Ind Vs Aus Pink Ball Test: తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టును 150 పరుగులకు కుప్ప కూల్చిన ఆస్ట్రేలియా బౌలర్లు.. రెండవ ఇన్నింగ్స్ లో మాత్రం చేతులెత్తేశారు. ఇక బ్యాటర్లు కూడా దారుణంగా విఫలమయ్యారు. హెడ్ మినహా మిగతా వారంతా చెప్పుకొదగ్గ స్థాయిలో బ్యాటింగ్ చేయలేదు. దీంతో ఆస్ట్రేలియా జట్టుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జట్టుకూర్పు సరిగా లేదని సీనియర్ ఆటగాళ్లు విమర్శిస్తున్నారు. తొలి టెస్టులో దారుణమైన ఓటమిని మూట కట్టుకున్న అనంతరం ఆస్ట్రేలియా జట్టు వర్గాలుగా విడిపోయిందని.. విభేదాలు చోటుచేసుకున్నాయని వార్తలు వస్తున్నాయి. పెర్త్ టెస్ట్ లో ఓటమికి బ్యాటర్లు మాత్రమే కారణమని స్టార్ బౌలర్ జోష్ హేజిల్ వుడ్ వ్యాఖ్యానించడం సంచలనం కలిగించింది. అయితే వీటిని ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ హెడ్ కొట్టి పారేశాడు. ఇవన్నీ పుకార్లని.. ఇలాంటివి ఎందుకు వ్యాపింప చేస్తారో అర్థం కావడం లేదని అతడు పేర్కొన్నాడు. “జట్టులో అంత బాగానే ఉంది. విభేదాలకు తావులేదు. జట్టు వర్గాలుగా విడిపోలేదు. సమష్టి తత్వం ఆస్ట్రేలియా ఆటగాళ్ల రక్తంలోనే ఉంది. దీనిని వేరే విధంగా చూడొద్దు. అది సరైన పద్ధతి కాదని” హెడ్ వ్యాఖ్యానించాడు.
వాటిని నమ్మొద్దు
జట్టు గురించి కీలక విషయాలను వెల్లడించిన హెడ్.. విలేకరులు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు.”పింక్ బాల్ అంటే మేము భయపడటం లేదు. అడిలైడ్ వేదికగా జరిగే డే అండ్ నైట్ టెస్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. పెర్త్ లో మా స్థాయికి తగ్గట్టుగా మేము ఆగలేకపోయాం. ముఖ్యంగా బౌలర్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతడిని ఎదుర్కోవడం మాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇక నాలుగు సంవత్సరాల క్రితం భారత్ పింక్ బాల్ టెస్టులో 36 పరుగులకే కుప్పకూలింది. అలాంటి పరిణామం ఈసారి చోటుచేసుకునే అవకాశం లేకపోవచ్చు. మేం కూడా గులాబీ బంతితో క్రికెట్ ఆడి చాలా రోజులైంది. ఇప్పుడు పరిస్థితులు మాకు కాస్త కఠినంగా ఉన్నాయి. మేము ఆట తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కచ్చితంగా బౌన్స్ బ్యాక్ అన్నట్టుగా ఆడతామని” హెడ్ పేర్కొన్నాడు. కాగా, పెర్త్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో హెడ్ విఫలమయ్యాడు. రెండవ ఇన్నింగ్స్ లో మాత్రం అదరగొట్టాడు. ఉస్మాన్ ఖవాజా, స్మిత్, లబూ షేన్ వంటి ఆటగాళ్లు విఫలమైన చోట.. హెడ్ నిలబడ్డాడు. సెంచరీ వైపుగా అడుగులు వేశాడు. అయితే బుమ్రా వేసిన బంతిని తప్పుగా అంచనా వేసి కీపర్ పంత్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. తొలి మ్యాచ్ ఓడిపోయిన తర్వాత బుమ్రా బౌలింగ్ పై హెడ్ ప్రశంసల జల్లు కురిపించాడు. కాగా, బోర్డర్ గవాస్కర్ సిరీస్లో రెండవ టెస్ట్ మ్యాచ్ శుక్రవారం అడిలైడ్ వేదికగా డే అండ్ నైట్ జరగనుంది.