https://oktelugu.com/

Kavya Maran: కళ్ళముందే జట్టు ఓటమి.. కావ్య కళ్ళ నిండా కన్నీరు.. ఆ బాధను ఎవరు తీర్చగలరు?

హైదరాబాద్ ఆటగాళ్లు దారుణమైన ఆట తీరు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో.. ఆ ఘోరాన్ని చూడలేక హైదరాబాద్ యజమాని కావ్య మ్యాచ్ మధ్యలోనే బయటకు వెళ్లిపోయింది. కోల్ కతా విజయం సాధించిన అనంతరం మళ్లీ స్టాండ్స్ లోకి వచ్చింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : May 27, 2024 / 10:30 AM IST

    Kavya Maran in tears after SRH heartbreaking loss

    Follow us on

    Kavya Maran: ఐపీఎల్ ఫైనల్ లో సన్ రైజర్స్ దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. కోల్ కతా చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది. ఐపీఎల్ చరిత్రలో లేనంత దారుణంగా ఫైనల్ మ్యాచ్లో తక్కువ స్కోరు నమోదు చేసింది. కళ్ళ ముందే జట్టు ఓడిపోతుండడంతో.. సన్ రైజర్స్ ఓనర్ కావ్య తట్టుకోలేకపోయింది. కళ్ళనిండా కన్నీరు పెట్టుకుంది. లీగ్, ప్లే ఆఫ్ లో అద్భుతమైన పోరాటాన్ని ప్రదర్శించిన తన జట్టు.. ఫైనల్ లో అలా ఓడిపోవడాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. జట్టు ఆటగాళ్ల ప్రదర్శన చూసి దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

    హైదరాబాద్ ఆటగాళ్లు దారుణమైన ఆట తీరు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో.. ఆ ఘోరాన్ని చూడలేక హైదరాబాద్ యజమాని కావ్య మ్యాచ్ మధ్యలోనే బయటకు వెళ్లిపోయింది. కోల్ కతా విజయం సాధించిన అనంతరం మళ్లీ స్టాండ్స్ లోకి వచ్చింది. ఇదే దశలో అద్భుతమైన ప్రదర్శన చేసి, ఫైనల్ దాకా వచ్చిన తన జట్టును చప్పట్లు కొడుతూ అభినందించింది. ఈ నేపథ్యంలోనే ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ బాధపడింది. ఈ వీడియో చూసిన హైదరాబాద్ అభిమానులు బాధపడుతున్నారు.” బాధపడకండి.. ధైర్యంగా ఉండండి మేడం అంటూ” కావ్య మారన్ ను ఊరడించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సీజన్ మొత్తంలో హైదరాబాద్ ఆటగాళ్లను, అభిమానులను నవ్వించిన కావ్య.. కీలక పోరులో ఏడవడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. స్థాయికి తగ్గట్టుగా ప్రదర్శన చేయకపోవడంతోనే కావ్య కన్నీరు పెట్టుకుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    ఈ మ్యాచ్ లో హైదరాబాద్ ఆటగాళ్లు 18.3 ఓవర్లలో 113 రన్స్ మాత్రమే చేశారు. మార్క్రం 20, కమిన్స్ 24 మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్ చేశారు. కోల్ కతా బౌలర్లలో స్టార్క్, హర్షిత్ రాణా రెండేసి వికెట్లు పడగొట్టారు. రస్సెల్ మూడు వికెట్లు తీశాడు. వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ తలా ఒక వికెట్ తీశారు. ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యంత దారుణమైన స్కోరు చేసిన జట్టుగా హైదరాబాద్ చెత్త రికార్డు నమోదు చేసింది. 114 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా జట్టు 10.3 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 114 రన్స్ చేసింది. ఇంకా 57 బంతులు మిగిలి ఉండగానే సులువైన విజయాన్ని అందుకుంది. సునీల్ నరైన్ 6 పరుగులకే అవుట్ అయినప్పటికీ.. రెహమానుల్లా గుర్భాజ్ 39, వెంకటేష్ అయ్యర్ 52.. పరుగులతో ఆకట్టుకున్నారు. హైదరాబాద్ బౌలర్లలో కమిన్స్, షాబాజ్ అహ్మద్ చెరో వికెట్ తీశారు. లీగ్, ప్లే ఆఫ్ లలో హైదరాబాద్ పై విజయం సాధించిన కోల్ కతా.. ఫైనల్ మ్యాచ్ లోనూ గెలుపును అందుకొని.. ముచ్చటగా మూడవసారి ఐపీఎల్ ట్రోఫీని ఒడిసి పట్టింది.