Deepa Karmakar : ఏషియన్ జిమ్నాస్టిక్ ఛాంపియన్ షిప్ లో సరికొత్త రికార్డు నమోదయింది. భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ సరికొత్త ఘనతను సృష్టించింది. ఏషియన్ జిమ్నాస్టిక్ ఛాంపియన్ షిప్ పోటీలలో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఉజ్బెకిస్తాన్ వేదికగా ఈ టోర్నీ జరగగా.. ఆదివారం ముగిసింది. ఈ టోర్నీలో వ్యక్తిగత వాల్ట్ విభాగంలో దీపా కర్మాకర్ బంగారు పతకాన్ని ఒడిసి పట్టింది.
హోరాహోరీగా ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో 8 మంది జిమ్నాస్ట్ లు పాల్గొన్నారు. అయితే వ్యక్తిగత వాల్ట్ విభాగంలో దీపా కర్మాకర్ అగ్రస్థానంలో నిలిచింది. అసాధారణ ప్రతిభతో పసిడి పథకాన్ని సాధించింది.. 2015 సంవత్సరంలో జరిగిన ఇదే టోర్నీలో దీపా చివరిసారిగా కాంస్య పతకాన్ని అందుకుంది. ఇక తాజా ఎడిషన్ లో కూడా దీపా అద్భుతమైన ప్రదర్శన చేసింది. 8 మంది ప్రపంచ శ్రేణి జిమ్నాస్ట్ లు పోటీపడినప్పటికీ.. వ్యక్తిగత వాల్ట్ విభాగంలో సరికొత్త రికార్డు సృష్టించింది.
దీపా కర్మాకర్ కు ప్రస్తుతం 30 ఏళ్ల వయసు. అయినప్పటికీ ఫైనల్ మ్యాచ్ లో 13. 566 సగటు నమోదు చేసింది. ఉత్తర కొరియాకు చెందిన కిమ్ సన్ 13.466, జో క్యోమ్ గ్ 12.966 సగటుతో రజత, కాంస్య పతకాలు అందుకున్నారు. 2016 రియో ఒలంపిక్స్ లో దీపా నాలుగో స్థానంలో నిలిచింది. 2014లో గ్లాస్గో వేదికగా జరిగిన కామన్ వెల్త్ గేమ్స్ లో దీప కాంస్య పతకాన్ని అందుకుంది.
అప్పట్లో నిషేధిత ఉత్ప్రే రకం వాడిందనే కారణంతో దీపా 21 నెలల నిషేధం ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో తన నిషేధాన్ని సాధనకు అనువుగా మలుచుకొని దీపా ఉత్తేజ తరంగంగా ఎగిసింది. అనంతరం మళ్లీ బరిలోకి దిగి.. మొదటి టోర్నీ లోనే బంగారు పతకాన్ని సాధించింది. 2015 లో వ్యక్తిగత వాల్ట్ విభాగంలో దీపా కాంస్య పకాన్ని అందుకుంది. 2019లో వ్యక్తిగత వాల్ట్ విభాగంలో ప్రణతి నాయక్ కాంస్య పతకాన్ని అందుకుంది. 2022 లోనూ వ్యక్తిగత వాల్ట్ విభాగంలో ప్రణతి నాయక్ కాంస్య పతకాన్ని అందుకుంది. తాజా ఎడిషన్ లో దీపా కర్మాకర్ వ్యక్తిగత వాల్ట్ విభాగంలో బంగారు పతకాన్ని అందుకుంది.