ఐసీసీ నిర్వహించే సిరీస్ ల తర్వాత క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన టోర్నీ ఐపీఎల్! ఈ సీజన్ మొదలవుతుందంటే వరల్డ్ వైడ్ గా క్రికెట్ ఫీవర్ స్టార్ట్ అవుతుంది. ప్రపంచంలోని అందరు ఆటగాళ్లను ఐపీఎల్ కలుపుకుంటే.. ఐపీఎల్ ను ప్రపంచంలోని క్రికెట్ ఫ్యాన్స్ ఓన్ చేసుకున్నారు. అందుకే.. అత్యంత ఘనంగా భారీ హంగుల నడుమ కొనసాగుతూ ఉంటుంది ప్రతీ సీజన్. అయితే.. కరోనా రాకతో లాస్ట్ టోర్నీ ఆలస్యంగా.. ప్రేక్షకుల గోల లేకుండా కాస్త పేలవంగా సాగిన ఈ టోర్నీ.. ఈ ఏడాది పోరుకోసం మరోసారి రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఆటగాళ్ల మినీ వేలం కూడా పూర్తయిపోయింది.
Also Read: ఇంగ్లండ్ తో టీ20 సిరీస్ కు భారత జట్టు ఇదే.. ఇద్దరు యువ క్రికెటర్లకు చోటు
అయితే.. ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్‌ను మొత్తాన్ని కేవలం ఒకే నగరానికి పరిమితం చేయనున్నారన్నది ఆ వార్త సారాంశం. దీనికి కారణం కరోనా భయం పూర్తిగా తొలగకపోవడమే కారణమని సమాచారం. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైనా.. కరోనా కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో విదేశీ ప్రయాణాలు చేసే వారిపై ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలో పలు నగరాల్లో బహిరంగ సభలు, క్రీడలకు ఇంకా అనుమతులు మంజూరు చేయట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బీసీసీఐ గవర్నింగ్ బాడీ ఒకే వేదిక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇండియన్ సూపర్ లీగ్ 2020/21 ఫుట్‌బాల్ సీజన్‌ను ప్రస్తుతం గోవాలోని మూడు స్టేడియాల్లో నిర్వహిస్తున్నారు. 11 జట్లు పాల్గొంటున్న ఈ ఫుట్‌బాల్ లీగ్‌ను ఒకే నగరంలో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇదే వ్యూహాన్ని ఐపీఎల్‌కు కూడా అనుసరించాలని బీసీసీఐ భావిస్తోందట. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు భారత్ లో పర్యటిస్తోంది. అయితే.. ఇంగ్లండ్ పర్యటన మొత్తం మూడు వేదికలకే పరిమితం చేసింది బీసీసీఐ. ఇదే విధంగా.. ఐపీఎల్‌ను కూడా ఒకే నగరానికి పరిమితం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
సాధారణంగా ఐపీఎల్ వేలం సమయంలోనే బీసీసీఐ వేదికలను ప్రకటిస్తుంది. కానీ.. ఇప్పటి వరకూ స్పష్టత ఇవ్వకపోవడానికి ఈ ఒకే నగరం ఆలోచనే కారణమని తెలుస్తోంది. వేర్వేరు నగరాల్లో మ్యాచ్ లు నిర్వహిస్తే.. బయోబబుల్ వాతావరణం ఏర్పాటు చేయడం చాలా భారంగా మారుతుందని భావిస్తోందట బీసీసీఐ. బయోబబుల్ వెదర్ వల్ల కరోనా రాకుండా కృత్రిమ చర్యలు చేపడతారు. ఇది ఖర్చుతో కూడుకున్నది. అందుకే ముంబైలోని వాంఖడే స్టేడియంతోపాటు డీవై పాటిల్, బ్రబౌర్న్ స్టేడియాల్లో ఈ ఐపీఎల్ మ్యాచ్ లు మొత్తం నిర్వహించాలని చూస్తోందట.
Also Read: టీమిండియా క్రికెటర్లు స్టెప్పులేస్తే ఎలా ఉంటుందో తెలుసా?
అయితే.. దీనికి ప్రాంఛైజీలన్నీ అంగీకరిస్తాయా? అన్నదే సందేహం. చెన్నైలో జరిగిన మినీ వేలం సమయంలో అన్ని ఫ్రాంచైజీలు తమ హోం గ్రౌండ్స్‌కు తగినట్లుగా ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఇప్పుడు ఒకే నగరంలో ఐపీఎల్ నిర్వహిస్తామంటే ఫ్రాంచైజీలు ఒప్పుకునే అవకాశం లేదని అంటున్నారు.
అయితే.. దీనికీ బీసీసీఐ ఓ ప్లాన్ సిద్ధం చేసిందట. ఒకే నగరంలో మ్యాచ్ ల నిర్వహణకు ఫ్రాంచైజీలు ఒప్పుకోకుంటే.. ఎవరి హోం గ్రౌండ్‌లో వాళ్లే బయో బబుల్ వాతావరణాన్ని సృష్టించుకోవాలని బీసీసీఐ కోరే అవకాశం ఉందట. కానీ, అది అదనపు ఖర్చు కావడంతో ఫ్రాంచైజీలు ఒప్పుకుంటాయా? అన్నది కూడా సందేహమే. మరి, ఏం జరుగుతుంది? ఒకే నగరం వర్కవుట్ అవుతుందా? లేక రెగ్యులర్ పద్ధతిలోనే మ్యాచ్ లను నిర్వహిస్తారా? అన్నది చూడాలి.