T20 World Cup 2024 : జూన్ రెండు నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా టి20 వరల్డ్ కప్ జరగనుంది. చరిత్రలో తొలిసారిగా 20 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. క్రికెట్ కు మరింత చరిష్మా కల్పించేందుకు ఐసీసీ అమెరికాలో టి20 వరల్డ్ కప్ నిర్వహిస్తోంది. ప్రముఖ నగరమైన న్యూయార్క్ ప్రాంతంలో యుద్ధ ప్రాతిపదికన మైదానాలు నిర్మిస్తోంది. క్రికెట్ మైదానంపై పచ్చిక పెరగాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి.. వేరేచోట గడ్డిని పెంచి.. వాటిని క్రికెట్ మైదానాలలో ఏర్పాటు చేస్తోంది. అలానే న్యూయార్క్ లో భారీ స్టేడియం నిర్మించింది. ప్రస్తుతం ఆ స్టేడియంలో తుది నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇక వెస్టిండీస్ లోనూ ఇదే తరహాలో పనులు కొనసాగుతున్నాయి. భారత్ జూన్ 5న తన ప్రారంభ మ్యాచ్ ఐర్లాండ్ జట్టుతో ఆడనుంది. ఈ మ్యాచ్ న్యూయార్క్ వేదికగా జరగనుంది.
ఐసీసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీకి ఇప్పుడు ఉగ్రదాడి భయం పట్టుకుంది. తాజాగా ఉగ్రవాదుల నుంచి ఐసీసీ నిర్వాహకులకు హెచ్చరికలు వచ్చాయి. అయితే ఆ ఉగ్రవాదులు పాకిస్తాన్ దేశానికి చెందినవారు కావడంతో ఒక్కసారిగా కలకలం నెలకొంది. పైగా ఆ ఉగ్రవాదులు తమ డిమాండ్లు ఏమిటో చెప్పకుండా.. టోర్నీలు నిర్వహించద్దని హెచ్చరికలు జారీ చేయడం విశేషం. దీనిపై ఐసీసీ నిర్వాహక కమిటీ స్పందించింది. “ఉగ్ర వాదులు బెదిరింపులు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే టోర్నీ నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు మొత్తం పూర్తి చేశాం. ఇలాంటి సమయంలో హెచ్చరికలు చేస్తున్నారంటే.. వారు ఎలాంటి మనుషులో అర్థం చేసుకోవాలి. భద్రతాపరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం. ఇటువంటి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని” ఐసీసీ, వెస్టిండీస్ క్రికెట్ బోర్డు హామీ ఇచ్చాయి.
మరోవైపు వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్ ట్రోఫీ నిర్వహించేందుకు ఐసిసి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికైతే అక్కడ ఏర్పాట్లు మొదలు కాలేదు. అక్కడ స్టేడియాలలో సరైన నిర్వహణ లేకపోవడంతో గడ్డి విపరీతంగా పెరిగింది. అలా పెరిగిన గడ్డిని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూలీల చేత కోయిస్తోంది. ఇక ప్రస్తుతం టి20 వరల్డ్ కప్ నిర్వాహకులకు హెచ్చరికలు జారీచేసిన ఉగ్రవాదులు పాకిస్తాన్ దేశానికి చెందినవారు కావడంతో.. ఆ దేశంలో వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించడం కష్టమేననే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఐసీసీ అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తే.. తాము పాల్గొనబోమని భారత జట్టు ఇప్పటికే ప్రకటించింది.