IPL 2023 RCB: రాయల్ చాలెంజ్ బెంగళూరు.. గేమ్ చేంజ్ ఆటగాళ్లు.. అనుభవం ఉన్న క్రికెటర్లు ఉన్నా.. ఆ జట్టు ట్రోఫీ కల మాత్రం నెరవేడరడం లేదు. 15 సీజన్లు ముగిసిపోయాయి. 16వ సీజన్‌లో కూడా ట్రోఫీ దక్కే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లలో ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో ఉంది. రెండు మ్యాచ్‌లలో వరుస పరాజయాలు, ఆ జట్టు రన్‌రేట్ చూస్తుంటే ప్లే ఆఫ్ ఆశలు దాదాపు లేనట్లే. మరి 16 సీజన్లలో టైటిల్ ఆ జట్టు ఎందుకు అందుకోలేకపోతోంది. కారణాలు ఎమిటో తెలుసుకుందాం.
అన్ని విధాలా అనుభవం..
బెంగళూరు ఎప్పుడూ జనాదరణ పొందిన జట్టు. వారు తమ బ్రాండ్ విలువను పెంపొందించడంపై చాలా దృష్టి పెట్టారు. వేలం సమయంలో హాట్ ప్రాపర్టీస్‌గా ఉన్న ఆటగాళ్లపై పెద్ద మొత్తంలో డబ్బులు గుమ్మరించి కొనుగోలు చేశారు. ప్రతీ సీజన్‌లో మంచి వ్యూహంతో బరిలో దిగుతున్నారు. కానీ, లీగ్ దశలోనే వెనుదిరుగుతున్నారు.
బిగ్ త్రీ..
క్రిస్ గేల్–విరాట్ కోహ్లీ–ఏబీడివిలియర్స్ త్రయం నుంచి ఆర్బీసీ యాజమాన్యం భారీ అంచనాలు పెట్టుకుంది. తర్వాత డుప్లెసిస్–విరాట్ కోహ్లీ–గ్లెన్ మాక్స్‌వెల్ త్రయంపై అంచనాలు పెట్టుకుంది. కానీ ఆశించిన ఫలితం రాలేదు. వాస్తవానికి ‘బిగ్ త్రీ’ కాకుండా వారు షేన్ వాట్సన్, యువరాజ్ సింగ్ ఉన్న సమయంలో మంచి ఫలితం రాబట్టారు. ట్రోఫీకి దగ్గరగా వచ్చారు. ప్రస్తుతం కీలక ఆటగాళ్లు ఉన్నా ఫలితం మాత్రం పెద్దగా కనిపించడం లేదు. ఆ జట్టులో ఐపీఎల్ చరిత్రలో కేవలం ఆరుగురు ఆటగాళ్లు మాత్రమే వెయ్యికి పైగా పరుగులు సాధించారు. వారిలో ఐదుగురు విదేశీ ఆటగాళ్లు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన భారతీయ ఆటగాడు కోహ్లీ. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. ఇందులోని 12 మంది ఆటగాళ్లు వెయ్యికి పైగా పరుగులు సాధించారు. ఇందులో ఏడుగురు భారతీయులే. అదేవిధంగా, ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్‌లో 10 మంది ఆటగాళ్లు వెయ్యికి పైగా పరుగులు సాధించారు, వారిలో ఏడుగురు భారతీయులు.
పని విభజన జరిగితేనే..
ఐపీఎల్ వంటి సుదీర్ఘ టోర్నీలో జట్టులోని ఆటగాళ్ల మధ్య పనిభారం సమానంగా విభజన జరగాలి. అప్పుడే ఆ జట్టు విజయవంతం అవుతుంది. మొదటి మూగ్గురు, నలుగురిపై ఆధారపడి ఆర్బీసీ ఐపీఎల్ టైటిల్ కోసం ప్రయత్నం చేయడం ఆ జట్టు వైఫల్యానికి ప్రధాన కారణం. అంతర్జాతీయ క్రికెటర్లపై ఎక్కువగా ఆధారపడడం, భారతీయ బ్యాట్స్‌మెన్లను తక్కువగా అంచనా వేయడం ఆజట్టు యాజమాన్యం చేస్తున్న మరో తప్పు. బౌలింగ్ విభాగాన్ని కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆ జట్టులో టోర్నీలో పది వికెట్లు తీసిన బౌలర్లు ఇద్దరే హసరంగా (ఎనిమిదో), మిచెల్ స్టార్క్ (పదో) ఉన్నారు. బౌలింగ్ లైనప్‌లో అంతర్జాతీయ నైపుణ్యం లేకపోవడం, ఆ జట్టు యాజమాన్యం అత్యుత్తమ బౌలర్లను ఎంపిక చేసుకోకపోవడం ఆ జట్టు వైఫల్యాలకు ఇంకో కారణం. ముంబై, చెన్నై జట్లు అన్ని విభాగాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ విజయవంతంగా టోర్నీ గెలుచుకుంటున్నాయి. పంజాబ్, బెంగళూరు జట్లతో ఆలోపం కొట్టొచ్చినట్లుకనిపిస్తుంది.
ఇప్పటికైనా యాజమాన్యం ముగ్గురు నలుగురిపై ఆధారపడడం, బౌలింగ్ విభాగానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం వంటి అంశాల్లో మార్పు చేస్తేనే ఆ జట్టు ఐపీఎల్ టైటిల్ విన్నర్ అవుతుంది. ఈ విషయాన్ని యాజమాన్యం గ్రహిస్తుందో లేదో చూడాలి.