హార్దిక్ పాండ్యాః పింఛ్ హిట్టింగ్ తో మైదానంలో చెలరేగిపోయే హార్దిక్.. ప్రత్యర్థి ఎవరన్నది చూడకుండా దంచికొడుతాడు. తనదైన ఆటతీరుతో అనతి కాలంలోనే టీమిండియాలో కీలక ఆటగాడిగా ఎదిగాడు. అలాంటి పాండ్యాను సెలక్ట్ చేయకపోవడానికి ఆరోగ్య సమస్యే కారణంగా తెలుస్తోంది. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత వెన్నుముకకు సంబంధించిన ఆపరేషన్ చేయించుకున్నాడు. దీంతో.. అప్పటి నుంచి బౌలింగ్ కు దూరమయ్యాడు. 2020లో దేశవాళీ క్రికెట్, ఐపీఎల్ కూడా ఆడాడు.కానీ.. ఎక్కడా బౌలింగ్ చేయలేదు. ఆస్ట్రేలియా పర్యటనలోనూ ఒక్క మ్యాచ్ లో మాత్రమే బంతిని అందుకున్నాడు. ఇటీవల ఇంగ్లండ్ సిరీస్ లోనూ తక్కువ ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఈ ఐపీఎల్ లోనూ బౌలింగ్ చేయలేదు. ఈ కారణంతోనే అతన్ని పక్కన బెట్టినట్టు సమాచారం. పైగా ఇతను ఘనమైన టెస్టు ప్లేయర్ కూడా కాదు.
భువనేశ్వర్ః టెస్టు ఛాంపియన్ సిరీస్ కు పక్కన పెట్టిన మరో కీలక ఆటగాడు భువనేశ్వర్ కుమార్. ఇతన్ని సెలక్ట్ చేయకపోవడానికి గాయాలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. 2018లో గాయం కారణంగా చాలా కాలం జట్టుకు దూరంగా ఉన్న భువీ.. గత ఐపీఎల్ లోనూ గాయపడ్డాడు. ఈ దెబ్బలు అతడి ప్రదర్శన మీద కూడా ప్రభావం చూపాయి. ఇంగ్లండ్ సిరీస్ లో ఐదు మ్యాచుల్లో 3, మూడు వన్డేల్లో 6 వికెట్లు తీశాడు. ఇక, ఈ ఐపీఎల్ లో 5 మ్యాచులు ఆడి.. మూడు వికెట్లు మాత్రమే తీశాడు. పరుగులు దాదాపుగా 10 చొప్పున సమర్పించాడు. దీంతో.. ఫామ్ లేమిని పరిగణనలోకి తీసుకొని చోటు ఇవ్వలేదని సమాచారం.
పృథ్వీ శాః ఈ ఆటగాడు మంచి ఫామ్ లోనే ఉన్నాడు. ఈ ఐపీఎల్ కు ముందు జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో భారీగా పరుగులు చేశాడు. ఒకే సీజన్ లో 800 పరుగులు సాధించింది కొత్త రికార్డు సాధించాడు. ఈ ఐపీఎల్ లోనూ చక్కటి ప్రదర్శనే చేశాడు. 8 మ్యాచుల్లో 308 పరుగులు సాధించాడు. మరి, అలాంటి ఆటగాడిని ఏ కోణంలో పక్కన పెట్టారనేది తెలియలేదు.
మొత్తం 24 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. వీరంతా త్వరలో ఇంగ్లాండ్ వెళ్లనున్నారు. అక్కడ దిగగానే క్వారంటైన్లోకి వెళ్తారు. సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న తర్వాతనే మైదానంలోకి అడుగు పెడతారు.