Abhishek Sharma: జూన్ 1 నుంచి టి20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. టి20 అంటేనే వేగానికి అసలు సిసలైన కొలమానం. ఎంత దూకుడుగా బ్యాటింగ్ చేస్తే.. ఆ జట్టు గెలిచేందుకు అన్ని అవకాశాలుంటాయి. అందుకే చాలా జట్లు టి20 వరల్డ్ కప్ లో దూకుడుగా ఆడే ఆటగాళ్లకు అవకాశాలు కల్పిస్తాయి. ప్రస్తుతం మన దేశంలో ఐపిఎల్ ఉత్సాహంగా సాగుతోంది. వివిధ జట్ల తరఫున ఆడుతున్న భారతీయ క్రీడాకారులు తమ సత్తా చాటుతున్నారు. అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు అభిషేక్ శర్మ. హైదరాబాద్ జట్టు తరఫున ఆడుతున్న 24 ఏళ్ల యువకుడు.. ఓపెనర్ గా బరిలోకి దిగుతూ, ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. హెడ్ తో కలిసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పుతున్నాడు.. అభిషేక్ శర్మ ఈ సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచులు ఆడి, 288 రన్స్ చేశాడు. హైయెస్ట్ రన్స్ చేసిన ప్లేయర్ల లిస్టులో 12వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ సీజన్లో అతడి హైయెస్ట్ స్కోర్ 63. స్ట్రైక్ రేట్ 218.18. ఇందులో 21 ఫోర్లు, 26 సిక్స్ లు బాదాడు.
అండర్ – 19 క్రికెట్ లో వినూ మన్కడ్ ట్రోఫీ ద్వారా పంజాబ్ తరఫున అభిషేక్ శర్మ ఎంట్రీ ఇచ్చాడు. అరంగేట్ర మ్యాచ్ లోనే సెంచరీ కొట్టాడు. 2016లో అండర్ -19 ఆసియా కప్లో టీమిండియాను విజయపథంలో నడిపించాడు. 2018 అండర్ – 19 ప్రపంచ కప్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. బ్యాటింగ్ మాత్రమే కాదు, ఎడమచేతి స్పిన్ బౌలింగ్ కూడా అభిషేక్ శర్మ చేయగలడు. అభిషేక్ శర్మ 2018లో ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతడిని ఢిల్లీ డేర్ డెవిల్స్ ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ప్రారంభ సీజన్లో అతడు కేవలం మూడు మ్యాచులు మాత్రమే ఆడాడు. ఆ తర్వాత 2019లో హైదరాబాద్ అతడిని కొనుగోలు చేసింది. 2023 వరకు అంతంతమాత్రంగానే అతను ప్రదర్శన చేశాడు.
కానీ, ప్రస్తుత సీజన్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ ప్రత్యర్థి బౌలర్లకు సింహ స్వప్నం లాగా మారిపోయాడు. హెడ్ తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాలు నిర్మిస్తున్నాడు. ఇటీవల ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ జట్టు తొలి వికెట్ కు 6.2 ఓవర్లలో 133 పరుగులు నమోదు చేసింది. ఇందులో కేవలం 12 బంతుల్లో అభిషేక్ శర్మ 46 పరుగులు చేశాడంటే.. అతడి బ్యాటింగ్ స్థాయి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓపెనర్ గా భయం లేకుండా ఆడుతున్న అభిషేక్ శర్మ ను సీనియర్ ఆటగాళ్లు మెచ్చుకుంటున్నారు. టి20 లో ఇలాంటి దూకుడు ఆటే కావాలని కోరుతున్నారు. అతడికి అవకాశం కల్పిస్తే అద్భుతంగా ఆడతాడని చెబుతున్నారు. మరి టీమ్ ఇండియా సెలెక్టర్లు అభిషేక్ శర్మ ను పరిగణలోకి తీసుకుంటారా? అవకాశం కల్పిస్తారా? అనేది ఏప్రిల్ 28న తేలనుంది.