Irfan Pathan: టి20 వరల్డ్ కప్ నేపథ్యంలో ప్రకటించిన భారత జట్టు ఎంపిక పట్ల సీనియర్ ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది ఆటగాళ్లు బీసీసీఐ సెలెక్టర్లను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ఆ జాబితాలోకి ఇప్పుడు టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ చేరాడు. టి20 వరల్డ్ కప్ కు జట్టు కూర్పు పట్ల అతడు పెద్దగా సుముఖత వ్యక్తం చేయలేదు. జట్టు ప్రకటనలో సమతూకం లేదని పరోక్షంగా వ్యాఖ్యానించాడు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యాకు వైస్ కెప్టెన్సీ ఇవ్వడం పట్ల ఇర్ఫాన్ పఠాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. కొంతమంది పట్ల బీసీసీఐ సెలెక్టర్లు ఉదాహరణ చూపినట్టు అర్థమవుతోదని ఇర్ఫాన్ వ్యాఖ్యానించాడు.
“గత వరల్డ్ కప్ లో గాయం కారణంగా హార్దిక్ పాండ్యా మధ్యలోనే ఇంటిదారి పట్టాడు. కొంతకాలం క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. అనూహ్యంగా ముంబై జట్టుకు కెప్టెన్ అయ్యాడు. అయినప్పటికీ అతని ఆట తీరు గొప్పగా లేదు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్లో అతడు రాణించలేకపోతున్నాడు. అలాంటి ఆటగాడికి ఎలా అవకాశం ఇస్తారు? ఎలా అతడిని వైస్ కెప్టెన్ గా నియమిస్తారని” ఇర్ఫాన్ పఠాన్ ప్రశ్నించాడు. ” జస్ ప్రీత్ బుమ్రా లాంటి ఆటగాడికి వైస్ కెప్టెన్సీ ఇవ్వకుండా, హార్దిక్ పాండ్యాకు ఇవ్వడం ఎంతవరకు సబబు” అని ఇర్ఫాన్ అభిప్రాయపడ్డాడు. ఇర్ఫాన్ మాత్రమే కాదు హార్దిక్ పాండ్యాకు వైస్ కెప్టెన్సీ ఇవ్వడం పట్ల సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. “హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై జట్టు దారుణంగా ఆడుతోంది. పాయింట్లు పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. అలాంటప్పుడు అతడికి వైస్ కెప్టెన్సీ ఎలా ఇస్తారని” నెటిజన్లు బీసీసీఐ సెలక్షన్ కమిటీని ఏకిపడేస్తున్నారు.
వాస్తవానికి హార్దిక్ పాండ్యా టీమిండియా టి20 జట్టుకు కెప్టెన్ గా ఉండేవాడు. టి20 వరల్డ్ కప్ నేపథ్యంలో బీసీసీఐ టీమిండియా కు కెప్టెన్ గా రోహిత్ శర్మను నియమించింది. రోహిత్ శర్మ ఈ టోర్నీ తరువాత కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడని వార్తలు వస్తున్నాయి. అప్పుడు హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా నియమించి, సూర్య కుమార్ యాదవ్ ను వైస్ కెప్టెన్ గా చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వీటిని ధ్రువీకరించేలా ” బీసీసీఐ అలాంటి ప్రయత్నమే చేస్తోంది” అని ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానించడం పై వాదనలకు బలం చేకూర్చుతోంది. మరోవైపు టి20 వరల్డ్ కప్ జట్టు విషయంలో రింకూ సింగ్ కు అవకాశం కల్పించకపోవడం పట్ల ఇర్ఫాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. “జట్టు ఎంపిక అనేది సెలెక్టర్ల చేతిలో ఉంటుంది. క్రికెట్ అనేది టెన్నిస్ కాదు. క్రికెట్లో ఆటగాళ్లకు సమ ప్రాధాన్యం దక్కాలి. అప్పుడే ఆట సమతూకంగా ఉంటుంది. కానీ, దురదృష్టవశాత్తు అది ఇప్పుడు లోపించింది.. గత టి20 వరల్డ్ కప్ లో ప్రాధాన్యం లేని ఆటగాళ్లకు కూడా బీసీసీఐ అమితమైన ప్రయారిటీ ఇచ్చింది. దానిని నేను దగ్గరుండి చూశానని” ఇర్ఫాన్ వ్యాఖ్యానించాడు.