England Vs Oman: ఇంగ్లాండ్ బ్యాటర్ల వీరవిహారం.. చేజింగ్ లో ప్రపంచ రికార్డులన్నీ బద్దలు.. సూపర్ 8కు భారీ రన్ రేట్

టి20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతోంది. ముఖ్యంగా స్కాట్లాండ్ జట్టుతో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 14, 2024 2:03 pm

England Vs Oman

Follow us on

England Vs Oman: డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ టి20 వరల్డ్ కప్ లో సూపర్ -8 కు చేరుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో.. అదరగొట్టింది. సింహం జూలు విధిల్చినట్టు.. ఒక్కసారిగా మైదానంలో తాండవం చేసింది. శుక్రవారం ఒమన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఆల్ రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టింది.. టి20 వరల్డ్ కప్ లో ఆలస్యంగా విజయం సాధించినప్పటికీ.. అదిరిపోయే గెలుపును సొంతం చేసుకుంది.. ఈ విక్టరీ ద్వారా నెట్ రన్ రేటును -1.800 నుంచి +3.081 కు పెంచుకుంది.

టి20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతోంది. ముఖ్యంగా స్కాట్లాండ్ జట్టుతో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. రెండవ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో దారుణ పరాజయాన్ని చవిచూసింది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ సూపర్ -8 ఆశలు డోలాయమానంలో పడ్డాయి. దీంతో మిగిలిన రెండు మ్యాచ్లలో ఇంగ్లాండ్ జట్టు భారీ పరుగుల తేడాతో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తనకంటే ముందు ఉన్న స్కాట్లాండ్ (ఐదు పాయింట్లు, +2.164 నెట్ రన్ రేట్) ను అధిగమించాల్సిన ముందు ఉంది. దీంతో ఇంగ్లాండ్ ఒమన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 3.1 ఓవర్లలోనే రికార్డు స్థాయిలో లక్ష్య చేదన చేసింది. దీంతో ప్రపంచ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేసింది.

ఈ మ్యాచ్లో భాగంగా ఒమన్ 13.2 ఓవర్లలో 47 పరుగులకు కుప్పకూలింది. ఆదిల్ రషీన్ 4/11, మార్క్ వుడ్ 3/12, జోప్రా ఆర్చర్ 3/12 ధాటికి ఒమన్ టాప్ ఆర్డర్ పేక మేడలా కూలిపోయింది. ఒమన్ జట్టు బ్యాటర్లలో షోయబ్ ఖాన్ 11 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అనంతరం ఈ లక్ష్యాన్ని చేదించేందుకు ఇంగ్లాండ్ బరిలోకి దిగింది. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది.. ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ 8 బంతుల్లో 24 పరుగులు చేశాడు.

ఇక బంతుల పరంగా టి20 క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా లక్ష్యాన్ని చేదించిన జట్టుగా ఇంగ్లాండ్ వినతికెక్కింది.. మరో 101 బంతులు మిగిలి ఉండగానే ఒమన్ పై విజయం సాధించింది. ఇంగ్లాండ్ కంటే ముందు ఈ రికార్డు శ్రీలంక జట్టుపై ఉండేది. 2014 టి20 వరల్డ్ కప్ లో నెదర్లాండ్స్ జట్టుపై జరిగిన మ్యాచ్లో శ్రీలంక 90 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సాధించింది. ఇక తర్వాత స్థానంలో ఆస్ట్రేలియా కొనసాగుతోంది. ఆస్ట్రేలియా జట్టు రెండుసార్లు ఈ ఘనతను సాధించింది. ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో నమీబియా జట్టు పై 86 బంతులు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా విజయాన్ని సాధించింది. 2021 t20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ పై 82 బంతులు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా లక్ష్యాన్ని అందుకుంది. 2021లో భారత జట్టు స్కాట్లాండ్ పై 81 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సాధించింది.

-సూపర్ 8కి చేరువైన ఇంగ్లండ్.. స్కాట్లాండ్ ఓడితేనే ఛాన్స్

గ్రూప్ బిలో స్కాట్లాండ్ తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం.. స్కాట్లాండ్ వరుస రెండు విజయాలతో ఇంగ్లండ్ కు సూపర్ 8 అవకాశాలు దాదాపు సంక్లిష్టం అయ్యాయి. ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం కూడా ఇంగ్లండ్ రన్ రేట్ ను దెబ్బతీసింది. దీంతో తప్పక రెండు మ్యాచ్ లు గెలవాల్సిన అగత్యం ఏర్పడింది. అందుకే తాజాగా పసికూన ఒమన్ పై ఇంగ్లండ్ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఒమన్ ను 47 పరుగులకే కుప్పకూల్చి లక్ష్యాన్ని కేవలం 3.1 ఓవర్లలోనే చేధించింది. తద్వారా మైనస్ లో ఉన్న రన్ రేట్ ను ఏకంగా ఈ మ్యాచ్ తర్వాత +3.081కు పెంచుకుంది. ఒక రకంగా ఇంగ్లాండ్ తన సూపర్ 8 అవకాశాల్ని నిన్న ఒమన్ మ్యాచ్ తోనే సెటిల్ చేసుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 3 పాయింట్లతో ఇంగ్లండ్ 3వ స్థానంలో ఉంది.

ఇక ఇదే గ్రూపులో టాప్ 2లో ఉన్న స్కాట్లాండ్ జట్టు 5 పాయింట్లతో +2.164 రన్ రేట్ తో ఉంది. చివరి మ్యాచుల్లో ఆస్ట్రేలియాతో స్కాట్లాండ్ తలపడుతుంది. ఇక ఇంగ్లండ్ నమీబియాను ఎదుర్కొంటోంది. ఆస్ట్రేలియాను స్కాట్లాండ్ ఓడించడం కష్టమే. అదే సమయంలో నమీబియాపై ఇంగ్లండ్ గెలిస్తే చాలు సూపర్ 8 కు చేరుతుంది. ఈ సమీకరణాల్లో ఏమాత్రం తేడా వచ్చినా.. ఆస్ట్రేలియా ఉదాసీనంగా ఉండి స్కాట్లాండ్ చేతిలో కావాలని ఓడినా ఇంగ్లండ్ ఇంటిదారి పట్టక తప్పదు. స్కాంట్లాండ్ ఓటమిపైనే ఇంగ్లండ్ సూపర్ 8 అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. దాదాపు సమీకరణాలు చూస్తే స్కాట్లాండ్ ఇంటికి.. ఇంగ్లండ్ సెమీస్ చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఏం జరుగుతుందనేది చూడాలి మరీ.