India Vs Australia 2nd Test: పెర్త్ టెస్ట్ ఓటమితో ఆస్ట్రేలియాపై ఒత్తిడి పెరిగింది. ఏకంగా ఏడుగురు ఎడమ చేతి వాటం బ్యాటర్లు ఉన్నప్పటికీ బుమ్రా బౌలింగ్ కు దాసోహం అవ్వడం ఆస్ట్రేలియా జట్టుకు మింగుడు పడటం లేదు. ఇదే ఇలా ఉంటే ఆస్ట్రేలియా జట్టు స్టార్ బౌలర్ హేజిల్ వుడ్ గాయానికి గురయ్యాడు. తొలి టెస్ట్ లో అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు.. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 150 పరుగులకు కుప్పకూలడం వెనుక కీలక పాత్ర పోషించాడు. అయితే అటువంటి బౌలర్ రెండవ టెస్టుకు దూరం అయ్యాడు. రెండవ టెస్ట్ డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా డే అండ్ నైట్ విధానంలో జరగనుంది. అయితే గులాబి బంతితో ఈ టెస్ట్ నిర్వహించనున్నారు. గతంలో ఇదే వేదికపై జరిగిన టెస్టులో భారత్ 36 పరుగులకే కుప్పకూలింది. అప్పుడు కూడా పింక్ బాల్ తోనే టెస్ట్ నిర్వహించారు. ఇక ఈసారి భారత్ అంతటి దారుణంగా ఆడదని స్వయంగా ఆస్ట్రేలియా ఆటగాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఇక అడిలైడ్ టెస్ట్ కోసం ఆస్ట్రేలియా జట్టును ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.. ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హేజిల్ వుడ్ మ్యాచ్ కు దూరమయ్యాడు. ఎందుకంటే అతడు పక్కటెముకలు గాయంతో ఇబ్బంది పడుతున్నాడు.. ఇక తొలి టెస్ట్ లో మార్ష్ అంతగా ఆకట్టుకోలేదు. అతడిని దూరం పెట్టి మరొక ఆటగాడికి అవకాశం ఇస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. అతడు రెండవ టెస్టుకు జట్టులోనే కొనసాగుతాడని తెలుస్తోంది. హేజిల్ వుడ్ స్థానంలో బోలాండ్ కు అవకాశం ఇచ్చారని సమాచారం.
బోలాండ్ పై ఆశలు
బోలాండ్ పై ఆస్ట్రేలియా జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. పింక్ బాల్, డే అండ్ నైట్ టెస్ట్ కావడంతో భారత్ పై పై చేయి సాధించడానికి అవకాశం ఉంటుందని ఆస్ట్రేలియా జట్టు భావిస్తోంది. తొలి టెస్టులో ఏకంగా 295 పరుగుల తేడాతో ఓడిపోయిన నేపథ్యంలో.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. మైదానంలో చెమటలు కక్కుతూ ప్రాక్టీస్ చేస్తున్నారు. హేజిల్ వుడ్ మినహా.. మిగతా వారంతా రెండవ టెస్టులో ఆడతారని ఇప్పటికే ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ ప్రకటించింది. ఈ ప్రకారం చూసుకుంటే ఆటగాళ్ల ప్రతిభ పై ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ బలమైన నమ్మకంతో ఉంది. మరోవైపు టీమిండియా కూడా తీవ్రంగా శ్రమిస్తోంది. తొలి టెస్ట్ కు దూరమైన గిల్, రోహిత్ రెండవ టెస్టులోకి అందుబాటులోకి వచ్చారు. దేవదత్, ధృవ్ జూరెల్ పై వేటు పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది..
ఆస్ట్రేలియా జట్టు ఇదే
కమిన్స్(కెప్టెన్), స్టివ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కేరి, స్టార్క్, బోలాండ్, లయన్.