IND VS AUS Test Match : మిగతా జట్ల విజయాలతో సంబంధం లేకుండా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి వెళ్లాలంటే టీమిండియా 5-0 తేడాతో ఆస్ట్రేలియాపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలుచుకోవాలి. అయితే అది అంత సాధ్యమయ్యే పని కాదు. గత రెండు సీజన్లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా గెలుచుకుంది. ఈసారి అదే జోరు కొనసాగించాలని భావిస్తున్నప్పటికీ.. ఆస్ట్రేలియా అంత సులువుగా వదిలిపెట్టేలాగా కనిపించడం లేదు. ఆ జట్టు ఆటగాళ్లు సమర్థవంతంగా ఆడుతున్నారు. మరోవైపు కొద్ది రోజుల ముందు ఆస్ట్రేలియా లోకి ఎంట్రీ ఇచ్చిన టీమ్ ఇండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ లో అంతంత మాత్రం గానే రాణించారు. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్ తేలిపోయారు. కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయారు. నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్ట్ కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. అతని భార్య పండంటి బాబుకు జన్మనివ్వడంతో.. ఇండియాలోనే ఉండిపోయాడు. ఇక అతడి స్థానంలో బుమ్రా కెప్టెన్సీ వహించే అవకాశం కనిపిస్తోంది. అయితే రోహిత్ గైర్హాజరీతో టీమిండియా కాస్త ఒత్తిడిలో ఉంది. దీనిని మర్చిపోకముందే టీమిండియా కు మరో షాక్ తగిలింది. స్టార్ ఆటగాడు గాయం బారిన పడటంతో.. అతను కూడా తొలి టెస్ట్ కు దూరమయ్యాడని జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
బొటన వేలికి గాయం కావడంతో..
ఆస్ట్రేలియా వేదికగా భారత ఆటగాళ్లు భారత్ – ఏ జట్టుతో ఇటీవల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లు వరుసగా గాయాల బారిన పడ్డారు. విరాట్ కోహ్లీ, గిల్, రాహుల్ కు గాయాలయ్యాయి.. ఇందులో గిల్ కు బొటనవేలు ఫ్రాక్చర్ అయింది. ప్రాక్టీస్ మ్యాచ్ లో భాగంగా అతడు స్లిప్లో క్యాచ్ పడుతుండగా గాయపడ్డాడు.. వైద్య సిబ్బంది అతడికి స్కానింగ్ చేశారు. అందులో బొటనవేలు ఫ్రాక్చర్ అయినట్టు తేలింది. దీంతో అతడు తొలి టెస్ట్ ఆడ లేడని తెలుస్తోంది. రెండో టెస్ట్ ప్రారంభమయ్యే నాటికి అతడు జట్టులోకి వస్తాడని స్పోర్ట్స్ వర్గాలు చెబుతున్నాయి. ” ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుండగా గిల్ గాయపడ్డాడు. అతడి బొటనవేలు కు ఫ్రాక్చర్ అయింది. ఆ ప్రాంతం మొత్తం వాచింది. అందువల్లే అతడు తొలి టెస్ట్ కు అందుబాటులో ఉండడని” టీమిండియా వైద్య వర్గాలు ప్రకటించాయి. మరోవైపు ప్రసిధ్ కృష్ణ వేసిన బంతికి కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. నొప్పి తీవ్రంగా ఉండడంతో అతడు మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు. ఇక విరాట్ కోహ్లీ కూడా ఇది తీరుగా గాయపడ్డాడు. అయితే అతడు కోలుకున్నాడని.. తొలి టెస్ట్ కు అందుబాటులో ఉంటాడని జట్టు వర్గాలు చెబుతున్నాయి. అయితే గిల్, రోహిత్ స్థానంలో వర్ధమాన ఆటగాళ్లకు జట్టు మేనేజ్మెంట్ అవకాశం కల్పిస్తుందని వార్తలు వస్తున్నాయి.