https://oktelugu.com/

India Vs Bangladesh: నేను సెంచరీ చేయడానికి కారణం అతడే.. రవిచంద్రన్ అశ్విన్

బంగ్లాదేశ్ జట్టుతో చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. 80 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 339 పరుగులు చేసింది.. టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (102*) సెంచరీ చేశాడు. రవీంద్ర జడేజా(86*) అతడికి అండగా నిలిచాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 19, 2024 / 08:13 PM IST

    India Vs Bangladesh(5)

    Follow us on

    India Vs Bangladesh: రవిచంద్రన్ అశ్విన్ 112 బంతుల్లో 10 ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 102* పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా 117 బంతుల్లో పది ఫోర్లు, రెండు సిక్సర్లతో 86* పరుగులు చేశాడు. వీరిద్దరూ ఏడో వికెట్ కు 195* పరుగులు జోడించారు. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 80 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 339 రన్స్ చేసింది. రవిచంద్రన్ అశ్విన్ అజేయంగా 102 పరుగులు చేశాడు. తొలి రోజు మ్యాచ్ ముగిసిన అనంతరం రవిచంద్రన్ అశ్విన్ అధికారిక బ్రాడ్ కాస్టర్ జియో సినిమాతో మాట్లాడారు. తాను చేసిన సెంచరీపై ఆసక్తికర విషయాలు తెలియజేశాడు..”తమిళనాడు ప్రీమియర్ లీగ్ నాకు ఎంతగానో ఉపకరించింది. ఆ టోర్నీ వల్ల నా బ్యాటింగ్ మెరుగయింది. నాకు ఎంతో ఇష్టమైన చెన్నై మైదానంలో సెంచరీ చేయడం ఆనందంగా ఉంది. సొంత అభిమానుల ముందు ఆడటం నాకు ప్రత్యేకమైన అనుభూతి. ఈ స్టేడియంలో ఆడటం నాకు చాలా చాలా ఇష్టం.

    ఈ మైదానంలో నాకు గొప్ప గొప్ప అనుభూతులు ఉన్నాయి. చివరిసారిగా ఈ మైదానంపై నేను టెస్ట్ వాడినప్పుడు సెంచరీ కొట్టాను. అప్పుడు రవి శాస్త్రి హెడ్ కోచ్ గా ఉన్నారు. తమిళనాడు ప్రీమియర్ లీగ్ టి20 టోర్నీ ఆడటం వల్ల నా బ్యాటింగ్ అత్యున్నతంగా మారింది. నేను అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతులను ఎదుర్కొన్నప్పుడు నా బ్యాట్ ను అలా ఊపేస్తూ ఉంటాను. ఇలాంటి మైదానాలపై దూకుడుగా ఆడాలి. రిషబ్ పంత్ ఆ తరహా లో ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే ఇది పాత తరహా చెన్నై మైదానం. బంతి బౌన్స్ అవుతుంది. క్యారీ కూడా చేయాల్సివస్తుంది. రెడ్ సాయిల్ పిచ్ పై షాట్స్ స్వేచ్ఛగా ఆడొచ్చు. నా సెంచరీ ఇన్నింగ్స్ లో జడేజా నాకు అండగా ఉన్నాడు. వాతావరణంలో ఉక్కపోత అధికంగా ఉండడంతో ఇబ్బంది పడ్డాను. కొంతమేర అలసిపోయాను. చెమటలు పట్టడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఈ విషయాన్ని జడేజా త్వరగా పసిగట్టాడు. నన్ను ముందుకు నడిపించాడు. ధైర్యంగా ఆడేలా ప్రోత్సహించాడు. మా జట్టులో అత్యుత్తమ ఆటగాళ్లలో జడేజా ముందు వరుసలో ఉంటాడు. నాకు మరో ఎండ్ లో నాకు బాసటగా నిలిచాడు. బ్యాటింగ్ లో మెలకువలు నేర్పించాడు. అతని వల్లే సింగిల్స్ ను నేను డబుల్స్ తీశాను. ఇది నాకు చాలా ఉపకరించింది. ముందుగానే చెప్పినట్టు ఇది పాత తరహా చెన్నై మైదానం. ఎక్స్ ట్రా స్పిన్ బౌన్స్ అవుతోంది. మ్యాచ్ నడుస్తున్న కొద్ది వికెట్ ఇబ్బందికరంగా ఉంది. కొత్త బంతి బౌలర్లకు అద్భుతంగా సహకరిస్తోంది. రేపు మేము మరింత ఉత్సాహంగా బరిలోకి దిగుతామని” అశ్విన్ వివరించాడు.

    అంతకుముందు బ్యాటింగ్ చేసిన రోహిత్ (6), విరాట్ కోహ్లీ(6), గిల్(0), రాహుల్ (16) పూర్తిగా విఫలమయ్యారు. కీలక సమయంలో రిషబ్ పంత్ (39), యశస్వి జైస్వాల్ (56) వెనుతిరిగారు. ఈ దశలో కష్టాల్లో ఉన్న భారత జట్టును రవిచంద్రన్ అశ్విన్ (102*), రవీంద్ర జడేజా (86*) ఆదుకున్నారు. ఏడో వికెట్ కు అజేయంగా 195 పరుగులు జోడించారు. దీంతో భారత జట్టు పెళ్లిరోజు ఆట ముగిసిన సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి 339 రన్స్ చేసింది.