GT vs RCB: జాక్స్ జాకీలు పెట్టి లేపితే బెంగళూరు నిలబడ్డది.. ప్రత్యర్థులను చెడుగుడు ఆడుతోంది

ఇదే క్రమంలో కోహ్లీ అర్థ శతకం సాధించాడు. అప్పటికి విరామ సమయానికి బెంగళూరు విజయ సమీకరణం 42 బంతుల్లో 67 పరుగులకు చేరుకుంది. అప్పటికి జాక్స్ 37 పరుగులు మాత్రమే చేశాడు.

Written By: NARESH, Updated On : April 29, 2024 10:11 am

GT vs RCB: Royal Challengers Bangalore fell into a groove with the performance of Will Jacks

Follow us on

GT vs RCB : “ఎందుకు తీసుకున్నారతన్ని.. ఏమైనా ఆడుతున్నాడా.. కోట్లకు కోట్లు చెల్లించారు కదా.. ఏమైనా ఉపయోగం ఉందా..” విల్ జాక్స్ ను ఉద్దేశించి మాజీ క్రికెటర్లు చేసిన కామెంట్స్ ఇవి..కానీ, వాటన్నింటికీ ఒకే ఒక్క సెంచరీ తో జాక్స్ సమాధానం చెప్పాడు. పాయింట్లు పట్టికలో చివరి స్థానంలో ఉన్న బెంగళూరు జట్టుకు విజయాన్ని అందించాడు. అది కూడా ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే ఏ స్థాయిలో విజయం సాధించాలో.. ఆ స్థాయి గెలుపును బెంగళూరుకు బహుమతిగా ఇచ్చాడు. దీంతో, కన్నడ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆదివారం సాయంత్రం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు 9 వికెట్ల తేడాతో గెలుపును అందుకుంది. బెంగళూరు ఆటగాడు విల్ జాక్స్ 41 బంతుల్లో 100* రన్స్ కొట్టాడు. అతడికి విరాట్ కోహ్లీ అండగా నిలిచాడు. కోహ్లీ 44 బంతుల్లో 70* పరుగులు చేశాడు. ఆరు ఓటముల తర్వాత బెంగళూరుకు ఇది రెండవ విజయం.

సొంత మైదానం కావడంతో గుజరాత్ జట్టు చెలరేగి ఆడింది.. ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 200 రన్స్ చేసింది. సాయి సుదర్శన్ 49 బంతుల్లో 84*, షారుక్ ఖాన్ 58 రన్స్ చేసి సత్తా చాటారు. బెంగళూరు బౌలర్లలో స్వప్నిల్, మాక్స్ వెల్, సిరాజ్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం 201 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన బెంగళూరు 16 ఓవర్లలోనే విజయాన్ని అందుకొని.. ఔరా అనిపించింది.

లక్ష్యం భారీగా ఉన్నప్పటికీ బెంగళూరు ఆడుతూ పాడుతూ ఛేదించింది. డూ ప్లేసిస్(24) భారీగా పరుగులు సాధించే క్రమంలో అవుట్ అయ్యాడు..జాక్స్, విరాట్ కోహ్లీ బెంగళూరు ఇన్నింగ్స్ చక్కదిద్దే భారాన్ని భుజానికెత్తుకున్నారు. ముఖ్యంగా గుజరాత్ స్పిన్ బౌలర్ల బౌలింగ్ లో కోహ్లీ సిక్స్ లు కొట్టి సత్తా చూపించాడు. ఫలితంగా బెంగళూరు పవర్ ప్లే లో 63 పరుగులు సాధించింది. జాక్స్ కుదురుకునేందుకు సమయం తీసుకున్నప్పటికీ.. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

ఇదే క్రమంలో కోహ్లీ అర్థ శతకం సాధించాడు. అప్పటికి విరామ సమయానికి బెంగళూరు విజయ సమీకరణం 42 బంతుల్లో 67 పరుగులకు చేరుకుంది. అప్పటికి జాక్స్ 37 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత తన బ్యాట్ తో పరాక్రమం చూపించాడు. సిక్సర్ల మీద సిక్సర్లు కొట్టి గుజరాత్ బౌలర్లను వణికించాడు. 30 బాల్స్ లో హాఫ్ సెంచరీ చేసిన అతడు.. 41 బంతుల్లో సెంచరీ కొట్టాడు. బెంగళూరు గెలుపు కోసం ఒక పరుగు అవసరం కాగా, సిక్స్ కొట్టి మూడు అంకెల స్కోర్ సాధించాడు.