Surya Kumar Yadav: కెప్టెన్ మార్పు, జట్టులో రెండు వర్గాలు, వరుస ఓటములు.. మాజీ కెప్టెన్ జట్టును వీడుతున్నాడనే వార్తలు.. ఇన్ని ప్రతి బంధకాల మధ్య ముంబై జట్టుకు శుభవార్త. ఆ జట్టు అభిమానులకు గుడ్ న్యూస్.. ముంబై జట్టు తురుపు ముక్క, మిస్టర్ 360 సూర్య కుమార్ యాదవ్ పూర్తి ఫిట్ నెస్ సాధించినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ లో ఆడేందుకు బీసీసీఐ వైద్య బృందం అతడికి పచ్చ జెండా ఊపినట్టు తెలుస్తోంది. సూర్య కుమార్ యాదవ్ ఇటీవల స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ చేయించుకున్నాడు. అతడు ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ లో రిహాబిలిటేషన్ సెంటర్లో చికిత్స తీసుకుంటున్నాడు. ఐపీఎల్ ముందే గాయం నుంచి కోలుకున్న అతడు ఫిట్ నెస్ సాధించడంలో సఫలీకృతుడు కాలేకపోయాడు.
ఫిట్ నెస్ సాధించకపోవడంతో సూర్యకుమార్ యాదవ్ కు ఐపీఎల్లో ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ లభించలేదు. మరి కొద్ది రోజుల్లో టి20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో సూర్య కుమార్ యాదవ్ పై బీసీసీఐ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎటువంటి ఆర్భాటం లేకుండా అతడు పూర్తిస్థాయిలో ఫిట్ నెస్ సాధించిన తర్వాతే ఐపిఎల్ లో ఆడేందుకు అనుమతి ఇవ్వాలని మెడికల్ బృందాన్ని బీసీసీఐ పెద్దలు ఆదేశించినట్లు ప్రచారం జరుగుతుంది. బీసీసీఐ పెద్దల ఆదేశాలతో నేషనల్ క్రికెట్ అకాడమీ అధికారులు సూర్యకుమార్ యాదవ్ కు అత్యంత కఠినమైన ఫిట్ నెస్ టెస్ట్ లు నిర్వహించినట్టు తెలుస్తోంది. అయితే వాటిలో సూర్య కుమార్ యాదవ్ సఫలీకృతుడయ్యాడని ఓ స్పోర్ట్స్ పత్రిక ప్రకటించింది. దీంతో అతడికి ఐపీఎల్లో ఆడేందుకు అవకాశం లభించినట్టు తెలుస్తోంది.
మరొక్కరోజులో సూర్య కుమార్ యాదవ్ ముంబై జట్టులో భాగమవుతాడని.. ఆ జట్టు పోటీపడే తదుపరి మ్యాచ్ లలో ఆడతాడని సమాచారం. ముంబై జట్టు ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది. సూర్య జట్టులోకి వస్తే ముంబై బలం మరింత పెరుగుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.. సూర్య రాక నేపథ్యంలో ముంబై జట్టులోని నమన్ ధీర్ పై వేటుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఇక ఈ సీజన్ ను ముంబై జట్టు ఓటమితో ప్రారంభించింది. ఇప్పటివరకు హ్యాట్రిక్ ఓటములను నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. గుజరాత్, హైదరాబాద్, రాజస్థాన్ జట్ల చేతుల్లో ముంబై ఓడిపోయింది. మరీ ముఖ్యంగా సొంత మైదానంలో రాజస్థాన్ చేతిలో దారుణమైన పరాభవాన్ని ఎదుర్కొంది.