Gautam Gambhir: మరో రెండు రోజుల్లో ఆసియా కప్ మొదలు కాబోతోంది. భారత జట్టు ఆతిధ్య యూఏఈ తో సెప్టెంబర్ 10న పోటీ పడుతుంది. సెప్టెంబర్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుతో పోటీ పడుతుంది. యూఏఈ తో మ్యాచ్ అయినప్పటికీ టీమిండియా అంత తేలిగ్గా తీసుకోవడం లేదు. ఆటగాళ్లు అత్యంత ఉత్సాహంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. టీమిండియాతో ఉపసారథి గిల్ చేరాడు. అతడు ప్రాక్టీస్ లో ఉత్సాహంగా పాల్గొంటున్నాడు. ఇదే విషయాన్ని తన అధికారిక ట్విట్టర్లో పంచుకున్నాడు. 2024లో శ్రీలంక జట్టుతో జరిగిన టి20 సిరీస్లో గిల్ తన చివరి మ్యాచ్ ఆడాడు. సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టులో ఉపసారధిగా అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు.
శివం దుబే కూడా జట్టులో చేరాడు. అతడు ఉత్సాహంగా ప్రాక్టీసులో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా భారత జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ చెప్పిన మాటలను అతడు తన తోటి ఆటగాళ్లతో పంచుకున్నాడు. “గౌతమ్ గంభీర్ నాతో ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. ప్లేయర్లు ఎవరైనా సరే కొత్తగా చేస్తేనే బాగుంటుందని చెబుతుంటారు. అలా చేసిన వారికే కెరియర్ గొప్పగా ఉంటుందని అంటుంటారు. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది కాబట్టి ఆ మాటలను వాస్తవంలో పెట్టాలి. అందుకు తగ్గట్టుగా ఆట తీరును ప్రదర్శించాల్సి ఉందని” శివం తోటి ఆటగాళ్లతో అన్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరోవైపు సూర్య కుమార్ యాదవ్ శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత మైదానంలో అడుగు పెట్టాడు. అతడు కూడా ఉత్సాహపూరితమైన ఇన్నింగ్స్ ఆడాలని భావిస్తున్నాడు. భారత జట్టుకు ఆసియా కప్ అందించి తన పేరు మీద రికార్డు సృష్టించుకోవాలని యోచిస్తున్నాడు.
2024 లో పొట్టి ప్రపంచ కప్ గెలిచిన తర్వాత టీమ్ ఇండియా ఈ ఫార్మాట్లో ఒక్క టోర్నీ కూడా కోల్పోలేదు. క్రితం జరిగిన ఆసియా కప్ ను భారత్ సొంతం చేసుకుంది. ఈసారి కూడా అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. జట్టు కూర్పు విషయంలో కూడా జాగ్రత్తలు పాటించింది. పాత, కొత్తల కలయికతో జట్టును రూపొందించి ప్రత్యర్థి జట్లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.. విశ్లేషకులు అంచనా ప్రకారం ఈసారి కూడా టీం ఇండియా నే ఆసియా కప్ దక్కించుకుంటుందని తెలుస్తోంది. జాతీయ మీడియాలో కూడా అదే స్థాయిలో వార్తలు వస్తున్నాయి. అయితే మిగతా జట్లు తమ స్థాయికి తగ్గట్టుగా లేకపోయినప్పటికీ భారత్ ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకూడదని.. అన్ని జట్లపై దూకుడు కొనసాగించాల్సిందేనని మాజీ ఆటగాళ్లు పేర్కొంటున్నారు.