Kaviya Maran: ఐపీఎల్ 16వ ఎడిషన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘోరంగా విఫలమవుతోంది. వరుసగా ఆ జట్టు ఓటములు చవిచూస్తోంది. హ్యాట్రిక్ ఓటములతో హైదరాబాద్ జట్టు రోజురోజుకీ దిగజారిపోతోంది. ఇప్పటి వరకు ఈ సీజన్ లో ఏడు మ్యాచ్ ల్లో రెండు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. వరుసుగా రెండు పరాజయాలతో లీగ్ ను ప్రారంభించిన సన్ రైజర్స్ జట్టు.. వరుసగా మూడు పరాజయాలను మూటగట్టుకుని అభిమానులను నిరాశ పరుస్తోంది.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ ఏడాది ఐపీఎల్ లో గాడిన పడినట్టు కనిపించడం లేదు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు రెండు మ్యాచ్ ల్లో మాత్రమే విజయం సాధించిన హైదరాబాద్ జట్టు ఐదు మ్యాచ్ ల్లో పరాజయం పాలైంది. ఢిల్లీ క్యాపిటల్స్ తో సోమవారం ఉప్పల్ వేదికగా జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు తడబాటుకు గురై ఓడిపోయింది. 144 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా చేజ్ చేసి గెలవాల్సినప్పటికీ.. చేజేతులారా అవకాశాన్ని జారవిడుచుకుంది హైదరాబాద్ జట్టు. దీంతో హైదరాబాద్ జట్టు పై అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ జట్టు యజమాని కావ్యా మారన్ పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.
కోట్లాది రూపాయలు పెట్టినా ఆడని ప్లేయర్లు..
హైదరాబాద్ జట్టు ఈ ఏడాది కోట్లాది రూపాయలు వెచ్చించి ప్లేయర్లను కొనుగోలు చేసింది. అయితే వీరిలో ఎవరూ పెద్దగా రాణించడం లేదు. రూ.13.25 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన హ్యారీ బ్రూక్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ లో తప్ప తనదైన స్థాయిలో ప్రదర్శన చేయలేదు. అన్ని కోట్ల రూపాయలు అనవసరంగా పెట్టారని, కనీసం రూ.50 లక్షలు పెట్టి రహానేను కొనుగోలు చేసిన అద్భుతంగా ఆడి ఉండేవాడని అభిమానులు పేర్కొంటున్నారు. రూ.50 లక్షలకు కొనుగోలు చేసిన అజింక్య రహానే ప్రస్తుతం చెన్నై జట్టులో అదరగొడుతున్నాడు. మయాంక్ అగర్వాల్ వరుసగా విఫలమవుతున్నా.. అవకాశాలు ఇవ్వడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కెప్టెన్ మార్క్రమ్ ఏదో చేస్తాడనుకుంటే.. ఏమీ చేయలేకపోతున్నాడని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
అక్కరకు రాని సొంత మైదానం..
ఇక హైదరాబాద్ జట్టు సొంత మైదానం ఉప్పల్ కూడా కలిసి రావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఉప్పల్ మైదానంలో ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో మూడు మ్యాచ్ ల్లో సన్ రైజర్స్ జట్టు ఓడిపోయింది. ఒక్క పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రమే గెలిచింది. ఉప్పల్ మైదానంలో వాస్తు దోషం ఉందని, దాని నివారణకు పూజలు చేయించాలని పలువురు అభిమానులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. హ్యారీ బ్రూక్, అభిషేక్ శర్మలు జట్టుకు శనిలా దాపురించారని అభిమానులు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.
దారుణంగా బోల్తా పడిన జట్టు..
సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఢిల్లీ జట్టులో అక్షర పటేల్ 34 బంతుల్లో 34 పరుగులు చేయగా, మనీష్ పాండే 27 బంతుల్లో 34 పరుగులు చేశాడు. వీరిద్దరూ మినహా ఎవరూ ఆశించిన స్థాయిలో పరుగులు చేయకపోవడంతో 144 పరుగులకు పరిమితమైంది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు. హైదరాబాద్ బౌలర్లలో సుందర్ మూడు వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టాడు. నటరాజన్ కు ఒక వికెట్ దక్కింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు దారుణమైన ఆటతీరుతో ఏడు పరుగులు తేడాతో పరాజయం పాలైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 137 పరుగులకే హైదరాబాద్ జట్టు పరిమితమైంది. హైదరాబాద్ జట్టులో మయాంక్ అగర్వాల్ 39 బంతుల్లో 49 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో కొంత మెరుగైన ఆట తీరు కనబరిచిన మయాంక్ అగర్వాల్ కు మరో బ్యాటర్ సహకరించకపోవడంతో జట్టు ఓటమి పాలైంది. హెన్రిచ్ క్లాసెన్ 19 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సుతో 31 పరుగులు చేశాడు. వాషింగ్టన్ సుందర్ 15 బంతుల్లో మూడు ఫోర్లతో 24 నాట్ అవుట్ గా నిలిచినా.. జట్టును విజయ తీరానికి చేర్చలేకపోయాడు. వరుసగా ఓటమి పాలవుతున్న హైదరాబాద్ జట్టు విజయాల బాట పట్టాలంటే సరైన ప్లేయర్లను బరిలో దించాలని అభిమానులు జట్టు యజమాని కావ్యా మారన్ కు సూచిస్తున్నారు.