CM Chandrababu : కూటమి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పాలనతో పాటు సంక్షేమంపై కూడా దృష్టి పెట్టింది.అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్న క్రమంలో మరింత దూకుడుగా ముందుకెల్తోంది.అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం వంటి పథకాలు అమలు చేయాలని చూస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ మొత్తాన్ని పెంచింది.మూడు నెలల బకాయిలతో కలిపి చెల్లింపులు చేసింది. మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తోంది. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు చర్యలు ప్రారంభించింది. కొత్త ఇళ్ల మంజూరుకు సైతం కసరత్తు చేస్తోంది. జన్మభూమి కార్యక్రమాన్ని పునరుద్ధరించాలని భావిస్తోంది. గత వైసిపి ప్రభుత్వం వివిధ కారణాలతో నిలిపివేసిన పథకాలను.. తిరిగి ప్రారంభించాలని చూస్తోంది. ముఖ్యంగా దివ్యాంగుల విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించి మార్గదర్శకాలు కూడా జారీ చేసింది.
* మూడు చక్రాల వాహనాలు
దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల ద్విచక్ర వాహనాలను అందించేందుకు నిర్ణయం తీసుకుంది చంద్రబాబు సర్కార్. ఈ ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు సైతం ఆమోదం తెలిపారు. ఆర్థిక శాఖ ఈ మేరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నుంచి నిధులు మంజూరు చేయనుంది. ఆ వెంటనే దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గంలో పదిమందికి చొప్పున 1750 మంది దివ్యాంగులకు ద్విచక్ర వాహనాలను అందించాలని లక్ష్యంగా చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1750 మంది దివ్యాంగులకు త్వరలో త్రిచక్ర వాహనాలు అందించనున్నారు.
* ధర లక్ష రూపాయల పై మాటే
గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలోనే త్రిచక్ర వాహనాలను అందించారు. ఇప్పుడు మరోసారి అందించేందుకు సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం ఈ త్రిచక్ర వాహనం ఖరీదు లక్ష రూపాయలు. ఇందుకోసం 17 కోట్ల 50 లక్షలు కేటాయించినట్లు తెలుస్తోంది. ఏటా పదిమంది దివ్యాంగులకు ప్రతి నియోజకవర్గంలో అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వైసిపి హయాంలో ఈ పథకం నిలిచిపోయింది. దీనిని పునరుద్ధరించాలన్న డిమాండ్ దివ్యాంగుల నుంచి వచ్చింది. దీనిపై సానుకూలంగా స్పందించారు సీఎం చంద్రబాబు. ఒకసారి కాకుండా ప్రతి ఏడాది.. 1750 చొప్పున ద్విచక్ర వాహనాలను అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
* మార్గదర్శకాలు జారీ
దివ్యాంగులకు త్రిచక్ర వాహనాల పంపిణీకి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేశారు. డిగ్రీ, ఆపై చదువుకున్న వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అదేవిధంగా ఏడాది కాలానికి పైబడి స్వయం ఉపాధి రంగంలో ఉన్నవారికి ఈ పథకం అమలులో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. 70 శాతం, అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి వీటిని అందించాలని డిసైడ్ అయ్యారు. 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న వారికి అర్హులుగా పరిగణించనున్నారు. అలాగే మూడు లక్షల ఆదాయ పరిమితిని ఖరారు చేశారు. వీటికి సంబంధించి త్వరలో ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనుంది.