T20 World Cup 2024: మరికొద్ది రోజుల్లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈసారి అమెరికా, వెస్టిండీస్ దేశాలు ఆతిథ్యం ఇస్తున్నాయి.. క్రికెట్ క్రీడకు మరింత ప్రాచుర్యం తీసుకొచ్చేందుకు ఐసీసీ ఈసారి రకరకాల మార్పులు చేసింది. ఏకంగా 20 జట్లతో క్రికెట్ ఆడిస్తోంది. నాలుగు గ్రూపులుగా విభజించి.. ఒక్కో గ్రూపులో ఐదు జట్లను ఏర్పాటు చేసింది. పేరుకు 20 జట్లు ఉన్నప్పటికీ.. టైటిల్ పోరు మాత్రం ప్రధాన జట్ల మధ్య జరుగుతుందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో గత వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్ దాకా వెళ్లిన విషయాన్ని కూడా ఉదహరిస్తున్నారు. ఏమో గుర్రంఎగరావచ్చు అనే సామెత తీరుగా, కొన్ని జట్లు సంచలన ప్రదర్శన చేసేందుకు ఆస్కారం ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అలా సంచలన ప్రదర్శన చేసే జట్లు ఏవో మరికొద్ది రోజుల్లో తేలనుంది.
అయితే ఈసారి ప్రారంభమయ్యే టి20 వరల్డ్ కప్ లో అత్యంత కుర్ర ఆటగాడిగా నేపాల్ జట్టుకు చెందిన గుల్షన్ ఝా నిలిచాడు. ఇతడి వయసు కేవలం 18 సంవత్సరాల మాత్రమే. ఈ టోర్నీ ద్వారా అతడు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెడుతున్నాడు. కుడిచేతి వాటం మీడియం పేస్ బౌలర్ గా గుల్షన్ ఝా కొనసాగుతున్నాడు. నేపాల్ జాతీయ జట్టు, నేపాల్ అండర్ 19, నేపాల్ పోలీస్ క్లబ్ జట్ల తరఫున ఇతడు ఆడాడు. ఇప్పటివరకు గుల్షన్ 27 వన్డేలు ఆడి, 21 వికెట్లు పడగొట్టాడు. ఇందులో అతడి అత్యుత్తమ ప్రదర్శన 3/28 గా ఉంది. టి20 లలో 35 మ్యాచ్ లు ఆడి, 21 వికెట్లు నేలకూల్చాడు. ఇందులో అతడి అత్యుత్తమ ప్రదర్శన 2/11 గా ఉంది.
ఇక టి20 వరల్డ్ కప్ లో అతిపెద్ద వయసు ఉన్న ఆటగాడిగా ఉగాండా ప్లేయర్ ఫ్రాంక్ న్సుబుగా నిలిచాడు. ఇతడి వయసు 43 సంవత్సరాలు. 2016లో భారత్ వేదికగా నిర్వహించిన టి20 వరల్డ్ కప్ లో అతడు ఉగాండా తరఫున ఆడాడు.. ఉగాండా జట్టులోకి ఫ్రాంక్ న్సుబుగా 2000 సంవత్సరంలో ఎంట్రీ ఇచ్చాడు. కుడి చేతి వాటం బౌలింగ్, బ్యాటింగ్ చేయడంలో ఫ్రాంక్ న్సుబుగా నేర్పరి.. ఇక సమకాలీన క్రికెట్లో హాంకాంగ్ జట్టుకు చెందిన ర్యాన్ కాంప్ బెల్ 44 సంవత్సరాల వయసుతో.. అత్యధిక వయస్కుడైన క్రికెటర్ గా కొనసాగుతున్నాడు. ఇతడి తర్వాత ఉగాండా జట్టుకు చెందిన ఫ్రాంక్ న్సుబు ఉన్నాడు. ఇతడి వయసు 42 సంవత్సరాలు. 42 సంవత్సరాల తో వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్, హాంకాంగ్ ఆటగాడు నజీబ్ అమర్ 42 ఏళ్ళు, పాకిస్తాన్ ఆటగాడు మహమ్మద్ హఫీజ్ 41 సంవత్సరాలు, షోయబ్ మాలిక్ పాకిస్తాన్ 39 సంవత్సరాలతో.. తర్వాతి స్థానాలలో ఉన్నారు.