Handshake row escalates at the Asia Cup: మూడు రోజులుగా అదే చర్చ. జాతీయ మీడియా నుంచి మొదలు పెడితే ఇంటర్నేషనల్ మీడియా వరకు ఇదే చర్చ. భారత్ తగ్గలేదు. తగ్గాల్సిన అవసరం లేదని చెప్పేసింది. పాకిస్తాన్ కూడా రకరకాల విధాలుగా తన స్వరాన్ని వినిపించింది. కాకపోతే పాకిస్తాన్ స్థాయి కొంత పరిధి మాత్రమే కాబట్టి ఐసీసీ ముందు దాని పప్పులు ఉడకలేదు. దీంతో అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో పాకిస్తాన్ నవ్వుల పాలు కాక తప్పలేదు. అయినప్పటికీ చివరి ప్రయత్నం గా ఒక అస్త్రాన్ని సంధించింది. అది కాస్త విజయవంతం కావడంతో పాకిస్తాన్ కాస్తలో కాస్త పరువు నిలుపుకుంది.
షేక్ హ్యాండ్ వివాదం నేపథ్యంలో మ్యాచ్ రిఫరీ ఆండీ ఫై క్రాఫ్ట్ ను తొలగించాలని పాకిస్తాన్ డిమాండ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అతడిని ఆసియా కప్ నుంచి తొలగించకపోతే తాము యూఏఈ తో జరిగే మ్యాచ్ ఆడబోమని పాకిస్తాన్ స్పష్టం చేసింది. వాస్తవానికి పాకిస్తాన్ కనుక ఈ టోర్నీ నుంచి తప్పుకుంటే ఆర్థికంగా నష్టం కాబట్టి.. ఏదో ఐసీసీ ముందు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించింది. అసలే ఆసియా క్రికెట్ కప్ టోర్నీ అంతంతమాత్రంగానే సాగుతున్న నేపథ్యంలో ఐసీసీ కూడా కాస్త మెత్తబడ్డది. పాకిస్తాన్ వాదనతో ఏకీభవించి.. పాకిస్తాన్ ఆడే మ్యాచ్ లకు రిఫరీగా రిచర్డ్ సన్ ను నియమించింది. ఇప్పటివరకు రిఫరీ గా ఉన్న ఫై క్రాఫ్ట్ ను తొలగించింది. ఇదే విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సభ్యుడు చెప్పాడని.. ఈ విషయం ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
వాస్తవానికి షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడానికి మ్యాచ్ రిఫరీ కి ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ.. అనవసరంగా దీనిని పాకిస్తాన్ వివాదం చేసిందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ దేశంతో అనేక విభేదాలు, వివాదాలు ఉన్న నేపథ్యంలో భారత్ తన నిరసన వ్యక్తం చేసిందని.. అందువల్లే మ్యాచ్ గెలిచిన తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని గుర్తించకుండా మ్యాచ్ రిఫరీ దీనికి బాధ్యత తీసుకోవాలి అన్నట్టుగా పాకిస్తాన్ వ్యవహరించింది. అయితే ఈ విధానం సరికాదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు పాకిస్తాన్ ఆడుతున్న తీరుపట్ల సొంత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భారత జట్టుతో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ ఆటగాళ్లు నిర్లక్ష్య పూరితమైన ఆట తీరును ప్రదర్శించడం అభిమానులను ఆందోళనకు గురిచేసింది. ఇప్పటికీ ఆ ఓటమి నుంచి పాకిస్తాన్ అభిమానులు బయటపడడం లేదు. ఒకవేళ పాకిస్తాన్ కనుక యూఏఈ తో జరిగే మ్యాచ్లో గెలిస్తే ఖచ్చితంగా సూపర్ 4 దశలో భారత జట్టుతో తల పడాల్సి ఉంటుంది. అదే జరిగితే పాకిస్తాన్ జట్టుకు మరొక ఓటమి ఖాయమని ఆ జట్టు అభిమానులు వ్యాఖ్యానిస్తూ ఉండడం విశేషం.