Gautam Gambhir: ఎట్టకేలకు టీమ్ ఇండియా కోచ్ గా గౌతమ్ గంభీర్ నియమిడుయ్యాడు. అందరూ ఊహించినట్టుగానే గౌతమ్ గంభీర్ ను టీమిండియా కోచ్ గా బీసీసీఐ సెక్రెటరీ జై షా ప్రకటించాడు. రాహుల్ ద్రావిడ్ పదవి కాలం పూర్తయిన నేపథ్యంలో గౌతమ్ గంభీర్ ను టీమిండియా కొత్త కోచ్ గా నియమించినట్టు జైషా వెల్లడించాడు. టీమిండియా కోచ్ గా గౌతమ్ గంభీర్ నాలుగేళ్ల పాటు పని చేయాల్సి ఉంటుంది. ఏడాదికి 12 కోట్ల చొప్పున అతడికి బీసీసీఐ వేతనంగా అందిస్తుంది. అయితే జాతీయ మీడియా కధనాలలో ద్రావిడ కంటే గంభీర్ కు అధిక వేతనం ఇస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. నిన్నటి దాకా కోచ్ గా పనిచేసిన రాహుల్ ద్రావిడ్ కి కూడా ఇదే స్థాయిలో వేతనం లభించింది. టీమిండియాలో తన ముద్ర ఉండాలని భావిస్తున్న గౌతమ్ గంభీర్.. సహాయక సిబ్బంది విషయంలోనూ తన వాళ్లే ఉండాలని బిసిసిఐ పెద్దలకు ఇప్పటికే తేల్చి చెప్పాడు. దీంతో గౌతమ్ గంభీర్ కు అసిస్టెంట్ కోచ్ గా ముంబై మాజీ ఆటగాడు అభిషేక్ నాయర్ నియమితులయ్యే అవకాశం ఉంది. నాయర్ ను బీసీసీఐ అసిస్టెంట్ కోచ్ గా ప్రకటించడం లాంచనమేనని తెలుస్తోంది.
గౌతమ్ గంభీర్ టీమిండియాలో స్టార్ క్రికెటర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. భారత జట్టు తరుపున 58 టెస్టులు, 147 వన్డే, 37 t20 మ్యాచ్లు ఆడాడు. భారత్ సాధించిన అనేక విజయాలలో కీలకపాత్ర పోషించాడు. 2007 t20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ లను భారత జట్టు సాధించిన సమయంలో అతడు కీలక ఆటగాడిగా ఉన్నాడు. ఆ రెండు టోర్నీలో ఫైనల్ మ్యాచ్లలో గౌతమ్ గంభీర్ టాప్ స్కోరర్ గా ఉన్నాడు. ఐపీఎల్ లో 2012, 2014 సీజన్లో కోల్ కతా జట్టును విజేతగా నిలిపాడు. ఇటీవలి ఐపిఎల్ సీజన్లో కోల్ కతా జట్టు విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు.
గౌతమ్ గంభీర్ కోల్ కతా జట్టు కంటే ముందు లక్నోకు మెంటార్ గా వ్యవహరించాడు. గత రెండు సీజన్లలో ఆ జట్టును సెమీస్ దాకా తీసుకెళ్లాడు. అయితే ఈ ఏడాది కోల్ కతా జట్టుకు మెంటార్ గా రావడంతో.. షారుక్ ఖాన్ జట్టు ముఖచిత్రమే మారిపోయింది. దెబ్బకు ఆ జట్టు విజేతగా నిలిచింది. గంభీర్ రాకతో టీమిండియా కూడా అన్ని విభాగాలలో నెంబర్ వన్ స్థానంలో ఉంటుందని మాజీ క్రీడాకారులు జోస్యం చెబుతున్నారు. వచ్చేయడాది ఛాంపియన్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లు ఉన్న నేపథ్యంలో.. ఆ రెండు ట్రోఫీలను దక్కించుకోవాలని భారత జట్టు భావిస్తోంది. గంభీర్ కోచ్ గా రావడంతో అది సాధ్యమవుతుందని బీసీసీఐ అంచనా వేస్తోంది. ఇప్పటివరకు ఐసీసీ నిర్వహించిన అన్ని మెగా టోర్నీలలో భారత్ విజయం సాధించింది. ఒక్క వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో మాత్రం సత్తా చాట లేకపోయింది.