IND vs ENG: బ్రెండన్ మెకల్లమ్(Brendon McCullum) కోచ్ సారధ్యంలో ఇంగ్లాండ్ జట్టు(England tea టెస్ట్ క్రికెట్లో సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది.. బజ్ బాల్(Buzz ball ) అనే ఆటను తెరపైకి తెచ్చింది. తద్వారా వరుస టెస్ట్ సిరీస్ లు, విజయాలు అందుకుంది.. చివరికి ఆస్ట్రేలియా జట్టును కూడా మట్టి కరిపించింది. అదే ఊపులో గత ఏడాది పాకిస్తాన్ లో పర్యటించింది. పాకిస్తాన్ పై బజ్ బాల్ క్రికెట్ ఆడి టెస్ట్ సిరీస్ విజయాన్ని దక్కించుకుంది.. అదే ఉత్సాహంతో భారత గడ్డపై అడుగు పెట్టింది.. ఐదు టెస్టుల సిరీస్లో.. తొలి టెస్ట్ లో విజయం సాధించింది. ఇక తర్వాత టీమిండియా మొదలుపెట్టింది. వరుసగా నాలుగు టెస్టు విజయాలను భారత్ గెలిచింది. సిరీస్ ను 4-1 తేడాతో దక్కించుకుంది.. ఆస్ట్రేలియా జట్టు కూడా నేర్పని పాఠాన్ని భారత్ ఇంగ్లాండ్ కు రుచి చూపించింది.
మళ్లీ మనమే..
ఏడాది క్రితం ఎదురైన టెస్ట్ సిరీస్ ఓటమి ఇంగ్లాండ్ జట్టుకు అనేక గుణపాఠాలు నేర్పినట్టుంది. అయినప్పటికీ ఇంగ్లాండ్ జట్టు కోచ్ మెకల్లమ్ బజ్ బాల్ క్రికెట్ ను మర్చిపోలేదు. టెస్ట్ క్రికెట్ ను పక్కనపెట్టి..టీ 20 లో అదేవిధానాన్ని అనుసరించాలని భావించాడు. కెప్టెన్ బట్లర్ తో కలిసి బజ్ బాల్ క్రికెట్ కే ఓటు వేశాడు. కానీ ఈసారి కూడా టీమిండియా ఇంగ్లాండ్ జట్టు బజ్ బాల్ క్రికెట్ కు చెక్ పెట్టింది. టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో రంగంలోకి దిగిన తర్వాత ఇంగ్లాండ్ జట్టు బజ్ బాల్ క్రికెట్ పప్పులు ఉడకలేదు. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ వంటి వారు ఎదురుదాడి చేయగా..మరో ఎండ్ నుంచి హార్దిక్ పాండ్యా చుక్కలు చూపించగా.. ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఏమాత్రం తేరుకోలేకపోయారు. బజ్ బాల్ మోజులో పడి సిసలైన టెక్నిక్ మర్చిపోయారు. అందువల్లే ఇంగ్లాండ్ జట్టు స్కోరు 132 పరుగుల వద్దే ఆగిపోయింది. స్వదేశంలో అయితే ఇంగ్లాండ్ జట్టు బజ్ బాల్ క్రికెట్ ఆడేందుకు ఆస్కారం ఉంటుంది. అక్కడ విజయవంతం అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నది టీమిండియా. పైగా ఇటీవల కాలంలో t20 లలో వరుస విజయాలు సాధిస్తోంది. బలమైన ఆస్ట్రేలియా నుంచి మొదలుపెడితే.. సంచలన సౌతాఫ్రికా వరకు ఓడించుకుంటూ వస్తోంది. అలాంటి జట్టు ముందు బజ్ బాల్ క్రికెట్ ఆడితే.. సముద్రాన్ని ఈదిన వాడి ముందు పిల్లకాలువను చూపించినట్టు ఉంటుంది. ఇది ఇప్పటికైనా ఇంగ్లాండ్ జట్టు మేనేజ్మెంట్ కు అర్థం అవుతుందో వేచి చూడాల్సి ఉంది.