India Vs Australia 2nd Test: ప్రత్యర్థులు ఆటగాళ్లను మానసికంగా వేధించే ఆస్ట్రేలియా ఆటగాళ్లు.. ఎన్నో మ్యాచ్ లు గెలిచారు. సౌత్ ఆఫ్రికా నుంచి మొదలు పెడితే భారత జట్టు వరకు అన్నీ ఆస్ట్రేలియా బాధిత దేశాలే. క్రికెట్లో ఇప్పటివరకు నమోదైన వివాదాలను ఒక్కసారి పరిశీలిస్తే.. అందులో సింహభాగం ఆస్ట్రేలియా జట్టు పేరు మీదనే ఉంటాయి. క్రికెట్ ప్రపంచం విమర్శించినా.. మీడియా ప్రశ్నించినా ఆస్ట్రేలియా ఆటగాళ్లు మారరు. వారి వ్యవహార శైలి మారదు. ఆధునిక క్రికెట్లో స్లెడ్జింగ్ కు సరికొత్త అర్ధాన్ని ఇచ్చి.. విజయాలను దక్కించుకున్న అత్యంత చెత్తజట్టుగా ఆస్ట్రేలియాకు పేరుంది. అయితే ప్రత్యర్థి ఆటగాళ్లను విమర్శిస్తూ పండగ చేసుకునే ఆస్ట్రేలియా ప్లేయర్లు.. తమ వరకు వచ్చేసరికి భిన్నంగా ప్రవర్తిస్తుంటారు. తమను ప్రశ్నిస్తే ఏమాత్రం తట్టుకోలేరు. సొంత జట్టు ఆటగాడు విమర్శిస్తే చివరికి అతడిని బయటికి పంపించేదాకా నిద్రపోరు. ఇప్పుడు క్రికెట్ ఆస్ట్రేలియాలో అటువంటి సంఘటనే చోటుచేసుకుంది.
అందుకే దూరం పెట్టారు
పెర్త్ టెస్టులో కమిన్స్ లాంటి బౌలర్ విఫలమైనా.. లయన్ సత్తా చాట లేకపోయినా.. హేజిల్ వుడ్ మాత్రం అదరగొట్టాడు. సంచలన బౌలింగ్ తో టీమిండియా కు చుక్కలు చూపించాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 150 పరుగులకే కుప్పకూలడం వెనక హేజిల్ వుడ్ కీలక పాత్ర పోషించాడు. అయితే తొలి టెస్ట్ లో ఆస్ట్రేలియా 295 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమి నేపథ్యంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లను మీడియా కొన్ని ప్రశ్నలు అడిగింది. ” ఇక్కడ ఓడిపోయారు. రెండవ టెస్టులోనైనా మీరు పుంజుకుంటారా? మెరుగ్గా ఆడతారా?” అని మీడియా ప్రశ్నించగా.. ” మీరు ఆ ప్రశ్న అడగాల్సింది నన్ను కాదు. పోయి బ్యాటర్లను అడగండి.. వారు మీకు సమాధానం చెబుతారు అంటూ” హేజిల్ వుడ్ సమాధానం ఇచ్చాడు. హేజిల్ వుడ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆస్ట్రేలియా డ్రెస్సింగ్ రూమ్ లో కలకలం సృష్టించాయి. దీంతో జట్టు ఆటగాళ్లు, మాజీ ఆటగాళ్లు హేజిల్ వుడ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే హేజిల్ వుడ్ అలాంటి సమాధానం ఇవ్వడం క్రికెట్ ఆస్ట్రేలియా కూడా నచ్చలేదు. దీంతో వెంటనే అతనిపై వేటు వేసింది. పైకి గాయం అని చెబుతున్నప్పటికీ.. హేజిల్ వుడ్ ఆరోగ్యంగానే ఉన్నాడు. గాయం పేరుతో అతడిని సిరీస్ మొత్తానికి దూరం చేస్తున్నారనే విషయాన్ని టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ కూడా అంగీకరించాడు. అయితే హేజిల్ వుడ్ గాయం పై వస్తున్న వార్తలను అతడి మేనేజర్ నీల్ మాక్స్ వెల్ తప్పు పట్టాడు. ఇలాంటి నిరాధారమైన వార్తలను ఎందుకు ప్రసారం చేస్తున్నారని మండిపడ్డాడు.