Odi World Cup 2023: టీమిండియాకు గట్టి షాక్.. పాండ్యా ఔట్.. అతడి ప్లేసులో ఎవరంటే?

వరల్డ్ కప్ 2023లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత జట్టు.. ఆదివారం న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ ప్రపంచ కప్‌లో ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు మాత్రమే ఓటమిని చవి చూడలేదు.

Written By: Raj Shekar, Updated On : October 20, 2023 1:06 pm

Odi World Cup 2023

Follow us on

Odi World Cup 2023: వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకూ ఓటములు ఎరగని భారత్, న్యూజిలాండ్ జట్లు ఆదివారం ధర్మశాల వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ముగింట టీమిండియాకు షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఈ మ్యాచ్‌కు దూరం కానున్నాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో హార్దిక్ బౌలింగ్ చేస్తున్న సమయంలో గాయపడిన సంగతి తెలిసిందే.

కీలక మ్యాచ్ కు ముందు..
వరల్డ్ కప్ 2023లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత జట్టు.. ఆదివారం న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ ప్రపంచ కప్‌లో ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు మాత్రమే ఓటమిని చవి చూడలేదు. దీంతో పాయింట్ల పట్టికలో టాప్‌లో ఈ రెండు జట్ల మధ్య పోరు కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎంతో కీలకమైన ఈ మ్యాచ్‌కు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య దూరమయ్యే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేసే సమయంలో.. బంతిని కాలితో ఆపేందుకు ప్రయత్నించిన హార్దిక్ పాండ్య గాయపడ్డాడు. నొప్పితో బాధపడిన పాండ్య.. కుంటుతూ మైదానాన్ని వీడాడు. దీంతో విరాట్ కోహ్లి ఆ ఓవర్ పూర్తి చేయాల్సి వచ్చింది.

గాయంపై కెప్టెన్ అప్డేట్..
మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. హార్దిక్ పాండ్య గాయంపై అప్డేట్ ఇచ్చాడు. గాయం ఏమంత తీవ్రమైంది కాదన్న రోహిత్.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉండటం అనుమానమేనన్నాడు. రోహిత్ అనుమానించినట్టుగానే.. కివీస్‌తో మ్యాచ్‌కు పాండ్య దూరం అవుతాడని తెలుస్తోంది. కాగా, హార్దిక్ పాండ్య నేషనల్ క్రికెట్ అకాడమీ డాక్టర్‌ను కలవనున్నాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో మ్యాచ్ కోసం లక్నో బయల్దేరి వెళ్లనున్నాడు. పుణే నుంచి భారత ఆటగాళ్లు ధర్మశాల పయనం అవుతుండగా.. హార్దిక్ టీమ్‌తోపాటు అక్కడికి వెళ్లడం లేదని తెలుస్తోంది.

టీమిండియాకు దెబ్బే..
ఆల్‌రౌండర్ అయిన హార్దిక్ గాయపడటం టీమిండియాకు గట్టి దెబ్బగానే భావించొచ్చు. బ్యాట్‌తోనూ, బంతితోనూ సమానంగా రాణించే పాండ్య జట్టుకు సమతూకం తెస్తున్నాడు. శార్దుల్ ఠాకూర్‌ కంటే హార్దిక్ పాండ్యపైనే రోహిత్ శర్మ ఎక్కువ నమ్మకం పెట్టుకుంటున్నాడు. శార్దుల్ కంటే అతడితోనే ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయిస్తున్నాడు. ఇప్పుడు హార్దిక్ గాయంతో.. భారత జట్టులో రెండు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. శార్దుల్ స్థానంలో షమీ లేదా అశ్విన్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉండగా.. హార్దిక్ బదులు సూర్యకుమార్ యాదవ్‌ను ఆడించే అవకాశం కనిపిస్తోంది.