Gautam Gambhir: ప్లే ఆఫ్ లో బలమైన హైదరాబాద్ జట్టును అత్యంత సునాయాసంగా ఓడించి.. ఫైనల్ దూసుకెళ్లింది కోల్ కతా జట్టు. హోరాహోరీగా సాగుతుందనుకున్న మ్యాచ్ ను పూర్తి ఏకపక్షం చేసి.. 8 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది.. దీంతో కోల్ కతా జట్టు ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేవు. లీగ్ దశ నుంచి ప్లే ఆఫ్ దాకా కోల్ కతా జట్టు వరుస విజయాలు సాధించడం వెనక చాలామంది శ్రేయస్ అయ్యర్ ఉన్నాడని అనుకుంటున్నారు. అది నిజమే. కానీ, ఆ జట్టును వెనక ఉండి నడిపిస్తున్న ధైర్యం మాత్రం గౌతమ్ గంభీర్ అనడంలో ఎటువంటి అనుమానం అక్కర్లేదు. ఓటమిని ఒప్పుకోడు. వెన్ను చూపడాన్ని అంగీకరించడం. పోరాట తత్వాన్ని ఇష్టపడతాడు. ఎదురుదాడిని అభినందిస్తాడు. అందువల్లే గౌతమ్ గంభీర్ అంటే కోల్ కతా ఆటగాళ్లు ఇష్టపడతారు. అతడి మార్గదర్శకంలో నైపుణ్యాలు నేర్చుకుంటారు. తమ ఆట తీరును మరింత మెరుగుపరుచుకుంటారు.
కోల్ కతా జట్టుకు షారుఖ్ ఖాన్ రూపంలో బలమైన యజమాని ఉన్నాడు. అంతకంటే గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. అయినప్పటికీ ఆ జట్టు ఇటీవలి సీజన్లలో ప్రదర్శన అస్సలు బాగోలేదు. 2014లో కప్ సాధించింది. ఆ తర్వాత ఇంతవరకు ఆ స్థాయి ప్రదర్శన చేయలేదు. ఇక గత రెండు సీజన్లలో దారుణమైన ఆట తీరు ప్రదర్శించింది. బలమైన జట్టుగా ముద్రపడినప్పటికీ, ఏడవ స్థానంతో సరిపెట్టుకుంది.. వాస్తవానికి కోల్ కతా ఆటగాళ్ల ఆట తీరు చూసిన తర్వాత.. ఈ జట్టు పైకి లేవదని అందరూ అనుకున్నారు. కానీ అక్కడే ఆ జట్టు కథను గౌతమ్ గంభీర్ మార్చేశాడు. తన బిజెపి ఎంపీ పదవికి రాజీనామా చేసి..కోల్ కతా జట్టులోకి చేరాడు. వైఫల్యాలను దూరం పెట్టి.. విజయాలను సాఫల్యం చేసుకునే దిశగా తర్ఫీదు ఇచ్చాడు. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాడు. ఓటమిని ఒప్పుకొని తత్వాన్ని నేర్పాడు. అదే ఆ జట్టుకు కొండంత బలంగా మారింది. గౌతమ్ గంభీర్ సారధ్యంలో 2012, 2014లో కోల్ కతా ఐపీఎల్ ట్రోఫీలు దక్కించుకుంది. 2014 తర్వాత కోల్ కతా ఇంతవరకు ఐపీఎల్ ట్రోఫీ అందుకోలేకపోయింది.
గత ఏడాది గౌతమ్ గంభీర్ లక్నో జట్టుకు శిక్షకుడిగా ఉన్నాడు. బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో కోహ్లీతో వాగ్వాదానికి దిగాడు. దీంతో గంభీర్ కోహ్లీ అభిమానుల నుంచి తీవ్ర నిరసనను ఎదుర్కొన్నాడు.. పరిస్థితిని గమనించిన లక్నో జట్టు గౌతమ్ గంభీర్ ను దూరం పెట్టింది. దీంతో గౌతమ్ గంభీర్ కోల్ కతా జట్టు యాజమాన్యంతో చేతులు కలిపాడు. వాస్తవానికి కోల్ కతా జట్టుకు శిక్షకుడిగా చంద్రకాంత్ వ్యవహరిస్తున్నాడు. పేరుకు చంద్రకాంత్ కోచ్ అయినప్పటికీ.. తెర వెనుక వ్యవహారాలు మొత్తం గౌతమ్ గంభీర్ నడిపిస్తున్నాడు. రస్సెల్, సునీల్ నరైన్ ను తిరిగి ఫామ్ లోకి తీసుకురావడంలో గౌతమ్ గంభీర్ తీవ్ర కృషి చేశాడు. ఫిలిప్ సాల్ట్ ను డేరింగ్ ఓపెనర్ గా మార్చాడు. శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, రమణ్ దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా.. ఇలా భీకరమైన లైన్ అప్ తయారుచేసి..కోల్ కతా జట్టును అద్భుతంగా తీర్చిదిద్దాడు. అందువల్లే కోల్ కతా జట్టు ఐపిఎల్ లీగ్ లో మొదటి స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్ లోనూ అసలు సిసలైన ఆట తీరు ప్రదర్శించి ఫైనల్ దూసుకెళ్లింది. 17వ సీజన్లో ఐపీఎల్ ట్రోఫీ దక్కించుకునేందుకు కేవలం అడుగు దూరంలో నిలిచింది.