Rohit Sharma Tweet: క్రికెట్ లో ఎవరి స్థానం శాశ్వతం కాదు. ఆటగాళ్లు వస్తుంటారు. పోతుంటారు. మెరుగ్గా ఆడిన వారికి మాత్రమే అవకాశాలు లభిస్తాయి. అలాగని అందరికీ స్థిరంగా అవకాశాలు లభిస్తాయంటే కుదరదు. బయట ఎలాగైతే రాజకీయాలు ఉన్నాయో.. క్రికెట్ లో కూడా అదే స్థాయిలో రాజకీయాలు కొనసాగుతుంటాయి. పరిచయాలు ఉన్నవారు తమ క్రికెట్ ప్రస్థానాన్ని మరింత సుస్థిరంగా కొనసాగిస్తుంటారు. పరిచయాలు, అండదండలు లేనివారు.. అంతంతమాత్రంగానే తమ కెరియర్ ను కొనసాగించి.. త్వరగానే ముగిస్తుంటారు.
టీమిండియాలో ఒక వెలుగు వెలిగిన రోహిత్ శర్మ ప్రస్థానం దాదాపుగా ముగిసినట్టే. ప్రస్తుతం అతడు జట్టులో ఒక ఆటగాడు మాత్రమే. టి20కి, టెస్ట్ ఫార్మాట్ లకు అతడు శాశ్వత వీడ్కోలు పలికాడు. మొన్నటివరకు వన్డే జట్టుకు సారధిగా ఉన్నప్పటికీ.. నిన్న జరిగిన సమావేశంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అతడి నుంచి సారధ్య బాధ్యతలు గిల్ కు అప్పగించినట్టు ప్రకటించింది. దీంతో రోహిత్ అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇదంతా కూడా గంభీర్ వల్లేనని వారు ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు.
గిల్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించిన తర్వాత రోహిత్ ముభావంగా ఉన్నాడని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు అతడు త్వరలోనే వన్డేలకు కూడా వీడ్కోలు పలుకుతాడని సమాచారం. ఇది ఇలా ఉండగానే గిల్ కు కెప్టెన్సీ అప్పగించిన తర్వాత రోహిత్ శర్మ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. సరిగా 13 సంవత్సరాల క్రితం రోహిత్ ట్వీట్ చేశాడు. 45 జెర్సీ నెంబర్ శకం ముగిసిందని.. 77 జెర్సీ శకం మొదలైందని రోహిత్ 2012లో ట్వీట్ చేశాడు. యాదృచ్ఛికంగా రోహిత్ జెర్సీ నెంబర్ 45, గిల్ జెర్సీ నెంబర్ 77 కావడం విశేషం. అయితే ఆ సమయంలో రోహిత్ అలా ఎందుకు ట్వీట్ చేశాడో తెలుసుకోవడానికి అభిమానులు అంతర్జాలంలో విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు.
రోహిత్ నాయకత్వంలో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ, టి20 వరల్డ్ కప్ గెలుచుకుంది. 2023 వన్డే వరల్డ్ కప్ లో రన్నర్ అప్ గా నిలిచింది. వాస్తవానికి ఛాంపియన్స్ ట్రోఫీ టీ మీడియా గెలవడంలో రోహిత్ ముఖ్యపాత్ర పోషించాడు. అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. అయితే రోహిత్ నాడు అలా ఎందుకు ట్వీట్ చేశాడో అర్థం కావడం లేదని ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ రోహిత్ శర్మ ను కెప్టెన్సీ నుంచి తొలగించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మేనేజ్మెంట్ ఇంకొక అవకాశం ఇస్తే బాగుండేదని వ్యాఖ్యానిస్తున్నారు.