Yashasvi Jaiswal: పానీపూరి పోరని దెబ్బకు ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. క్రికెట్‌లో తల పండిన జాతీయ, అంతర్జాతీయ ఆటగాళ్లకు కూడా సాధ్యం కాని ఫాస్టెస్ట్ ఫిఫ్టీని ఓ మామూలు కుర్రాడు సాధించి చూపించాడు. కోల్‌కతాపై రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(47 బంతుల్లో.. 98 నాటౌట్) అదరగొట్టాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్‌లో కొత్త రికార్డును నమోదు చేశాడు.
మొన్న ముంబయ్‌పై.. నిన్న కోల్‌కతాపై..
సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌పై (124; 62 బంతుల్లో 16 ఫోర్లు, 8 సిక్స్‌లు)తో శతక్కొట్టిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరోసారి తన విశ్వరూపం ప్రదర్శించాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై (47 బంతుల్లో 98 నాటౌట్)తో దుమ్ము రేపాడు ఇందులో 13 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ కోల్‌కతా బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 13 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడంటే అతడి విధ్వంసం ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఐపీఎల్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఇదే కావడం విశేషం. అంతకుముందు ఈ రికార్డు కేఎల్ రాహుల్ (14 బంతుల్లో, 2018), పాట్ కమి¯Œ ్స (14 బంతుల్లో, 2022) పేరిట ఉండేది.
పానీ పూరి అమ్మి అండర్–19 జట్టులో చోటు..
తన ఆశయాన్ని చేరుకునే క్రమంలో యశస్వి జైస్వాల్ అహర్నిశలు కృషి చేశాడు. ఇందుకోసం పానీ పూరీలు అమ్మాడు. పడుకోవడానికి స్థలం లేక క్రికెట్ మైదానంలోని గుడారాల కింద ఆశ్రయం పొందాడు. చివరకు అనుకున్నది సాధించాడు. 17 ఏళ్ల వయసులో 2018లో అండర్–19 జట్టుకు ఎంపికయ్యాడు ఉత్తరప్రదేశ్‌లోని భాడోహికి చెందిన యశస్వి జైస్వాల్. తండ్రి ఓ చిన్న దుకాణాన్ని నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇద్దరు కొడుకుల్లో చిన్నవాడైన యశస్వి జైస్వాల్ చిన్నప్పటి నుంచి క్రికెటే ప్రాణంగా పెరిగాడు. 11 ఏళ్ల వయసులోనే ఎప్పటికైనా టీమిండియాకు ఆడాలని కలలు కన్నాడు. దాని కోసం అమ్మానాన్నలను.. ఉన్న ఊరును వదిలి ముంబై చేరాడు. క్రికెట్‌పై యశస్వి జైస్వాల్‌కి ఉన్న ఆసక్తిని గమనించిన తండ్రి అడ్డుచెప్పలేదు.
డెయిరీలో పని చేస్తూ…
ఉత్తరప్రదేశ్ నుంచి ముంబైకి చేరుకున్న యశస్వి జైస్వాల్ ఓ డైరీలో పనికి కుదిరి స్థానికంగా క్రికెట్ ఆడడం మొదలెట్టాడు. అయితే రోజంతా ఆడి అలసి రాత్రి వేళ పడుకోవడంతో.. పడుకోవడానికే డైరీకి వస్తున్నాడంటూ అతన్ని కొన్నిరోజుల తర్వాత పని నుంచి తప్పించారు. అదే సమయంలో ముంబైలోని వర్లీలో ఉండే అతని మామ సంతోష్ అక్కడే ఉండే ఆజాద్ మైదానంలోని ముస్లిమ్ యునైటెడ్ క్లబ్ వాళ్ల గుడారాల్లో ఉండే ఏర్పాటు చేశాడు.
మూడేళ్లు.. ముస్లిం యునైటెడ్ క్లబ్‌లో..
యశస్వి జైస్వాల్ మామ ముస్లిమ్ యునైటెడ్ క్లబ్‌లో మేనేజర్‌గా పనిచేస్తుండటంతో ఆయన అడగటంతో అందుకు వారు అంగీకరించారు. మూడేళ్లపాటు జైశ్వాల్ అక్కడే ఉన్నాడు. ఎన్ని కష్టాలు పడినప్పటికీ ఆ విషయాలను ఇంట్లో వాళ్లకు మాత్రం చెప్పలేదు. ఒకవేళ ఇంట్లో తెలిస్తే ఇక క్రికెట్ ఆడింది చాలు, ఉత్తర ప్రదేశ్‌కు వచ్చేయి అని పిలుస్తారామోననుకున్నాడు. ఇంటి నుంచి అప్పుడప్పుడు వాళ్ల నాన్న డబ్బులు పంపించినా కూడా అవి ఏ మూలా సరిపోయేవి కాదు.
క్రికెట్‌ను మాత్రం మానలేదు.
ఎన్ని కష్టాలు ఎదురైనా యశస్వి క్రికెట్ ఆడడం మాత్రం మానలేదు. తినడం కోసం సొంతంగా పనులు చేయడం మొదలెట్టాడు. పానీ పూరీ సైతం అమ్మాడు. ఓ షాపింగ్ దుకాణంలో కూడా పనిచేశాడు. అదేసమయంలో ఆటను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. స్థానిక టోర్నీల్లో పాల్గొంటూ సెంచరీల మీద సెంచరీలు బాదాడు. దాంతో స్థానికంగా జైశ్వాల్ పేరు మార్మోగింది. ఆ నోటా ఈ నోటా పడి అది చివరకు స్థానిక క్రికెట్ కోచ్ జ్వాలా సింగ్ చెవికి చేరింది.
జ్వాలా సింగ్ శిక్షణలో రాటుదేలి..
వేరే వారి ద్వారా యశస్వి గురించి తెలుసుకున్న జ్వాలా సింగ్ అతని ఆటను చూద్దామని మైదానానికి వచ్చాడు. డివిజన్–ఎ ఆటగాడి బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొని ఫోర్లు మీద ఫోర్లు సాధిస్తున్న యశస్వి ఆట చూసి అతడు ముగ్ధుడయ్యాడు. దీంతో జైశ్వాల్‌కు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకుని తనతోపాటు తీసుకెళ్లాడు. జ్వాలాసింగ్ శిక్షణలో రాటుదేలిన యశస్వి జైశ్వాల్ ముంబై అండర్–19 జట్టుకు ఎంపికయ్యాడు. ముంబై అండర్–19 జట్టు తరఫున అద్భుత ప్రదర్శన కనబరిచిన ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ శ్రీలంకలో పర్యటించే భారత అండర్–19 జట్టుకు ఎంపికయ్యాడు.
ఐపీఎల్ వేలంలో..
అద్భుత ఆటతీరుతో యశస్వి ఐపీఎల్ వేలంలోకి వచ్చాడు. రాజస్థారన్ రాయల్స్ జట్టు యాజమాన్యం యశస్విని 2020లో రూ.2.4 కోట్లకు కొనుగోలు చేసింది. తాజా ప్రదర్శనతో స్టార్ అయ్యాడు. ఈ క్రెడిట్ వెనుక యశస్వి పట్టుదల, శ్రమ, కష్టం ఉన్నాయి.