https://oktelugu.com/

GT vs SRH : ఒక్కరి స్కోరూ 30 దాటలేదు.. ఎలా గెలుద్దామనుకున్నారు?

హైదరాబాద్ బౌలర్లలో షాబాద్ అహ్మద్ ఒకటి, మార్కండే ఒకటి, కమ్మిన్స్ ఒక వికెట్ తీశారు. ఈ పరాజయంతో హైదరాబాద్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. "ఒక్క బ్యాటర్ కూడా 30 పరుగులు చేయలేదు.. ఈ స్కోర్ తో ఎలా గెలుద్దామనుకున్నారని" హైదరాబాద్ ఆటగాళ్లను ఏకిపారేస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : March 31, 2024 / 08:35 PM IST

    GT vs SRH

    Follow us on

    GT vs SRH : ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఈరోజు(ఆదివారం) మధ్యాహ్నం వరకు హైదరాబాద్ స్థానం నాలుగు.. (కోల్ కతా తో జరిగిన మ్యాచ్ లో వెంట్రుక వాసిలో ఓడిపోయింది. ముంబైలో జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. అద్భుతమైన బ్యాటింగ్ తో విజయం సాధించింది) అదే గుజరాత్ జట్టు కూడా హైదరాబాద్ లాగానే ఒక మ్యాచ్ గెలిచి, మరో మ్యాచ్ ఓడిపోయింది. కానీ గుజరాత్ స్థానం ఆదివారం మధ్యాహ్నం వరకు పాయింట్లు పట్టికలో ఏడు.. హైదరాబాద్ ఒక మ్యాచ్ గెలిచి ఒక మ్యాచ్ ఓడిపోయినా నెట్ రన్ రేట్ కారణంగా నాలుగో స్థానంలో కొనసాగింది. అదే నెట్ రన్ రేట్ లేని కారణంగా గుజరాత్ ఏడవ స్థానానికి పరిమితమైంది. కానీ ఆదివారం గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా, ముంబై జట్టు మీద చూపించినట్టుగా బ్యాటింగ్ పరాక్రమాన్ని ప్రదర్శించలేకపోయింది. హైదరాబాద్ ఆటగాళ్లు 30 పరుగుల లోపే స్కోర్ చేశాడు. ఈ సీజన్ లో తొలిసారిగా హైదరాబాద్ జట్టు 162 పరుగులకే ఆలౌట్ అయింది. తక్కువ స్కోర్ కావడం.. అందులోనూ సొంత మైదానం కావడంతో గుజరాత్ జట్టు దర్జాగా విజయాన్ని సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేసింది. గుజరాత్ జట్టు మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే మూడంటే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ముద్దాడింది.

    సొంత మైదానంలో ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ ఆటగాళ్లు అద్భుతమైన బ్యాటింగ్ తో అభిమానులను అలరించారు. ఐపీఎల్ లో సరికొత్త రికార్డులు సృష్టించారు. గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఆ మ్యాజిక్ ప్రదర్శించలేకపోయారు. ఏ ఒక్క బ్యాటర్ కూడా 30 పరుగుల మార్క్ అందుకోలేకపోయారు. ఓమర్జాయ్ వేసిన తొలి ఓవర్ లో 11 పరుగులు సాధించిన హైదరాబాద్ జట్టు భారీ స్కోరు నమోదు చేసేలా కనిపించింది. కానీ ఆ జోరును అలానే కొనసాగించలేకపోయింది. 34 పరుగుల వద్ద మయాంక్ అగర్వాల్ తొలి వికెట్ గా అజ్మతుల్లా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు..వన్ డౌన్ బ్యాటర్ గా వచ్చిన అభిషేక్ శర్మ రెండు సిక్సర్లు బాదినప్పటికీ.. ఆ జోరును కొనసాగించలేకపోయాడు. పవర్ ప్లే ముగిసే సరికి హైదరాబాద్ 56 పరుగులు చేసింది. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా తడబాటుకు గురైంది. ట్రావిస్ హెడ్ అవుట్ కావడం, అభిషేక్ శర్మ 29 పరుగుల వద్ద వెనక్కి వచ్చేయడం.. క్లాసెన్ 24 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అవడం.. మార్క్రమ్ 17 పరుగులకే అవుట్ కావడంతో హైదరాబాద్ భారీ ఇన్నింగ్స్ నమోదు చేయలేకపోయింది. చివర్లో సమద్ 14 బంతుల్లో 29 పరుగులు చేయడంతో.. హైదరాబాద్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేయగలిగింది. సమద్ రెచ్చిపోయి ఉండకుంటే హైదరాబాద్ 120 లోపే స్కోర్ చేయగలిగేది.

    163 పరుగుల లక్ష్యంతో మైదానంలోకి దిగిన గుజరాత్ జట్టు తొలి వికెట్ కు 36 పరుగులు జోడించింది. వృద్ధిమాన్ సాహ, గిల్ హైదరాబాద్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. వీరిద్దరూ నాలుగు ఓవర్లలోనే 36 పరుగులు పిండుకున్నారు. 13 బంతుల్లో 25 పరుగులు చేసిన సాహా షహబాజ్ అహ్మద్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. సాయి సుదర్శన్ 45, గిల్ 36 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆ తర్వాత విజయ్ శంకర్ తో కలిసి డేవిడ్ మిల్లర్ తదుపరి క్రతవును ముగించాడు. మిల్లర్ 44 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. విజయ శంకర్ 14 పరుగులు సాధించాడు. మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే కేవలం మూడు వికెట్లు కోల్పోయి గుజరాత్ లక్ష్యాన్ని చేదించింది. హైదరాబాద్ బౌలర్లలో షాబాద్ అహ్మద్ ఒకటి, మార్కండే ఒకటి, కమ్మిన్స్ ఒక వికెట్ తీశారు. ఈ పరాజయంతో హైదరాబాద్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “ఒక్క బ్యాటర్ కూడా 30 పరుగులు చేయలేదు.. ఈ స్కోర్ తో ఎలా గెలుద్దామనుకున్నారని” హైదరాబాద్ ఆటగాళ్లను ఏకిపారేస్తున్నారు.