Bharat Ratna: భారతరత్న అవార్డును ప్రథమంగా 1954లో ప్రారంభించారు. ఈ అవార్డు పరిగణనలో అత్యధిక విశిష్టత ఉంది, మరియు దీనిని తీసుకునే వారు భారతదేశంలో అత్యున్నత సాహసులు లేదా సామాజిక నాయకులు. ఏటా రిపబ్లిక్ డే(Republic Day) వేళ భారత రత్న పురస్కారం ప్రకటిస్తుంది భారత ప్రభుత్వం. దీంతో ఈ సారి ఎవరికి ఇవ్వొచ్చన్న చర్చ మొదలైంది. గతేడాది చరిత్రోలోనే మొదటిసారి ఐదుగురికి భారత రత్న ప్రకటించింది. ఈసారి కూడా ఈ పురస్కారం రేసులో పలువురు ప్రముఖులు ఉన్నారు. అయితే రేసులో రతన్ టాటా(Ratan TATA), మన్‌మోహన్‌సింగ్(Manmohan Singh) ముందు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. నందమూరి తారకరామారావుకు కూడా భరత రత్న ఇవ్వాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది.
రేసులో వీరు..
భారత రత్న పురస్కారం రేసులో దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా, మాజీ ప్రధాని మన్‌మోహన్‌సింగ్ ముందు వరుసలో ఉన్నారు. గతేడాది అక్టోబర్‌లో రతన్ టాటా కన్నుమూశారు. ఆయన బతికుండగానే భారత రత్న ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. మరణానంతరం ఈ డిమాండ్ పెరిగింది. మహారాష్ట్ర ప్రభుత్వం(Maharashtra Governament)కూడా ఈమేరకు తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది.
మాజీ ప్రధాని మన్‌మోహన్‌సింగ్ కూడా గతేడాది డిసెంబర్ 26న కన్నుమూశారు. ఆయనకు భారత రత్న ఇవ్వాలని కాంగ్రెస్ తోపాటు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు కోరుతున్నాయి. మరోవైపు మన్‌మోహన్‌సింగ్‌కు ఢిల్లీలో స్మృతి స్థల్ నిర్మించాలని కేంద్రం భావిస్తోంది. దీంతోపాటు భారత రత్న ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్‌తో సుదీర్ఘ అనుబంధం ఉన్న మాజీ రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీకి(Pranab Mukharjee) మోదీ ప్రభుత్వం భారత రత్న ఇచ్చింది. 2024లో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు(PV. Narsimharao)కు కూడా భారత రత్న ప్రకటించింది. ఈ నేపథ్యంలో మన్‌మోహన్‌సింగ్‌కు కూడా అవార్డు ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.
రేసులో ఎన్టీఆర్ కూడా..
ఇక భారత రత్న రేసులో టీడీపీ వ్యవస్థాపకుడు, నవరస నట సార్వభౌమ నందమూరి తారకరామారావు(NTR) కూడా ఉన్నారు. ఆయనకు భారత రత్న ఇవ్వాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కోరుతున్నాయి. ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో టీడీపీ భాగస్వామిగా కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి భారత రత్న ప్రకటించేలా ఒత్తిడి చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. దళిత ఐకాన్, బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్‌కు కూడా భారత రత్న ఇవ్వాలని చాలాకాలంగా డిమాండ్ ఉంది. గతంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, వీర్ సావర్కర్,జ్యోతిరావ్ పూలే, సావిత్రిబాయ్ పూలే, బిహార్ తొలి సీఎం శ్రీకృష్ణసింగ్, బీపీ మండల్, ఒడిశా మాజీ సీఎం బీజూ పట్నాయక్ తదితరుల కూడా భారత రత్న రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఈసారి ముగ్గురు లేదా నలుగురికి భారత రత్న ప్రకటించే అవకాశం ఉంది.
ఢిల్లీ ఎన్నికల తర్వాతే..
గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రత్న ప్రకటించాల్సి ఉన్నా.. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. దీంతో ఢిల్లీలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాతే అవార్డులు ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇక అవార్డుల పరంగా చూస్తే ఇప్పటి వరకు 53 మందికి భారత రత్న ప్రకటించారు. 2024లో గరిష్టంగా ఐదుగురికి భారత రత్న ప్రకటించింది కేంద్రం. 1999లో నలుగురికి భారత రత్న ప్రదానం చేశారు.