిన్నీ విఫలమయ్యారు.. ఈ దశలో అభిమన్యు దుమ్మురేపాడు.. 16 బంతుల్లో 50 పరుగులు చేశాడు. దినేష్ కార్తీక్ 42 పరుగులు చేయడంతో భారత్ మూడు వికెట్ల నష్టానికి 107 రన్స్ చేసింది. అయితే 108 రన్స్ టార్గెట్ తో రంగంలోకి దిగిన యూఏఈ మరో బంతి మిగిలి ఉండగానే టార్గెట్ ఫినిష్ చేసింది. కెప్టెన్ ఖలీద్ మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. సాగిర్ 31 పరుగులతో అదరగొట్టాడు.